57శాతం భారత ఉద్యోగుల్లో ఆందోళన: డబ్ల్యూఈఎఫ్‌ 

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది కాలంలో ఉద్యోగం ఉంటుందా.. ఊడుతుందా..? అని ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా (54 శాతం) వేతనజీవులు ఆందోళన చెందుతున్నారట. భారత ఉద్యోగుల్లో వీరి వాటా 57 శాతంగా ఉందని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌(డబ్ల్యూఈఎఫ్‌) తాజా సర్వే నివేదిక వెల్లడించింది. రష్యాలోనైతే 75 శాతం మంది ఆందోళన చెందున్నారట. అయితే, భవిష్యత్‌ ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్య శిక్షణలో తమ యాజమాన్యం సాయపడుతుందని ప్రపంచ ఉద్యోగుల్లో మూడింట రెండొంతుల మంది నమ్మకంగా ఉన్నారు. భారత ఉద్యోగుల్లో 80 శాతం తమకు కొత్త నైపుణ్యాలను నేర్చుకోగలుగుతామని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన ‘జాబ్స్‌ రీసెట్‌ సమ్మిట్‌’లో డబ్ల్యూఈఎఫ్‌ ఈ నివేదికను విడుదల చేసింది. 27 దేశాల్లోని 12,000కు పైగా ఉద్యోగులను సర్వే చేసినట్లు సంస్థ తెలిపింది.

అంచనాల కంటే వేగంగా యాంత్రీకరణ
కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు అంచనాల కంటే వేగంగా కార్యకలాపాలను యాంత్రీకరిస్తున్నాయని డబ్ల్యూఈఎఫ్‌ వెల్లడించింది. భారత్‌లోని కంపెనీల కార్యకలాపాల యాంత్రీకరణ, డిజిటలీకరణ రేటు ప్రపంచ సరాసరి కంటే అధికమని తెలిపింది.

ఆర్థిక వ్యవస్థల పరివర్తనంలో ఆ ‘20’ కీలకం
భవిష్యత్‌లో ఆర్థిక వ్యవస్థల పరివర్తనానికి యాంటీ వైరల్‌, స్పేస్‌ఫ్లైట్లు, హైపర్‌లూప్‌, జీన్స్‌, డీఎన్‌ఏ సీక్వెన్స్‌, జలాలపై హక్కులు సహా 20 వ్యాపారాలు కీలకం కానున్నాయని డబ్ల్యూఈఎఫ్‌ పేర్కొంది. కృత్రిమ మేధ, ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ, శాటిలైట్‌ సర్వీసులు, విద్యుత్‌ వాహనాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాల రీసైక్లింగ్‌, డిజిటల్‌ ఆర్థిక సేవలు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వ్యాపారాలకు బాటలు వేసేందుకు భారత్‌ సహా పలు దేశాలు సామాజికంగా, వ్యవస్థాగతంగా మరింత వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని డబ్ల్యూఈఎఫ్‌ పేర్కొంది.

Courtesy Andhrajyothi