– విద్యా సంవత్సరంపై అంతా గందరగోళం
– ఆహారభద్రతకు 6.4 కోట్ల మంది దూరం
– మధ్యాహ్న భోజనం పునరుద్ధరించాలి : ఎన్‌ హెచ్‌ ఆర్‌ సీ

న్యూఢిల్లీ : కోవిడ్‌-19 సంక్షోభం కారణంగా మనదేశంలో 6.4కోట్ల మంది బాలలు ఆహార భద్రతకు దూరమయ్యారని ‘జాతీయ మానవ హక్కుల కమిషన్‌’ ఆవేదన వ్యక్తం చేసింది. అంగన్‌వాడీ సేవలు స్తంభించిపోయాయని, 25కోట్ల మంది బాలలు విద్యకు దూరమయ్యారని ‘కోవిడ్‌ నేపథ్యంలో బాలల హక్కుల’పై రూపొందించిన నివేదికలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది. బాలల హక్కుల పరిరక్షణలో రాష్ట్రాలు, కేంద్రం పలు చర్యలు చేపట్టాలని ఈ నివేదికలో సూచించింది. ముఖ్యంగా ఐదేండ్లలోపు బాలల ఆరోగ్యం, పోషకాహారం, విద్య, సంరక్షణ వ్యవస్థలను పటిష్టపర్చాలని తెలిపింది. కోవిడ్‌-19 సంక్షోభం వల్ల బాలల సంక్షేమం, హక్కుల పరిరక్షణ తీవ్రంగా ప్రభావితమయ్యాయని పేర్కొన్నది. ఈ నివేదిక పేర్కొన్న మరికొన్ని విషయాలు ఈ విధంగా ఉన్నాయి…

మధ్యాహ్న భోజనం ఆగరాదు..
మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అందాల్సిన పోషకాహారం పూర్తిగా ఆగిపోయింది. ఐసీడీఎస్‌ సేవలు నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ సమయంలో బాలలు పెద్ద సంఖ్యలో సరైన ఆహారం లేక చాలా ఇబ్బంది పడ్డారు. కొన్ని అంచనాల ప్రకారం అంగన్‌వాడీ సేవలు నిలిచిపోవటం వల్ల 6.4కోట్ల మంది పిల్లలు ఆహార భద్రతను కోల్పోయారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్రాలు, కేంద్రం చట్టపరమైన చర్యలు చేపట్టాలి. అంతర్జాతీయ ప్రమాణాల్ని నెలకొల్పడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి పూర్తిస్థాయిలో పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతగానో ఉంది.

హెల్ప్‌లైన్‌కు ఫోన్తు వస్తున్నాయి..
కోవిడ్‌-19 కారణంగా దేశంలో 25కోట్ల మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. డిజిటల్‌ విద్య లేదనే కారణంతో కొంతమంది మనోవేదనకు గురై ఆత్మహత్య పాల్పడుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. ‘ఆక్స్‌ఫామ్‌’ నివేదిక ప్రకారం తమ పిల్లలు డిజిటల్‌ విద్యను పొందలేకపోతున్నారని 75శాతం తల్లిదండ్రులు చెప్పారు. బాలలపై హింస, లైంగికదాడులు సైతం పెరిగాయి. గత కొంతకాలంగా హెల్ప్‌లైన్‌కు ఫోన్లు చేస్తున్నవారి సంఖ్య కూడా పెరిగింది.

ఆటంకాల్లేకుండా వ్యాక్సినేషన్‌
పీహెచ్‌సీ, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో బాలలకు వైద్య సేవలు కొనసాగేట్టు చూడాలి. షెడ్యూల్‌ ప్రకారం చేపట్టాల్సిన వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఆటంకం రాకుండా రాష్ట్ర ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టాలి. రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలతో వచ్చే బాలికలకు వైద్య సేవలు అందించాలి. ఐరన్‌ మందు బిళ్లలను సరఫరా చేయాలి.

Courtesy Nava Telangana