ఒడిషాలో తొలిసారి

భువనేశ్వర్‌ : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలును నిలిపివేయాలనీ, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా ఒడిషాలోని 15 జిల్లాల్లోని 402 గ్రామసభలు తీర్మానాలను ఆమోదించాయి. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌. బీహార్‌ రాష్ట్రాలు తమ తమ అసెంబ్లీల్లో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా తీర్మానాలను ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే గ్రామసభలు మూకుమ్మడిగా ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే తొలిసారి. తీర్మానాలు ఆమోదించిన వెంటనే.. రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, 15 జిల్లాల కలెక్టర్లకు గ్రామ సభలు మెమోరాండం పంపాయి. గంజాం, గజపతి, సుందర్‌గఢ్‌, మల్కన్‌గిరి, కోరాపుట్‌, రాయగడ, కంధమాల్‌, బోలంగీర్‌, బార్‌గఢ్‌, కియోన్‌జార్‌, సంబల్పూర్‌, కలహండి, మయూర్‌భంజ్‌, జర్సుగూడ, జాజ్‌పూర్‌ జిల్లాల్లోని గ్రామాలు ఈ తీర్మానం చేశాయి. క్యాంపెయిన్‌ ఫర్‌ సర్వైవల్‌ విత్‌ డిగ్నిటీ (సీఎస్టీ), ఒడిషా నారి సమాజ్‌, ఇతర సామాజిక సంస్థలు ఈ గ్రామాల్లో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం నిర్వహించాయి. ‘ఈ తీర్మానాల ఆధారంగా ఓ వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి, ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపాం’ అని సీఎస్టీ నేత నరేంద్ర మొహంతి చెప్పారు. .సీఏఏ, ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన ఇతర రాష్ట్రాల తరహాలో బిజు జనతాదళ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలని మెమోరాండంలో కోరినట్టు తెలిపారు. ‘దేశంలోని అనేక రాష్ట్రాలు ఇప్పటికే వాటికి వ్యతిరేకంగా తీర్మానాలను ఆమోదించాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒడిషా ప్రభుత్వం కూడా తన వాణిని గట్టిగా వినిపించాలి’ అని సీఎస్టీ సీనియర్‌ సభ్యుడు ప్రదీప్‌ సాహు అన్నారు. ఈ నెల 18న రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో భారీ ఆందోళన కార్యక్రమానికి సీఎస్టీ, ఇతర ప్రజా సంఘాలు సిద్ధమయ్యాయి. కాగా, కరోనా ముప్పును దృష్టిలో పెట్టుకొని ఆందోళనను వాయిదావేసినట్టు సాహు చెప్పారు. తీర్మానాన్ని ఆమోదించిన 402 గ్రామసభల్లో ముఖ్యమంత్రి సొంత జిల్లా గుంజామ్‌లో 65 ఉండగా, సుందర్‌గఢ్‌ జిల్లాలోనివి 53 ఉన్నాయి.

సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందుకు.. అసోం విద్యార్థికి ఎన్‌ఐఏ సమన్లు
గువహతి : పౌర నిరసనకారులపై మోడీ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. ప్రజాస్వా మ్యయుత పద్దతిలో నిరసనల్లో పాల్గొన్నవారిపై జాతీయ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నది. తాజాగా అసోంకు చెందిన గోర్ఘా విద్యార్థి నాయకుడు రాహుల్‌ ఛెత్రికి ఎన్‌ఐఏ సమన్లు జారీ చేసింది. సీఏఏ నిరసనలకు సంబంధించి తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సాక్షిగా శుక్రవారం(నేడు) హాజరు కావాలని ఎన్‌ఐఏ ఆదేశించింది. గతంలోనూ రాష్ట్రంలోని పలువురు విద్యావేత్తలు, విద్యార్థులకు సైతం ఎన్‌ఐఏ ఇలాగే నోటీసులు జారీ చేయడం గమనార్హం. అయితే ఎన్‌ఐఏ చర్య కుట్రపూరితమని రాహుల్‌ ఛెత్రి ఆరోపించారు. ఇందుకు సంబంధించిన న్యాయ బృందాన్ని సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్టు ఆయన తెలిపారు. దిబ్రూగఢ్‌ యూనివర్సిటీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌(డీయూపీజీఎస్‌యూ) జనరల్‌ సెక్రెటరీగా ఉన్న రాహుల్‌.. భారతీయ గోర్ఖా యువ పరిసంఘ(బీజీవైపీ) అసోం రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ కూడా. ” అధికారులు పంపించిన నోటీసులు నా సోదరుడు రూబుల్‌ ఛెత్రి పేరు పైన ఉన్నవి. ఏడాది నుంచి ఆయన ఇక్కడ లేడు. ఆయనకు రాజకీయాల పైనా ఎలాంటి ఆసక్తి కూడా లేదు. సామాజిక మాధ్యమాల్లోనూ స్పందించిన దాఖలాలు లేవు. నోటీసులో రూబుల్‌ పేరు పక్కన రాహుల్‌ అని బ్లాక్‌ ఇంక్‌తో రాశారు. ఇది కుట్రపూరితం” అని రాహుల్‌ ఛెత్రి వివరించారు. దిబ్రూగఢ్‌ యూనివర్సిటీలో శాంతియుతంగా జరిగిన సీఏఏ వ్యతిరేక నిరసనల్లో తాను పాల్గొన్నాననీ, ఎన్‌ఐఏ ఇలా విచారణలకు పిలవడం దురదృష్టకరమని చెప్పారు.

యూపీ సర్కారుకు అలహాబాద్‌ హైకోర్టు నోటీసులు
లక్నో : సీఏఏ వ్యతిరేక నిరసనకారుల నుంచి నష్టపరిహారాన్ని వసూలు చేయడమే లక్ష్యంగా యూపీ సర్కారు తీసుకొచ్చిన ‘రికవరీ ఆర్డినెన్సు’పై యోగి ప్రభుత్వానికి అలహాబాద్‌ హైకోర్టు నోటీసులు పంపింది. రికవరీ ఆర్డినెన్సును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తులు గోవింద్‌ మాథుర్‌, సమిత్‌ గోపాల్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపింది. ఈ మేరకు రాష్ట్ర సర్కారుకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 25లోగా పిటిషన్‌కు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. ‘ఉత్తర ప్రదేశ్‌ రికవరీ ఆఫ్‌ డ్యామేజేస్‌ టు ప్రయివేట్‌ అండ్‌ పబ్లిక్‌ ప్రాపర్టీ ఆర్డినెన్స్‌, 2020’ను ఈనెల 13న యోగి సర్కారు ఆమోదించిన విషయం తెలిసిందే. సదరు ఆర్డినెన్సును సవాలు చేస్తూ న్యాయవాది సుశాంక్‌ శ్రీ త్రిపాఠీ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ను వేశారు.

Courtesy Nava Telangana