• గత ఏడాదిలో నమోదైనవి 3,000
  • విజయవాడలో ఆర్‌ఓసీ కార్యాలయం ప్రారంభించి ఏడాది

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఏడాది (2019) ఆంధ్రప్రదేశ్‌లో 525 కంపెనీల మూసివేతకు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ)కి దరఖాస్తు చేసుకున్నాయి. అనుకున్న విధంగా నిధుల సమీకరణ చేయలేకపోవడం, ఉత్పత్తులకు గిరాకీ లేకపోవడం, ఊహించిన విధంగా ప్రభుత్వ ప్రాజెక్టులు చేతికి రాకపోవడం, నష్టాలు తదితర కారణాలతో ఈ కంపెనీలు మూతపడ్డాయి. వీటితోపాటు గత రెండేళ్లుగా ఆస్తులు, అప్పుల పట్టికను సమర్పించని 971 కంపెనీలను ఆర్‌ఓసీ రద్దు చేసింది. 2,927 మంది డైరెక్టర్లను అనర్హులుగా ప్రకటించారు. 2018లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,000 కంపెనీలను ఏర్పాటు చేస్తే.. 2019లో 3,000 కంపెనీలు నమోదయ్యాయి. 2020 జనవరి ఒకటి నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 32,691 కంపెనీలు ఉండగా.. 20,000 కంపెనీలు చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని కంపెనీల రిజిస్ట్రార్‌ డెన్నింగ్‌ బాబు, సహాయ ఆర్‌ఓసీ సాయి శంకర్‌ లండా తెలిపారు. మిగిలిన కంపెనీలు రద్దు చేసే స్థితికి వచ్చాయన్నారు. విజయవాడలో ఆర్‌ఓసీ కార్యాలయాన్ని ప్రారంభించి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో ఆర్‌ఓసీ కార్యాలయ సిబ్బందితోపాటు కంపెనీ సెక్రటరీస్‌ అమరావతి చాప్టర్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

3 రోజుల్లో ఈ-ఫారమ్‌ ప్రాసెస్‌ : గత ఏడాది కాలంలో వివిధ కంపెనీలు ఆర్‌ఓసీకి సమర్పించిన 5,000 ఎలకా్ట్రనిక్‌ ఫారమ్‌ (ఈ-ఫారమ్‌)లను ప్రాసెస్‌ చేశారు. గతంలో ఒక ఈ-ఫారమ్‌ను ప్రాసెస్‌ చేయడానికి సగటున నెల రోజులు పట్టేది. ప్రస్తుతం మూడు రోజుల్లోనే ప్రాసెస్‌ చేసి అనుమతులు ఇస్తున్నామని ఆర్‌ఓసీ వర్గాలు తెలిపాయి. 2019లో మొత్తం 50 కంపెనీలపై ఆర్‌ఓసీకి ఫిర్యాదులు అందాయి. విగో రైడిన్‌ ఫన్‌, బిట్‌ కాయిన్‌ ఇండియా, లుకాస్‌ షాపింగ్‌ షాపింగ్‌, సెర్ఫా మార్కెటింగ్‌, వంటి కంపెనీలపై ఆర్‌ఓసీ కఠిన చర్యలు తీసుకుంది. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ.. కంపెనీ సెక్రటరీలు, చార్టర్డ్‌ అకౌంటెంట్ల సహాయ సహకారాలతో కంపెనీల కార్యకలాపాలు సజావుగా సాగడానికి విజయవాడ ఆర్‌ఓసీ కార్యాలయం కృషి చేస్తోందని డెన్నింగ్‌ బాబు వివరించారు.

Courtesy Andhrajyothi