ఆరుగురు రైతుల ఆత్మహత్య .. పండుగ పూట విషాదం 

 పంటపై ఎన్నో ఆశలతో ఆ అన్నదాతలు చేసిన అప్పులే వారి పాలిట యమపాశాలయ్యాయి. దీపావళి పండుగ పూట వారి ఇళ్లల్లో అంతులేని విషాదాన్ని నింపాయి. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు పండక, అప్పులు తీర్చే మార్గం లేక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆరుగురు రైతులు శుక్ర, శనివారాల్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం పోచారం తండాకు చెందిన వాంకుడోత్‌ చందు(35) మొక్కజొన్న, వరి సాగు చేయగా, దిగుబడి సరిగా రాక శనివారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే, ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం చింతపల్లిలో రాయపాటి రాజేశ్‌ (24) పంట నష్టంతో అప్పులు తీర్చలేక శుక్రవారం పొలం వద్దే క్రిమిసంహారక మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం పర్వత్‌పల్లిలో కూర్వ రాసూర్‌ శ్యాంసుందర్‌ (31), వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్‌కు చెందిన సత్యారెడ్డి(30), మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారంలో పిట్ల పోచ్య(41)లు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పత్తి, కంది, వరి పంటలు నష్టపోయి బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా, నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చిన్ననారాయణపురానికి చెందిన యాదయ్య పంటలు సాగు చేయగా వర్షాలకు నష్టం వాటిల్లింది. అప్పులు తీర్చేందుకు కుమారుడు శంకర్‌ (21)ను ఉద్యోగం చూసుకోమని మందలించాడు. ఉద్యోగం దొరకలేదన్న మనస్థాపంతో శంకర్‌ ఈ నెల 12న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చర్లపల్లి సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Courtesy Andhrajyothi