– భగ్గుమంటున్న జాత్యహంకార వ్యతిరేక నిరసనలు
– వైట్‌హౌస్‌ ముందు ఆందోళనలు..
– లాఠీలతో విరుచుకుపడ్డ ఖాకీలు
– బాష్పవాయుగోళాల ప్రయోగం
– 40 మహానగరాల్లో కర్ఫ్యూ.. వెనక్కి తగ్గని ఆందోళనలు

వాషింగ్టన్‌ : నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా అమెరికాలో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. జాత్యహంకార వ్యతిరేక నిరసనలు ఆరో రోజులకు చేరాక…ఆదివారం రాత్రి వైట్‌ హౌస్‌ ముందు భారీసంఖ్యలో నిరసనలు తరలివచ్చారు. ఈ ఆందోళనల్ని కట్టడి చేయటం భద్రతాసిబ్బందికి సాధ్యం కాలేదు. ముందు లాఠీలతో ప్రదర్శనకారుల్ని బాదారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. పెద్దసంఖ్యలో అరెస్టు చేస్తున్నా..నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. ప్రపంచదేశాలను గడగడలాడించే అగ్రదేశాధినేతకు…స్వదేశంలో లేచిన జాత్యహంకార మంటల్ని కట్టడిచేయటం తలనొప్పిగా మారింది. ఏకంగా 40 మహానగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతున్నా… అమెరికా ప్రజలు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. వారిలో కోపాగ్ని కట్టలు తెంచుకుంటున్నది.

కలుగులోకి ట్రంప్‌
నిరసనల సెగ అధ్యక్ష భవనం శ్వేతసౌధానికి సైతం బలంగా తాకింది. ఈ నిరసనల తీరుకు భయపడి ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాధినేతగా పేర్కొనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రహస్య బంకర్‌లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ మొదట రిపోర్ట్‌చేసింది. మరో మీడియా సంస్థ ‘రిపబ్లికన్‌’ కథనం ప్రకారం, సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు వెంటనే అధ్యక్షుడు ట్రంప్‌ సహా అందర్నీ ఒకచోటకు తీసుకొచ్చి రక్షణ చర్యలు చేపట్టారు. ఆ సమయంలో సలహాదార్ల వద్ద తన భద్రతపై ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేశారట.

నిరసనకారుల ఆందోళనలు క్రమంగా మిన్నంటడంతో వైట్‌ హౌస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు ట్రంప్‌ను, ఆయన కుటుంబ సభ్యు ల్ని రహస్య బంకర్‌లోకి తీసు కెళ్లారు. దాదాపు గంటపాటు ఆయన్ని అక్కడే ఉంచినట్టు ‘న్యూ యార్క్‌ టైమ్స్‌ ‘ వార్తా కథనం పేర్కొన్నది. నిరసనకారుల ఆగ్రహా వేశాలు చూసి ఆ సమయంలో ట్రంప్‌ బృందం తొలిసారి ప్రాణ భయమంటే ఏంటో స్వయానా చవిచూసినట్టు కనిపించిందని ఓ ఉన్నతాధికారి వివరించారు. అమెరికా అధ్యక్షుడు బంకర్‌లోకి వెళ్లటం చాలా అరుదుగా జరుగుతుంది. ఏకంగా అధ్యక్షుడే అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందంటే అక్కడ నిరసనలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

అమెరికాలో ఆందోళనలకు ప్రపంచవ్యాప్త సంఘీభావం
అమెరికాలోని జాత్యహంకారంపై ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహజ్వాల వ్యక్తమవుతోంది. మినియాపోలిస్‌ నగరంలో ఒక పోలీసు చేతితో హత్యకు గురైన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ ఘటనపై ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలో జరుగుతున్న ఆందోళలనకు సంఘీభావంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంగా వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. జర్మనీలోని పలు ప్రాంతాల్లో ఈ ఆందోళనలు జరిగాయి. బవేరియన్‌ రాజధాని మునిచ్‌లో దాదాపు 400 మంది శనివారం కూడి అమెరికా దౌత్య కార్యాలయం వైపునకు మార్చ్‌ చేశారు. బెర్లిన్‌లో ఆదివారం జరిగిన ఆందోళన ర్యాలీ కార్యక్రమంలో దాదాపు 1500 మందికి పైగా యువకులు పాల్గొన్నారు. ‘జస్టిస్‌ ఫర్‌ జార్జి ఫ్లాయిడ్‌’ అని నినాదాలు చేశారు. ‘ ఐ కాన్ట్‌ బ్రీత్‌, జస్టిస్‌ ఫర్‌ ఫ్లాయిడ్‌, బీయింగ్‌ బ్లాక్‌ ఈజ్‌ నాట్‌ ఏ క్రైమ్‌’ అని పలువురు సంతకాలు చేశారు. అంతకుముందు పోలీసుల హింసాకాండను వ్యతిరేకిస్తూ నగరంలోని బ్రాండెన్‌బర్గ్‌ గేట్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు.

డానిస్‌ రాజధాని కొపెన్‌హాగన్‌లో జరిగిన ఆందోళనలో 5 వేల మంది పాల్గొన్నారు. అదేవిధంగా ఇటలీలోని మిలాన్‌లో గత గురువారం అమెరికా దౌత్యకార్యాలయం ఎదుట నిరసనకారులు ఫ్లాయిడ్‌ హత్యకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శిస్తూ పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడాలోని టోరటో పిట్స్‌ పార్క్‌ వద్ద ఆందోళనలు జరిగాయి. గత బుధవారం నగరంలో జరిగిన కొర్చిన్‌స్కి పాక్వెట్‌ మృతిపై నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు. జెరూసలేం, టెలీ అవివ్‌ నగరాల్లో సంఘీభావ ఆందోళనలు జరిగాయి. ఇజ్రాయిల్‌ బోర్డర్‌ పోలీసుల చేతిలో బలైన ఇయాద్‌ హలాక్‌ అనే పాలస్తీనాకు చెందిన వికలాంగుడి హత్య ఘటనకు వ్యతిరేకంగా వందలాది మంది ఇజ్రాయిలీలు, పాలస్తీనియన్లు మార్చ్‌ నిర్వహించారు. జెరూసలేం ఓల్డ్‌ సిటీలో హలాక్‌ హత్యకు గురయ్యారు. ‘జస్టిస్‌ ఫర్‌ ఇయాద్‌, జస్టిస్‌ ఫర్‌ జార్జి’ అన్న ప్లకార్డులు ప్రదర్శించారు. లండన్‌లోని ట్రఫల్‌గార్‌ స్వ్కేర్‌ వద్ద వేలాది మంది హౌసింగ్‌ స్ట్రీట్‌, హౌసెస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ వైపునకు ర్యాలీ తీశారు. రాసిజం హ్యాజ్‌ నో ప్లేస్‌(జాత్యహంకారానికి చోటు లేదు) అని ప్లకార్డులతో కూడిన నినాదాలు చేశారు.

Courtesy Nava Telangana