-సీజీహెచ్‌ఆర్‌ అధ్యయనం
– 8 రాష్ట్రాల్లో అధికం.. తెలుగు రాష్ట్రాల్లోనూ..

న్యూఢిల్లీ : దేశంలో ప్రతి ఏటా 58 వేల మంది ప్రజలు పాముకాటుకు బలవుతున్నారు. గడిచిన 20 ఏండ్లలో ఈ తరహా మరణాల లెక్కల ఆధారంగా కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటో ఆధ్వర్యంలో నిర్వహించిన సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ రీసెర్చ్‌ (సీజీహెచ్‌ఆర్‌) అధ్యయనంలో తేలింది. యూకే, భారతీయ అధ్యయనవేత్తల సహకారంతో రూపొందించిన ఈ అధ్యయనాన్ని ఇటీవల విడుదల చేశారు.

ఇందులో పేర్కొన్న అంశాల ప్రకారం.. భారత్‌ లో గడిచిన 20 ఏండ్లలో దాదాపు 12 లక్షల మంది పాముకాటుకు గురై ప్రాణాలు విడిచారు. అంటే సగటున ఏటా 58 వేల మంది మరణించారు. ఇది గతంలో అంచనా వేసిన దానికంటే (మిలియన్‌ డెత్‌ స్టడీ అంచనాల ప్రకారం.. ఏటా 46 వేల మరణాలు) ఎక్కువగా ఉన్నది.

ఈ మరణాల్లో 70 శాతం ఎనిమిది రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా నమోదయ్యాయి. బీహార్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ లలో వానాకాలం సీజన్‌ (జులై నుంచి సెప్టెంబర్‌) లో ఈ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఈ సీజన్‌లో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండటంతో రైతులు రాత్రిపూట కూడా వ్యవసాయ క్షేత్రాల్లోనే పనులు చేయాల్సి రావడంతో వారు అధికంగా పాముకాట్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక భారత్‌లో ప్రతి 250 మందిలో ఒక వ్యక్తి పాముకాటుకు బలవుతున్నాడనీ, ఇది కొన్ని ప్రాంతాల్లో వందకు ఒక్కరిగా ఉందని ఈ అధ్యయనాన్ని చేపట్టిన సీజీహెచ్‌ఆర్‌ సీనియర్‌ ప్రొఫెసర్‌ ప్రభాత్‌ ఝా అన్నారు.

Courtesy Nava Telangana