• సోషల్‌ ఆడిట్‌కు రికార్డులు సమర్పించని శాఖలు
  • ఉపాధి నిధులపై కొరవడిన జవాబు దారీతనం
  • విజయనగరం జిల్లాలోనే రూ.132.24 కోట్లు

ఉపాధిహామీ నిధుల వినియోగానికి సంబంధించిన రికార్డులను ప్రభుత్వానికి సమర్పించడంలో పనులు చేపట్టిన శాఖలు నిర్లక్ష్యం వహించడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక తనిఖీ బృందానికి రికార్డులు ఇవ్వని నిధుల విలువ రూ.563.59 కోట్లు ఉంది. ఆడిట్‌ సమయంలో రికార్డులు సమర్పించని విషయం ఏటా వెలుగులోకి వస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఖర్చులు చూపించి మురిసిపోవడం తప్ప చేసిన ఖర్చుల వినియోగంపై తగిన శ్రద్ధ చూపలేదు. ఇదే అదునుగా భావించి ఫీల్డ్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ నుంచి ఎపిఒ, ఎంపిడిఒ వరకూ ఎవరూ ఖర్చుల రికార్డులు చూపించకుండా నెట్టుకొస్తున్నారు. ఉపాధి నిధులతో పనులు చేపట్టే ఇతర శాఖలు కూడా రికార్డులు చూపించకుండా తప్పించుకుంటున్నాయి. పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో రూ.563.59 కోట్లకు రికార్డులు చూపించడం లేదని సోషల్‌ ఆడిట్‌ బృందం నివేదిక తయారు చేసి ఊరుకుంది. ఉపాధి నిధుల వినియోగంపై తనిఖీలు నిర్వహించి తప్పులను పట్టుకొని, దుర్వినియోగమైన నిధులను రాబట్టాల్సిన విజిలెన్స్‌ విభాగం కూడా అంత చురుగ్గా వ్యవహరించడం లేదు. విజిలెన్స్‌ విభాగంలో ఉన్న అధికారులు తన సహచర ఉద్యోగుల తప్పులను ఎత్తిచూపడానికి ఇష్టపడటంలేదు. ప్రభుత్వ ఉద్యోగులుగానీ, కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడని అధికారులు, ఉపాధి నిధుల వినియోగంపై రికార్డులు చూపించని ప్రభుత్వ శాఖల అధికారుల దగ్గరకొచ్చేసరికి మౌనం వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంతవరకూ డ్వామా సహా ఉపాధి నిధులతో వివిధ పనులు చేపట్టే పశుసంవర్థకశాఖ, అటవీశాఖ, ఉద్యానశాఖ, గృహనిర్మాణశాఖ, ఐటిడిఎ, పంచాయతీరాజ్‌ (ఇంజనీరింగ్‌), పాఠశాల విద్య, డిఆర్‌డిఎ, వాటర్‌షెడ్‌ విభాగాలేవీ సరిగా రికార్డులు చూపించడం లేదు. విద్యాశాఖకు సంబంధించి రాష్ట్రంలో ఒక్క విశాఖ జిల్లాలో మాత్రమే రూ.18.14 లక్షల విలువైన పనులకు రికార్డులు చూపలేదు. వాటర్‌ షెడ్‌ పనులకు సంబంధించి ప్రకాశం జిల్లాలో రూ.8.70 కోట్లు, చిత్తూరు జిల్లాలో రూ.16.34 లక్షలకు రికార్డులు చూపించడం లేదు. అత్యధికంగా రూ.132.24 కోట్ల విలువైన పనులకు రికార్డులు చూపించని జిల్లాలో విజయనగరం మొదటిస్థానంలో ఉంది. రెండోస్థానంలో రూ.102.63 కోట్లతో ప్రకాశం, మూడో స్థానంలో రూ.71.53 కోట్లతో కర్నూలు జిల్లాలున్నాయి. అతి తక్కువగా కృష్ణా జిల్లాలో రూ.36 లక్షల విలువైన పనులకు రికార్డులు చూపించలేదు. వందల కోట్ల రూపాయల విలువైన పనులకు రికార్డులు ఎందుకు చూపించలేదన్న విషయం అధికారుల వద్ద ప్రస్తావించినప్పుడు సరిపడని సమాధానాలతో సమర్ధించుకుంటున్నారు. అధికారులు బదిలీపై వెళ్లడం, చనిపోవడం, ఉద్యోగవిరమణ కావడం వంటి కారణాల వల్ల సోషల్‌ ఆడిట్‌కు రికార్డులు చూపించలేని పరిస్థితి ఏర్పడి ఉంటుందని చెప్పుకొస్తున్నారు.

(COURTECY PRAJASHKTHI)