భోపాల్‌: అది మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం. నిజానికి ప్రపంచమంతా వైరస్ బారినపడి దాన్ని ఎదుర్కొంటున్న సందర్భం. భారతదేశంలో కూడా ఇట్లాంటి ఆపత్కాలంలో భారతీయ జనతా పార్టీ కుట్రలు పన్ని మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చింది. భౌతిక దూరం పాటించమని కేంద్రం దేశం మొత్తాన్ని ఆదేశించిన కాలంలో ఇక్కడ దీన్ని బెఖాతరు చేస్తూ బిజెపి మంత్రి మండలి ఏర్పడింది. రాష్ట్రానికి చెందిన వైద్యశాఖ ప్రధాన కార్యదర్శి కొడుకు విదేశాల నుంచి వచ్చేటప్పుడు వైరస్ బారిన పడ్డారు. దీంతో ఐఏఎస్ అధికారి అయిన ఆయన తల్లి ఇంట్లోనే గృహ నిర్బంధం అయ్యారు.

ఇంటి నుంచే అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఆదేశాలు పంపించారు. ఫైళ్ల రాకపోకలు సాగాయి. ఫలితంగా మధ్యప్రదేశ్ ముఖ్య వైద్య అధికారులతో పాటు మొత్తం 45 మంది సిబ్బందికి వైరస్ వ్యాపించింది. సదరు అధికారి ప్రభుత్వం నిర్దేశించిన కరోనా నియంత్రణ ఆసుపత్రిలో చేరకుండా ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఇప్పుడు ఆ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్న అందరికీ వైరస్ సోకే ప్రమాదం ఏర్పడింది. వైరస్ నియంత్రణ చేయవలసిన కీలక ఉన్నత ఉన్నతాధికారి ఇలా చేయటాన్ని అందరూ విమర్శిస్తున్నారు. ఇది పూర్తి బాధ్యతారాహిత్యం అని కాంగ్రెస్ పార్టా దుయ్యబట్టింది.