– పేదలకు 12 కిలోల బియ్యం ఓకే..1500 బంద్‌
– ఆసరా పింఛన్లు ఇస్తం.. అప్పుల కిస్తీలు విధిగా చెల్లిస్తాం
– ఆర్థిక శాఖపై సమీక్షలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయిన దృష్ట్యా ప్రజాప్రతినిధుల మే నెల వేతనాల్లో కూడా 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఆదాయం బాగా తగ్గిపోయిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సుధీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. ”రాష్ట్రానికి ప్రతి నెలా రూ.12 వేల కోట్ల వరకు ఆదాయం రావాలి. లాక్‌ డౌన్‌ కారణంగా ఆదాయం మొత్తం పడిపోయింది.

మే నెలలో కేంద్రానికి వెళ్లే పన్నుల్లో రాష్ట్ర వాటాగా రావాల్సిన 982 కోట్ల రూపాయలతో కలిపి కేవలం 3,100 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇటీవల ప్రభుత్వం లాక్‌ డౌన్‌ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదు. రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదు. ఆ డబ్బులతోనే అన్ని అవసరాలు తీరడం కష్టం. రాష్ట్రం ఏడాదికి 37,400 కోట్ల రూపాయలను అప్పులకు కిస్తీలుగా చెల్లించాలి. అప్పులను రీ షెడ్యూల్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరితే ఆ పని చేయలేదు. దీంతో కిస్తీలు తప్పక కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచినప్పటికీ, కేంద్రం విధించిన అనేక షరతుల కారణంగా అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితి లేదు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు పూర్తిగా చెల్లిస్తేనే మూడు వేల కోట్లకు పైగా వ్యయం అవుతుంది. ఖజానా ఖాళీ అవుతుంది. ఇక ఏ చెల్లింపు, ఏ పనీ చేసే వీలుండదు. కాబట్టి తగిన వ్యూహం అనుసరించాలి” అని అధికారులు సీఎంకు వివరించారు.

సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు..
– ఆసరా పెన్షన్లను యధావిధిగా అందించాలి.
– లాక్‌ డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని జూన్‌లోనూ ఇవ్వాలి.
– లాక్‌ డౌన్‌ సడలింపుల కారణంగా కార్మికులు, కూలీలకు మళ్లీ పని దొరుకుతున్న నేపథ్యంలో ప్రతి కుటుంబానికీ 1500 నగదు ఇచ్చే కార్యక్రమం జూన్‌లో కొనసాగదు.

భయమొద్దు.. అప్రమత్తత ముద్దు
కరోనా ఉధృతం కాలేదు : సీఎం కేసీఆర్‌
కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావా ల్సిన అవసరం లేదనీ, లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించి నప్పటికీ వైరస్‌ వ్యాప్తి ఉధతంగా ఏమీ లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తెలిపారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఒక వేళ రాబోయే రోజుల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగితే తగిన వైద్య సేవలు అందించడానికి వైద్యారోగ్య శాఖ సంసిద్ధంగా ఉందని ప్రకటించారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

‘కరోనా వైరస్‌ సోకినప్పటికీ చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే కొద్ది మందిలో మాత్రం లక్షణాలు కనిపిస్తున్నాయి. వారికి మంచి వైద్యం అందించాలి. సీరియస్‌గా ఉన్న వారి విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి. వారిని ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందించాలి. పాజిటివ్‌గా తేలినప్పటికీ లక్షణాలు లేని వారిని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ప్రజలు కూడా లాక్‌డౌన్‌ నిబంధనలు, కోవిడ్‌ మార్గదర్శకాలు పాటించాలి. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి’ అని సీఎం సూచించారు.

‘కొన్ని అంచనాల ప్రకారం రాబోయే రెండు, మూడు నెలల్లో దేశంలో పాజిటివ్‌ కేసులు పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు ఎక్కువైనా సరే, ఎంత మందికైనా వైద్యం అందించడానికి అవసరమైన పీపీఈ కిట్లు, టెస్టు కిట్లు, మాస్కులు, బెడ్లు, వెంటిలేటర్లు, ఆసుపత్రులు అన్నీ సిద్ధంగా ఉన్నాయి’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఈ సందర్భంగా వైద్యశాఖ అధికారులు, వైద్య నిపుణులు, కోవిడ్‌ -19 విషయంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న రాష్ట్ర స్థాయి కమిటీ ప్రతినిధులు ప్రస్తుత పరిస్థితిని సీఎంకు వివరించారు. ”ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం వైరస్‌ సోకిన తర్వాత కూడా అత్యధిక శాతం మందిలో కనీసం వ్యాధి లక్షణాలు కూడా కనిపించడం లేదు. వైరస్‌ సోకిన వారిలో 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వారికి ఎలాంటి వైద్యం కూడా అవసరం లేదు. 15 శాతం మందిలో జలుబు, జ్వరం, దగ్గు, దమ్ము లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలున్న వారు త్వరగానే కోలుకుంటారు. మిగతా ఐదు శాతం మందిలో మాత్రమే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. వీరి విషయంలోనే ఎక్కువ శ్రద్ధ అవసరం. వీరిలోనే మరణించే వారు ఎక్కువగా ఉంటారు. భారతదేశంలో 2.86శాతం, తెలంగాణలో 2.82శాతం మర ణాల రేటు ఉంది. మరణించిన వారిలోనూ ఇతర సీరియస్‌ జబ్బులు ఉన్న వారే. కరోనాకు వ్యాక్సిన్‌, ఔషధం లేనందున ప్రజలు అప్రమత్తంగా ఉండడం అవసరం. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం అవసరం” అని వైద్యాధికారులు, నిపుణులు వివ రించారు. సమావేశంలో మంత్రులు కెటి రామారావు, ఈటల రాజెందర్‌, నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస గౌడ్‌, పువ్వాడ అజరు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంత కుమారి, రామకష్ణ రావు, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ కరుణాకర్‌ రెడ్డి, డీఎంఈ రమేశ్‌ రెడ్డి, డీపీహెచ్‌ శ్రీనివాస్‌, మెడికల్‌ హెల్త్‌ సలహాదారు గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆహారోత్పత్తిలో తెలంగాణ నెంబర్‌వన్‌..
రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు :ఎఫ్‌సీఐ సీఎమ్‌డీ డీవీ ప్రసాద్‌
– రైతులకు సీఎం అభినందన
దేశానికి కావాల్సిన ఆహారాన్ని అందిచటంలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలిచిందని భారత ఆహార సంస్థ (ఎఫ్‌ సీఐ) సీఎమ్‌డీ డీవీ ప్రసాద్‌ ప్రకటించారు. దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా రాష్ట్రం అవతరించిందని అభినందిం చారు. 2020 యాసంగిలో తాము సేకరించిన
ఆహారోత్పత్తిలో మొత్తం ధాన్యంలో 63 శాతం కేవలం తెలంగాణ నుంచే వచ్చిందని తెలిపారు. మిగతా అన్ని రాష్ట్రాల నుంచి కలిపి 37 శాతాన్ని సేకరించినట్టు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి ఈసారి ప్రభుత్వ రంగ సంస్థలు రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిపాయని వివరించారు. దేశవ్యాప్తంగా ఎఫ్‌సీఐ ఈ యాసంగిలో ఇప్పటిదాకా 83.01 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా, అందులో తెలంగాణ రాష్ట్రం నుంచే 52.23 లక్షల టన్నులు వచ్చిందని స్పష్టం చేశారు. ఈసారి 91.07 లక్షల టన్నుల ధాన్యం సేకరించేందుకు లక్ష్యంగా నిర్ణయించుకోగా.. అందులో ఇప్పటికే తెలంగాణ నుంచి సగానికి పైగా సమకూరిందని అభినందించారు. ఆ రాష్ట్రంలో యాసంగిలో ఎక్కువ వరి పంట పండినందున అది దేశ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడిందంటూ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. దేశానికే తిండి పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదగటం మనకెంతో గర్వకారణమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తాము సేకరించిన ధాన్యంలో తెలంగాణ నుంచి సేకరించిందే అత్యధికమంటూ ఎఫ్‌సీఐ ప్రకటించిన నేపథ్యంలో సీఎం.. రాష్ట్ర రైతాంగాన్ని అభినందించారు. కేసీఆర్‌ తీసుకున్న చర్యల ఫలితంగానే రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడులు పెరిగాయని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి పేర్కొన్నారు. దీని వెనుక సీఎం దార్శనికత ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పల్లా… బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో ఒకే రోజు వందకుపైగా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల నమోదు తర్వాత ఒకే రోజు అత్యధికంగా బుధవారం 107 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 2139 మందికి పాజిటివ్‌ రాగా 1321 మంది కోలుకున్నారు. బుధవారం మరణించిన ఆరుగురితో కలుపుకుని 63 మంది అయ్యారు. ప్రస్తుతం 714 మంది ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసజీవులు 297 మందిలో వైరస్‌ బయటపడింది. గత 14 రోజుల నుంచి పాజిటివ్‌ కేసులు రాని జిల్లాల సంఖ్య 20కి తగ్గింది. ఇదిలా ఉండగా 458 మంది సౌదీ అరేబియా నుంచి రాగా వారిలో పాజిటివ్‌ వచ్చిన వారిలో 82 మంది కోలుకున్నారు. మొత్తం వలసజీవులు 154 మంది కోలుకున్నారు.

Courtesy Nava Telangana