* తిరస్కారం, పెండింగ్‌, పరిశీలన పేర భరోసా నిలుపుదల
* అయోమయంలో సొంత భూమిదారులు
* ఆందోళనలో కౌల్దార్లు
– అమరావతి: సాగుదారులకు పెట్టుబడి సాయం అందించే వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమై ఎనిమిది రోజులు పూర్తికాగా 40 లక్షలకు పైగా రైతుల్లో డైలమా కొనసాగుతోంది. ప్రభుత్వం కోరిన విధంగా స్పష్టమైన ఆధారాలు, రికార్డులూ లేని కారణంగా లక్షల మంది కౌలు రైతులకు ‘భరోసా’ ప్రశ్నార్ధకంగా తయారైంది. పలు దశల్లో వడపోతలు, తనిఖీలు, పరిశీలనల మూలంగా లక్షల సంఖ్యలో సొంత భూమి కలిగిన రైతులతోపాటు భూమి లేని నిరుపేద కౌలు రైతులు సర్కారీ భరోసాకు అనర్హులవుతున్నారు. దక్కాల్సిన భరోసా సొమ్ము అందక నష్టపోతున్నారు. తమ అర్హతను నిరూపించుకు నేందుకు నానా పాట్లూ పడుతున్నారు. భరోసా సొమ్ము జమ అయిన వారిలో కూడా ఎంతెంత ఎక్కడి నుంచి పడిందో అర్థంకాక అయోమ యంలో చెందుతున్నారు. కేంద్ర స్కీం పిఎం కిసాన్‌ నుంచి ఎంత పడింది, రాష్ట్ర పథకమైన వైఎస్‌ఆర్‌ భరోసా తరపున ఎంత జమ అయిందో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఒకరికి ఒకలా, వేరొకరికి ఇంకోలా సొమ్ము జమ అవుతుండటమే అందుక్కా రణం. అధికారులు ఈ విషయంపై స్పష్టత ఇవ్వకుండా మొబైల్‌ ఫోన్‌కు వచ్చే ఎస్‌ఎం ఎస్‌లు చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.

జల్లెడ ఇలా
రాష్ట్ర వ్యాప్తంగా రైతుల వెబ్‌లాండ్‌ ఖాతాల సంఖ్య 79.37 లక్షలు కాగా ఎఇవొ, ఎంపిఇవొ స్థాయిలో మంగళవారం నాటికి 50.27 లక్షల ఖాతాలు భరోసాకు అర్హమైనవిగా గుర్తించారు. 18.87 లక్షల ఖాతాలను తిరస్కరించగా, 10.23 లక్షల ఖాతాలను పెండింగ్‌లో పెట్టారు. తొలిదశలో అనుమతించిన 50.27 లక్షల ఖాతాలను ఎంఎవొ స్థాయిలో పరిశీలించి 49.89 లక్షల ఖాతాలకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చారు. 28 వేల ఖాతాలను తిరస్కరించి, 9 వేల పైచిలుకు ఖాతాలను పెండింగ్‌లో పెట్టారు. ఎంఎవొ స్థాయిలో 49.89 లక్షల ఖాతాలు అర్హత సాధించగా, అనంతర ఆర్‌టిజిఎస్‌ తనిఖీల్లో 8.51 లక్షల ఖాతాలను తిరస్కరించి, 41.38 లక్షల ఖాతాలకే సొమ్ము జమ చేసేందుకు బ్యాంకులకు పంపారు. ఆధార్‌, మొబైల్‌ నెంబర్ల అనుసంధానం వంటి సాంకేతిక కారణాలతో బ్యాంకుల వద్ద 2.61 లక్షల ఖాతాలు తిరస్కారానికి గురికాగా, 38.76 లక్షల ఖాతాల్లో డబ్బు జమ అయింది. జమ అయిన ఖాతాల్లో కౌలు రైతులవి 51 వేలు మాత్రమే. ఏతావాతా 79.37 లక్షల ఖాతాల్లో ఇప్పటికి సొమ్ము జమ అయింది 38.76 లక్షల ఖాతాలకే. వివిధ దశల్లో పూర్తిగా తిరస్కారానికి గురైనవి, పెండింగ్‌లో, ఇంకా పరిశీలనలో ఉన్నవి 40.61 లక్షల ఖాతాలు.

రాష్ట్రానివి రెండు కిస్తులు
సొంత భూమి కలిగిన రైతులకు పిఎంకిసాన్‌తో కలిపి ఇస్తామన్నది రూ.13,500. ఏడాదిలో మూడు విడతల్లో ఇస్తామన్నారు. ఖరీఫ్‌కు ముందు ఇచ్చే రూ.7,500లో కేంద్రానివి రూ.రెండు వేలు కాగా రాష్ట్రానివి రూ.5,500. రబీ మొదట్లో లేక ఖరీఫ్‌ కోతల సమయంలో ఇస్తామన్న రూ.4 వేలల్లో కేంద్రానివి రూ.2 వేలు కాగా రాష్ట్రానివి 2 వేలు. సంక్రాంతి సమయంలో ఇచ్చే రూ.రెండు వేలు కేంద్రానివే. రబీలో స్కీం ప్రారంభమైనప్పటికీ రాష్ట్రం తన వాటా కింద ఖరీఫ్‌లో ఇవ్వాల్సిన రూ.5,500, రబీలో ఇవ్వాల్సిన రూ.రెండు వేలు వెరసి రూ.7,500 ప్రస్తుతం జమ అవుతున్నాయి. పిఎంకిసాన్‌కు సంబంధించి రెండవ కిస్తు సుమారు 8 లక్షల మందికి సాంకేతిక కారణాలతో ఆగిపోయాయి. వాటిని ఇప్పుడు క్లియర్‌ చేయడంతో పిఎంకిసాన్‌ రెండో కిస్తు రూ.2 వేలు కొంత ఇప్పుడు పడుతున్నాయి. అందుకే కొందరికి రూ.7,500, కొందరికి మరో రూ.2 వేలు కూడా కలిపి రూ.9,500 పడుతున్నాయి. కౌలు రైతులకు కేంద్రం మొండిచెయ్యి చూపిన దరిమిలా రాష్ట్రమే రెండు కిస్తులు ఖరీఫ్‌ రూ.7,500, రబీ రూ.4 వేలు కలిపి రూ.11,500 ఇస్తోంది. గుర్తించిన కౌలు రైతులు తక్కువ ఉన్నందున రాష్ట్రం నుంచి రూ.11,500 పడే వారి సంఖ్య స్వల్పం.

Courtesy Prajashakti..