– 2020లో 45మంది జవాన్లు ఆత్మాహత్య
– పని ఒత్తిడే కారణం : మాజీ సైనికులు

న్యూఢిల్లీ : కేంద్ర రిజర్వ్‌ పోలీస్‌ బలగాలలో (సీఆర్‌పీఎఫ్‌) ఆత్మ హత్యలు 55శాతం పెరిగాయి. గత ఐదేండ్లలో ఆత్మహత్యకు పాల్ప డుతున్నవారి సంఖ్య అనూహ్యంగా పెరిగిందని జాతీయ మీడియా కథనం పేర్కొన్నది. ఈ ఏడాది నవంబరు 17నాటికి 45మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాశ్మీర్‌లోని సోపోర్‌ ప్రాంతంలో అత్యధికంగా ఆత్మహత్యలు (13) చోటుచేసుకున్నాయనీ, సర్వీస్‌ రైఫిల్‌తో తమను తాము కాల్చుకొని జవాన్లు చనిపోయారని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. 2016లో 16 మంది, 2017లో 38 మంది, 2018లో 36 మంది, 2019లో 42మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని కేంద్ర హోం శాఖ సమాచారం విడుదలచేసింది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా కనపడుతున్నదని మోడీ సర్కార్‌ అంటున్నది. దీనిపై మీడియాతో మాట్లాడిన మాజీ సైనికాదికారులు, కేంద్రం చెబుతున్నదాంట్లో వాస్తవం లేదని అంటున్నారు. కఠినమైన పని పరిస్థితులు, ఏడాదంతా వారిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తిప్పటం, వారి ఆరోగ్యం, సంక్షేమం గురించి ఆలోచించకపోవటం ముఖ్య కారణమని మాజీ సైనికులు ఆరోపించారు.

అనూహ్య వాతావరణ పరిస్థితుల్లో వారిని తీసుకెళ్లినప్పుడు..జవాన్లు బస చేసేందుకు సరైన వసతులు కల్పించటం లేదనీ, సెలవులు చాలా తక్కువగా ఉండటం జవాన్లను మానసికంగా వేధిస్తున్న ప్రధాన సమస్య అని పేర్కొంటున్నారు. దీపావళి పండుగ నాడు మాత్రమే సరిహద్దుల్లో ఉన్న సైనికుల వద్దకు ప్రధాని మోడీ వచ్చి అభినందనలు తెలుపుతుంటారు. కానీ సైనికులు పడుతున్న కష్టాలు మాత్రం బీజేపీ పాలకుల కండ్లకు కనిపించవని మాజీ కమాండర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పైగా రక్షణ రంగంలోకి విదేశీ పెట్టుబడుల అనుమతి (ఎఫ్‌డీఐ)తో ఎక్కడ తమకు ఉద్యోగ భద్రత ఉండదోనన్న భయాందోళనలు వారి జీవితానికి ముగింపుపలికేలా కారణమవుతున్నా యని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదే అంశంపై, సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారి ఒకరుమాట్లాడుతూ.. ”ఆత్మహత్యలకు కారణాలు ప్రధానం గా వ్యక్తిగతమైనవి. వైవాహిక జీవితానికి దూరంగా ఉండటంతో జవాన్లలో ఒత్తిడి ఏర్పడుతోంది. అయితే ఈ రోజుల్లో సామాజిక మాధ్యమం వల్ల ఇంటివద్ద జరిగే అనేక విషయాలు జవాన్లకు చేరు తున్నాయి. బయట ప్రపంచంలోని అనేక సమస్య లు వచ్చి జవాన్లను తాకుతున్నాయి. వెంటనే సెలవుమీద ఇంటికి వెళ్లే అవకాశం సైన్యంలో ఉండదు. దాంతో ఒత్తిడి, ఒంటరితనానికి గురవుతున్నాడు” అని చెప్పారు.

పర్మినెంట్‌ కమిషన్‌లోకి 70శాతం మహిళా సైనికులు : భారత ఆర్మీ ప్రకటన
భారత సైన్యంలో కమాండ్‌ హోదాలో మహిళలు పనిచేయడానికి అర్హులేనని, అలాగే సైన్యంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా అధికారుల కు శాశ్వత కమిషన్‌ ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఏర్పాటైన స్పెషల్‌ సెలక్షన్‌ బోర్డ్‌ జరిపిన పరిశీలనతో 70శాతం మంది మహిళా సైనిక అధికారులు పర్మినెంట్‌ కమిషన్‌కు అర్హులేనని, వారు భారత సైన్యంలో పూర్తికాలం పనిచేయగలరని శుక్రవారం ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. పర్మినెంట్‌ కమిషన్‌కు 615 మంది మహిళా సైనిక అధికారుల్ని పరిశీలించగా, అందులో 422మంది అర్హులని బోర్డు తేల్చింది. తద్వారా ఇప్పుడు వీరంతా రిటైర్మెంట్‌ వయస్సు వచ్చేంత వరకు ఆర్మీలో పనిచేసే అవకాశం లభించింది. ఇంతకు ముందున్న నిబంధనల ప్రకారం, మహిళలకు పర్మినెంట్‌ కమిషన్‌ లేదు. 14 ఏండ్ల సర్వీస్‌ పూర్తిచేసుకున్న మహిళలంతా కూడా ఉద్యోగ విరమణ చేయాల్సిందే. అయితే ఈ అంశంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సుప్రీం ఆదేశాల అనుసారం మహిళల పర్మినెంట్‌ కమిషన్‌కు అర్హుల్ని ఎంపికచేసే బాధ్యత స్పెషల్‌ సెలక్షన్‌ బోర్డ్‌కు అప్పజెప్పారు. సైన్యంలోని 10 విభాగాల్లో పనిచేస్తున్న మహిళా అధికారుల్ని పర్మినెంట్‌ కమిషన్‌కు ఎంపికచేసింది.

Courtesy Nava Telangana