కస్టోడియల్‌ మరణాల్లో యూపీ టాప్‌
ఇంతకంటే ఎక్కువే ఉండొచ్చంటున్ననిపుణులు
– 2016 నుంచే ఎన్సీఆర్బీ రిపోర్టును నిలిపేసిన బీజేపీ సర్కారు

ఇటీవల తమిళనాడు తుత్తుకూడిలో జరిగిన తండ్రికొడుకుల లాకప్‌డెత్స్‌ అంశం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మహమ్మారి కరోనా కరాళ నృత్యం చేస్తున్న తరుణంలో కూడా పోలీసుల దుర్మార్గాలు… దురాగతాలు ఎంతమాత్రం ఆగడం లేదని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. తాజా ఘటనతో ఒక్కసారిగా లాకప్‌డెత్స్‌ అంశంపై ఇటు సోషల్‌ మీడియాలో… పౌర సమాజం(సివిల్‌ సొసైటీ)లో చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో బహిర్గతమైన ఓ నివేదిక సైతం లాకప్‌డెత్స్‌పై నిర్ఘాంతపోయే వాస్తవాలను వెల్లడించింది.

గత నాలుగేండ్ల మోడీ హయాంలో ఏడు వేల కస్టోడియల్‌ డెత్స్‌ దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నాయని హఫింగ్టన్‌ పోస్టు అనే మీడియా కథనాన్ని నివేదించింది. అయితే, ఈ సంఖ్య పైన కథనంలో పేర్కొన్న దానికంటే ఎక్కువగానే ఉంటుందని అభిప్రాయడింది. ఎందుకంటే, 2016 నుంచి నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ ఆఫ్‌ బ్యూరో(ఎన్సీఆర్బీ) లెక్కలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అందుబాటులో ఉంచడం లేదు. దీంతో లాకప్‌డెత్‌లు, దానికి సంబంధించిన గణాంకాలపై అనిశ్చిత నెలకొంది. గడిచిన ఏడు సంవత్సరాల్లో జరిగిన ఘటనలను సగటున గమనిస్తే 2018-19 ఏడాదిలోనే లాకప్‌ డెత్‌లు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు ఏడు వేల లాకప్‌ డెత్‌లు జరిగినా… అందుకు కారకులైన వారిని శిక్షించడంలో న్యాయ వ్యవస్థ కూడా పూర్తిగా వైఫల్యమైందన్న చర్చ నడుస్తున్నది. ఏదో సంచలనమైన కేసుల్లో మాత్రమే కొంతమేర పురోగతి ఉంటుంది. ఇతర కేసుల్లో అసలు విచారణ కూడా ప్రారంభం కాని దుస్థితి నెలకొంది. అయితే, 1990లో కేవలం ఒకే ఒక్కసారి ఒక ఐపీఎస్‌ అధికారికి లాకప్‌డెత్‌ కేసులో శిక్ష పడింది. ఆ తర్వాత రాజకీయ పార్టీలు, పౌర సంఘాల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా… సాధారణ ప్రజానీకం, హక్కుల కార్యకర్తలపై పోలీసుల వేధింపులు ఆగడం లేదు. వేధింపులే పలుమార్లు జైలుగోడల మధ్య చావులకు కారణం అవుతున్నాయని ఎన్‌ హెచ్‌ఆర్సీ నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి. 2001 నుంచి ఇప్పటివరకు కేవలం 26 మంది పోలీసులకు మాత్రమే.. లాకప్‌ మరణాలకు సంబంధించిన కేసుల్లో శిక్ష పడినట్టు కేంద్రం వెల్లడించింది. కానీ, వాటికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం ప్రజాక్షేత్రం (పబ్లిక్‌ డొమైన్‌)లో వెల్లడించడం లేదు.

2018-19 సంవత్సరానికి దేశంలో అత్యధికంగా లాకప్‌డెత్‌లు ఉత్తరప్రదేశ్‌లోనే జరిగాయి. ఇతర రాష్ట్రాల కంటే అక్కడ లాకప్‌డెత్‌లు అధికంగా ఉన్నాయి. 2018 సంవత్సరంలో సుమారు 374 కస్టోడియల్‌ డెత్‌లు చోటు చేసుకోగా, ఒక్క పోలీసు అధికారికీ శిక్ష పడలేదంటే ఆ రాష్ట్రంలో పోలీసు హింస ఏ విధంగా వ్యవస్థీకృతమైందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడుకు చెందిన సీపీఐ ఎంపీ సుబ్బరాయన్‌ ఇటీవల లోక్‌సభలో అడిగిన ప్రశ్నకి సమాధానంగా కేంద్రం హౌంశాఖ పార్లమెంట్‌కి వెల్లడించిన వివరాల ప్రకారం… 2015-19 కాలంలో సుమారు 7,295 కస్టోడియల్‌ మరణాలు సంభవించాయి. అయితే 2012 తర్వాత అత్యధికంగా లాకప్‌డెత్‌లు కూడా 2018-19 సంవత్సరంలోనే చోటు చేసుకున్నాయని ప్రభుత్వం చెప్పింది. అయితే, కస్టోడియల్‌ డెత్‌ కేసుల్లో అధికారులకు శిక్షలు పడిన వివరాలు ఎవ్వరివద్దా లేవనీ ఎన్‌ హెచ్‌ఆర్‌ సీ, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హౌంశాఖ తెలిపింది. ఎవ్వరి దగ్గర ఉండటం లేదని వెల్లడించింది. దీన్ని బట్టి పరిస్థితిని నిశితంగా గమనిస్తే… అసలు లాకప్‌డెత్‌ కేసుల్లో పోలీసులకు శిక్షలే పడటం లేదని స్పష్టమవుతోంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే దేశంలో రోజురోజుకూ పోలీసుల దాష్టికత్వం పెరిగిపోతున్నదనీ కామన్‌వెల్త్‌ హ్యూమన్‌ రైట్స్‌ సమన్వయకర్త దేవికా ప్రసాద్‌ చెబుతున్నారు.

ప్రత్యేక చట్టం… పోలీసు వ్యవస్థపై విస్తృత అవగాహన అవశ్యం
లాకప్‌డెత్‌లకు సంబంధించిన సంఖ్య ప్రతి సంవత్సరం మరింత పెరగడం ఆందోళన గురి చేస్తుందని మానవ హక్కుల కార్యకర్త దేవికా ప్రసాద్‌ వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థపై ప్రజానీకానికి మరింత అవగాహన అవసరమని ఆమె చెబుతున్నారు. లాకప్‌డెత్‌లకు సమర్థవంతంగా ఎదుర్కొవడానికి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

Courtesy Nava Telangana