•  సకల వసతులతో రైల్వే ఐసొలేషన్‌ బోగీలు
  • తెలంగాణకు 60 కోచ్‌లు ఇచ్చిన రైల్వే
  • కొవిడ్‌ రైల్వే స్టేషన్‌గా నాంపల్లి?

హైదరాబాద్‌ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకూ కొవిడ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఈ తరుణంలో కొవిడ్‌ పాజిటివ్‌లకు చికిత్స అందించేందుకు రైల్వే శాఖ రూపొందించిన ప్రత్యేక ఐసొలేషన్‌ బోగీలు ఎంతగానో ఉపకరించనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ రోగుల కోసం సకల వసతులతో రైల్వే కోచ్‌లు సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కోరిన 60 కోచ్‌లను రైల్వే శాఖ కేటాయించింది. రోగులకు చికిత్స అందించాలంటే ప్రస్తుతమున్న ఆస్పత్రులు సరిపోవడం లేదు. కొంతమందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వమే సూచిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే ఐసొలేటెడ్‌ కోచ్‌లను వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

కాచిగూడలో అందుబాటులోకి 40 బోగీలు
హైదరాబాద్‌ (నాంపల్లి) రైల్వే స్టేషన్‌ను కొవిడ్‌ స్టేషన్‌గా మార్చడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. కొవిడ్‌ కేర్‌ బోగీలను ఇక్కడికి తరలించి రోగులకు చికిత్స అందించాలనే యోచనలో రైల్వే అధికారులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్‌ నుంచి మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడుపుతున్నారు. వాటిని వేరే స్టేషన్‌కు మార్చి ఇక్కడ కేవలం కొవిడ్‌ కేర్‌ బోగీలను మాత్రమే అందుబాటులో ఉంచాలని అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

అయితే రైల్వే శాఖ ఆమోదం పొందిన తర్వాతనే నాంపల్లిని కొవిడ్‌ రైల్వే స్టేషన్‌గా మార్చనున్నారు. ప్రస్తుతం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో 40 కోచ్‌లను రైల్వే శాఖ అందుబాటులో ఉంచింది. కొవిడ్‌ కోచ్‌లో మొత్తం 8 కూపేలు ఉంటాయి. ఒక్కో కూపేలో రెండు పడకల చొప్పున 16 మంది రోగులకు చికిత్స చేస్తారు. కోచ్‌లో కిటికీలకు దోమ తెరలు, ఎలక్ట్రికల్‌ సాకెట్లు, వైద్య పరికరాలు, ఆక్సిజన్‌ సిలిండర్లు, బయోటాయిలెట్లు, ఇతర పరికరాలను సమకూర్చారు.

బోగీల్లో వేడిని తగ్గించడం ఎలా..?
న్యూఢిల్లీ : ఐసొలేషన్‌ కోచ్‌ల్లో వేడిని ఎలా నియంత్రించాలా? అని రైల్వే శాఖ ఆలోచిస్తోంది. కొవిడ్‌ రోగుల కోసం రైల్వే శాఖ 5,321 నాన్‌ ఏసీ స్లీపర్‌ బోగీలను ఐసొలేషన్‌ కోచ్‌లుగా మార్చింది. అయితే, పగటి వేళ బోగీల్లో వేడి నుంచి రోగులకు ఉపశమనం కలిగించేందుకు కిటికీలకు వెదురు తెరలను ఏర్పాటు చేయడం, బోగీల కప్పుపై బబుల్‌ రాప్స్‌ పరవడం, వేడిని నియంత్రించే పెయింట్‌ వేయడం, చిన్న కూలర్లను ఏర్పాటు చేయడం వంటి ప్రయోగాలను రైల్వే శాఖ చేస్తోంది.

Courtesy Andhrajyothi