భారత్‌లో 4.58 కోట్లమంది మహిళలు అదృశ్యం..
గత 50 ఏండ్లలో రెట్టింపు : ఐరాస నివేదిక
వేధింపులు, అంగ వైకల్యం, బాల్య వివాహాలు…ప్రధాన కారణాలు
– 2013-17మధ్య 4.6లక్షల ఆడ శిశువులు మిస్సింగ్‌

కడుపులో ఉన్నది ఆడపిల్ల…అంటూ అబార్షన్లు చేయించటం, పుట్టిన శిశువును ఎక్కడో పడేయటం, బాల్య వివాహాలు, అంగవైకల్యం గలవారిని అవమానించటం, వేధింపులు…తదితర కారణాలు భారతదేశంలో 4.58కోట్ల మంది మహిళలు అదృశ్యం అవ్వడానికి దారితీసింది. గత 50 ఏండ్లలో ఇలాంటి వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 14.3కోట్లకు చేరుకుంది. సరిగ్గా 50ఏండ్ల క్రితం 1970లో అదృశ్యమైన మహిళల సంఖ్య 6.1కోట్లుగా ఉంటే, నేడది రెట్టింపు అయ్యింది.
– ‘ద స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌-2020′ నివేదిక

వాషింగ్టన్‌ : ప్రపంచవ్యాప్తంగా మహిళల అదృశ్యం కేసుల్లో దాదాపు 35శాతం భారత్‌లోనే నమోదవుతున్నాయని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక తేల్చింది. ఐరాసకు చెందిన ‘పాపులేషన్‌ ఫండ్‌’ ఈ నివేదికను మంగళవారం విడుదలచేసింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు అదృశ్యమవుతున్న కేసులు గత 50 ఏండ్లలో రెట్టింపు అయ్యాయని నివేదిక తేల్చింది. భారతదేశంలో బలంగా నెలకొన్న లింగ వివక్ష…పెద్ద సంఖ్యలో మహిళల అదృశ్యానికి కారణమవు తున్నదని ఇందులో పేర్కొన్నారు. నివేదికలో పేర్కొన్న మరికొన్ని అంశాలు ఇలా ఉన్నాయి..2020నాటికి భారత్‌లో 4.58కోట్లమంది మహిళలు అదృశ్యమయ్యారు. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకొని అబార్షన్లు చేయటం, బాల్య వివాహాలు, అంగ వైకల్యం ఉన్నవారిపై వివిధ రకాల వేధింపులు, అవమానాలు, లింగ వివక్ష…ఇలాంటి 19 కారణాలు మహిళలు కనిపించకుండా పోవడానికి కారణమైందని నివేదికలో పేర్కొన్నారు.

మనదేశంలో 2013-17 మధ్య కాలంలో పుట్టిన కొద్ది సేపట్లోనే 4.6లక్షల ఆడ శిశువుల జాడ తెలియకుండా పోయింది. పుట్టింది ఆడపిల్ల అని…ఏదో ఒక చోట నిర్ధాక్షణ్యంగా వదిలేయటం, అమ్మేయటం వంటివి జరిగివుండొచ్చు! గర్భంలో ఉండగా లేదా జన్మించిన కొద్ది నిమిషాల్లో…ఆడ శిశువులు, వారి తల్లులు తీవ్ర స్థాయిలో లింగ వివక్షకు గురవుతున్నారు. ఈ విధమైన వివక్ష కారణంగా మనదేశంలో 15లక్షలమంది అదృశ్యమయ్యారు.

Courtesy Nava Telangana