– మరో 20 ప్రయివేటుకు యాజమాన్య బదిలీకి రెడీ : కేంద్ర ఆర్థిక మంత్రి అనురాగ్‌ సింగ్‌

న్యూఢిల్లీ : దేశంలోని ఆరు ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయాలని మోడీ సర్కార్‌ యోచిస్తోంది. మరో 20 పీఎస్‌యూలను ప్రయివేటీకరించడానికి కసరత్తు చేస్తుంది. ఇదే విషయాన్ని సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ లోకసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఆయా ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాల ఉపసంహరణకు సంబంధించిన ప్రక్రియ వివిధ దశల్లో ఉందని మంత్రి వెల్లడించారు. డిజిన్వెస్ట్‌మెంట్‌ పాలసీ ప్రకారం పీఎస్‌యూల్లో మెజార్టీ, మైనార్టీ వాటాల విక్రయం కొనసాగుతుందన్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు 34 పీఎస్‌యూల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన ప్రతిపాదనలకు నిటియోగ్‌, కేంద్ర ప్రభుత్వం ఆమోదాలు తెలిపాయని మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు ఎనిమిదింటిలో పూర్తి చేశామన్నారు. మరో 6 పీఎస్‌యూలను మూసి వేయడం, మిగితా 20 సంస్థల్లో వాటాల విక్రయానికి సంబంధించిన ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు.

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, ఆర్‌ఇసి, హాస్పిటల్‌ సర్వీసెస్‌ కన్సల్టెన్సీ, నేషనల్‌ ప్రాజెక్ట్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌, టీహెచ్‌డీసీ ఇండియా, నార్త్‌ ఈస్టర్న్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌, కమరాజర్‌ పోర్ట్‌ తదితర వాటిలో మెజార్టీ వాటాల విక్రయ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఆయా సంస్థల్లో మెజారిటీ వాటాలను అమ్మడం ద్వారా ప్రభుత్వం ప్రాధాన్యత వాటాదారుగా ఉండబోదని మంత్రి తెలిపారు. యాజమాన్య హక్కులు బదిలీ కానున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగుల భద్రతకు సంబంధించి మంత్రి సమాధానం ఇస్తూ.. కంపెనీ కొత్త మేనేజ్‌మెంట్‌ చూసుకుంటుందన్నారు. అయితే వాటా విక్రయ సమయంలోనే దీనిపై తగు స్పష్టత ఇవ్వడం ద్వారా ఒప్పందాలు పూర్తి అవుతాయన్నారు. పీఎస్‌యూలను విక్రయించకూడదని గత కొన్ని రోజులుగా వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, ఆయా సంస్థల ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

మూసివేసేవి..
హిందుస్థాన్‌ ఫ్లూరోకార్బన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఫ్‌ఎల్‌).
– స్కూటర్స్‌ ఇండియా.
– భారత్‌ పంప్స్‌ అండ్‌ కంప్రెషర్స్‌.
– హిందుస్థాన్‌ ప్రిఫాబ్‌.
– హిందుస్థాన్‌ న్యూస్‌ ప్రింట్‌.
– కర్నాటక అంటీ బయోటిక్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌.
ప్రయివేటీకరణ జాబితాలో..
– ప్రాజెక్ట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా.
– ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్‌ ఇండియా.
– బిడ్జీ అండ్‌ రూప్‌ కో.
– సిమెంట్‌ కార్పొరేషన్‌ (సీసీఐ).
– సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌.
– భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ (బీఈఎంఎల్‌).
– ఫెర్రో స్క్రాప్‌ నిగమ్‌.
– నాగర్నర్‌ స్టీల్‌.

Courtesy Nava Telangana