ఎఫ్‌బీఐ డేటా వెల్లడి

వాషింగ్టన్‌ : గతేడాదిలో అమెరికాలో విద్వేషపూరిత హత్యలు రికార్డు స్థాయిలో పెరిగాయని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) సోమవారం విడుదల చేసిన వార్షిక డేటా తెలిపింది. గత దశాబ్ద కాలంలో విద్వేష నేరాల సంఖ్య కూడా తీవ్రంగానే పెరిగిందని డేటా సూచిస్తోంది. ఇందులో మెజారిటీ నేరాలు వర్ణ వివక్షత, జాతుల మధ్య విభేదాలు వంటి కారణాలతోనే జరిగాయని పేర్కొంది. 2019లో 51మంది హత్యకు గురి కావడమో లేదా నిర్లక్ష కారణంగా సాగిన మారణకాండలో హతులు కావడమో జరిగిందని ఎఫ్‌బీఐ డేటా పేర్కొంది. అంతకుముందు సంవత్సరం ఇటువంటి కారణాలతో 24మంది చనిపోయారు. 1990వ దశకం తొలినాళ్ళలో ఎఫ్‌బీఐ డేటా పొందుపరచడం ఆరంభించిన నాటి నుండి పోల్చుకుంటే బాధితుల పరంగా చూసినట్లైతే 2018 సంవత్సరమే ప్రాణాంతక సంవత్సరంగా నమోదైందని యాంటీ డిఫమేషన్‌ లీగ్‌ (ఏడీఎల్‌) పేర్కొంది. ఒక విద్వేష నేరంలో ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నట్లైతే మొత్తం ఆ వ్యక్తి కమ్యూనిటీ మనోభావాలు దెబ్బతింటాయనీ, అందువల్లే ప్రజలు అభద్రతా భావంతో, భయపడుతున్నారని ఏడీఎల్‌ సీఈఓ జొనాథన్‌ గ్రీన్‌బ్లాట్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2019లో ఎఫ్‌బీఐ 15,588 లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలు డేటా అందచేయగా, 7314 విద్వేష నేరాలు జరిగినట్టు వెల్లడైంది. 2018లో ఈ సంఖ్య 7120గా వుందని స్థానిక మీడియా తెలిపింది. 2014 నుండి దాదాపు ప్రతి ఏటా నేరాలు పెరుగుతునే వచ్చాయి.

Courtesy nava telangana