– 42 శాతం స్టార్టప్‌లు, ఎస్‌ఎంఈల మూసివేత
మరో ఐదారు నెలలూ గడ్డుకాలమే..
భరోసానివ్వని ఆత్మ నిర్భర్‌
కేంద్ర ప్యాకేజీపై 57 శాతం మంది పెదవి విరుపు

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌తో దేశంలో చిన్న, మధ్య తరహ పరిశ్రమ (ఎస్‌ఎంఈ)లు, స్టార్టప్‌లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో వాటి ఉనికికే ప్రమాదం వచ్చి పడిందని పలు సర్వేలు, రేటింగ్‌ ఏజెన్సీలు విశ్లేషిస్తున్నాయి. కేవలం 16 శాతం సంస్థల వద్దే సరిపడా నిధులున్నాయని ఓ సర్వేలో తేలగా.. చిన్న పరిశ్రమల రెవెన్యూలో 21 శాతం పతనం చోటు చేసుకోనున్నదని మరో కీలక ఏజెన్సీ వెల్లడించింది.

నిర్వహణ ఖర్చులు లేకపోవడంతో దేశంలో 42 శాతం స్టార్టప్స్‌, ఎస్‌ఎంఈలు దాదాపు మూడు నెలలుగా మూతపడ్డాయని సోషల్‌మీడియా వేదికగా సర్వేలు నిర్వహించే లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ ఒక రిపోర్టులో వెల్లడించింది. ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టిన ఈ సర్వేలో 8,400 స్టార్టప్‌ల నుంచి 28 వేల మంది అభిప్రాయాలతో నివేదికను రూపొందించింది. చిన్న తరహా సంస్థలకు పెద్ద మద్దతు ఇస్తామని మోడీ సర్కారు ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ భారత్‌ ఈ సంస్థల భవిష్యత్తుకు భరోసానివ్వలేదని సర్వేలో స్పష్టం అయ్యింది. లోకల్‌ సర్కిల్స్‌ సర్వే ప్రకారం.. సడలింపులు ఇచ్చినా దేశంలో స్టార్టప్‌లు, ఎస్‌ఎంఈలలో ఉత్పాదకత పెరగడం లేదు. ఆదాయాలు, డిమాండ్‌ లేకపోవడంతో ఈ సంస్థలకు నిర్వహణ ఖర్చు భారంగా మారింది. దీంతో ఏప్రిల్‌లో 27 శాతం సంస్థలు మూతపడగా.. జూన్‌ నాటికి అది 42 శాతానికి చేరింది. వీటిలో 38 శాతం సంస్థలు.. కార్యకలాపాలు ప్రారంభించడానికి తమ దగ్గర పైసల్లేవని తెలపగా, 4 శాతం సంస్థలు లాక్‌డౌన్‌ ఇబ్బందులతో మూతపడ్డాయని పేర్కొన్నాయి.

భవిష్యత్తు అవసరాల నిమిత్తం తమ వద్ద డబ్బుల్లేవని 30 శాతం కంపెనీలు తెలిపాయి. దీంతో మరో ఆరు నెలల పాటు సంస్థలు తెరిచే పరిస్థితులు కనిపించడం లేదని యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. 16 శాతం మంది యజమానులు మాత్రమే కంపెనీలను నడపగలమని దీమా వ్యక్తం చేశారు. ఇక పారిశ్రామికరంగానికి ఊతమివ్వడానికని మోడీ సర్కారు ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్‌తో కూడా ఈ సంస్థలకు ఒరిగిందేమీ లేదని సర్వే సూచిస్తున్నది. ప్యాకేజీలో భాగంగా స్టార్టప్‌లు, ఎస్‌ఎంఈ లకు కేంద్ర ప్రభుత్వం రూ. 3 లక్షల కోట్లు ప్రకటించగా.. అది సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందా అనే ప్రశ్నకు 57 శాతం మంది ‘లేదు’ అని చెప్పడం గమనార్హం. 29 శాతం మంది దాని గురించి తమకు తెలియదని చెప్పారు. 14 శాతం మంది మాత్రమే కేంద్ర ప్యాకేజీ వారికి సాయపడుతుందని తెలిపారు. ఇక ఉత్పత్తి, డిమాండ్‌ లేకపోవడంతో నిర్వహణ ఖర్చులను తగ్గించుకుంటున్నామని 65 శాతం సంస్థలు తెలిపాయి. ఇందులో భాగంగా మార్కెటింగ్‌ ఖర్చులను తగ్గించుకోవడం, ఉద్యోగుల వేతనాల్లో కోత, సిబ్బంది తగ్గింపు, పన్ను చెల్లింపులను వాయిదా వేయడం వంటివి చేస్తున్నాయి. దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఐదారు నెలలు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని దాదాపు సర్వేలో పాల్గొన్నవారందరూ తెలిపారు.

తీవ్ర సంక్షోభమే : క్రిసిల్‌ రిపోర్టు
2020-21 ఆర్ధిక సంవత్స రంలో జీడీపీ మైనస్‌ 5శాతానికి పడిపోవచ్చన్న అంచనాలతో విశ్లేషిస్తే ప్రధానంగా ఎంఎస్‌ఎంఈల్లోని అన్ని రంగాల రెవెన్యూలో దాదా పుగా 21 శాతం పతనం చోటు చేసుకునే అవకాశాలున్నాయని ప్రముఖ రేటింగ్‌, విశ్లేషణ ఏజెన్సీ క్రిసిల్‌ రీసెర్చ్‌ ఒక రిపోర్టులో వెల్లడించింది. వడ్డీలు, పన్నులు, తరుగు లాంటివి మినహాయించకముందు ఎంఎస్‌ఎం ఈల రాబడి ఏకంగా 25 శాతం పడిపోవచ్చని పేర్కొంది. కమోడిటీ ధరల తగ్గుదల, డిమాండ్‌ లేమీ వల్ల చిన్న పరిశ్రమల పరిస్థితి క్లిష్టంగా మారిందని తెలిపింది.

Courtesy Nava Telangana