ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ నిబంధనలు కఠినతరం
యోగి సర్కార్‌ వివాదాస్పద నిర్ణయం
ఆందోళనకు సిద్ధమవుతున్న దళిత, మైనార్టీ సంఘాలు.
లక్నో : షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ) / షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టీ) / మైనారిటీలకు స్కాలర్‌షిప్‌ నిబంధనలను కఠినతరం చేస్తూ ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ ఇటీవల నిర్ణయించింది. కొత్త నిబంధనల ప్రకారం, అట్టడుగు వర్గాల విద్యార్థులు స్కాలర్‌షిప్‌ పొందాలంటే.. కనీసం 60శాతం మార్కులు సాధించాలి. అలాగే ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో 60శాతం మార్కులు సాధిస్తేనే ప్రయివేటు కళాశాలల్లో ప్రవేశాల్లో ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది. ఇప్పటివరకూ స్కాలర్‌షిప్‌కు మార్కుల శాతంతో లింకులేదు. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని దళిత సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ వ్యాప్తంగా ఈ నెల 11న నిరసన కార్యక్రమాలను దళిత సంఘాలు పిలుపునిచ్చాయి.
‘ఇంతకు ముందు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరూ స్కాలర్‌షిప్‌ పొందేవారు. ప్రభుత్వం 60శాతం మార్కులను తప్పనిసరి చేసింది. ఆర్థిక వెసులుబాటు నుంచి వారిని దూరం చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’ అని దళిత హక్కుల కార్యకర్త సుశీల్‌ గౌతమ్‌ విమర్శించారు.
‘విద్యా, ఉద్యోగాల్లో జనరల్‌ కేటగిరీలో వెనుకబడినవారికి 10శాతం రిజర్వేషన్లను ఇటీవల కేంద్రం కల్పించింది. దీంతో విద్యా, ఉద్యోగాల్లో వారి వాటా 50 నుంచి 60శాతానికి పెరిగింది. కానీ, వెనుకబడిన కులాలకు చెందిన విద్యార్థులకు నిబంధనలు పెడుతున్నారు. ఇది దళిత వ్యతిరేక చర్య కాదా? వృత్తివిద్యా కోర్సుల నుంచి వెనుకబడినవర్గాలను దూరం చేయాలన్న కుట్రలో భాగమే ఈ నిర్ణయం’ అని గౌతమ్‌ విమర్శించారు.
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం సరళి ప్రతిపాదన ప్రకారం… ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ ఖర్చును కేంద్రం 60శాతం, రాష్ట్రాలు 40శాతం భరించాలి. ‘చరిత్ర చూస్తే.. స్కాలర్‌షిప్‌లను ప్రాథమికంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రారంభించారు. ఎందుకంటే ఈ వర్గాల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయమైనదని ప్రభుత్వం భావించింది. దళితులు ఇప్పుడు ప్రధాన స్రవంతిలో భాగమైనా.. వారి ఆర్థిక పరిస్థితి అలాగే ఉన్నది. రిజర్వేషన్ల కారణంగా.. ఎంబీబీఎస్‌, బీటెక్‌, ఎంబీఏ వంటి వృత్తివిద్యా కోర్సుల్లో దళిత విద్యార్థులు పెరిగారు. కానీ, ఇప్పుడు తగ్గుతారు… అలా తగ్గించాలన్న కుట్రలో భాగంగానే బీజేపీ సర్కార్‌ కొత్త నిబంధన తెచ్చింది. 60శాతం మార్కులు తప్పనిసరి చేస్తే ప్రొఫెషనల్‌ కోర్సులపై వారికి ఆసక్తి కచ్చితంగా తగ్గుతుంది’ అని మరో దళిత నేత సతీశ్‌ ప్రకాశ్‌ అన్నారు.

Courtesy Nava telangana…