డెంగీ, విష జ్వరాలతో రాష్ట్రం మంచం పట్టింది. ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరో జ్వర పీడితులు ఉంటున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని కేవలం నాలుగు ప్రధాన అస్పత్రుల్లోనే 7,600కుపైగా ఓపీలు నమోదయ్యాయి. జ్వరాల తీవ్రతకు ఈ సంఖ్యే నిదర్శనం. డెంగీ, ఇతర జ్వరాలను అరికట్టడానికి చర్యలు తీసుకొంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆస్పత్రుల్లో కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. ఒక్క ఆగస్టులోనే రాష్ట్రవ్యాప్తంగా 5,708 డెంగీ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో ఓ చిన్నారి సహా ముగ్గురు డెంగీ, విష జ్వరంతో మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 5 వరకు నమోదైన కేసులను పరిశీలిస్తే స్కూల్‌ పిల్లలకే డెంగీ ఎక్కువగా సోకుతోందని అర్థమవుతుంది. ఈ వారం రోజుల్లో నమోదైన 730 కేసుల్లో 261 పిల్లలవే. అధికారిక లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో గురువారం ఒక్క రోజే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 33 డెంగీ కేసులు నిర్ధారణ అయ్యాయి. గత ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 452 కేసులు నమోదు కాగా ఈ ఏడాది అదే సమయంలో 559 కేసులు లెక్క తేలాయి. అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం డెంగీ తీవ్రత తగ్గుతోందని, హైదరాబాద్‌లోని ఫీవర్‌, నీలోఫర్‌ ఆస్పత్రులను మినహాయిస్తే మిగిలిన చోట్ల నమోదైన ఓపీల్లో డెంగీ కేసులు తక్కువేనని చెబుతున్నారు. ఫీవర్‌ ఆస్పత్రిలో కొత్తగా 70 బెడ్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో 460 హైరిస్క్‌ ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ గుర్తించింది. జ్వరానికి కారణం తెలుసుకోకుండా వైద్యుల సలహా తీసుకోకుండా మందులు వేసుకోవద్దని అపోలో ఆస్పత్రుల ప్రెసిడెంట్‌ డాక్టర్‌ హరిప్రసాద్‌ సూచించారు. వెంటనే ప్రభుత్వం డెంగీపై యుద్ధం ప్రకటించాలని అపోలో ఆస్పత్రి సంయుక్త ఎండీ సంగీతారెడ్డి చెప్పారు.
చిన్నారి సహా ముగ్గురి మృతి
మేడ్చల్‌ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన స్వాతి(24) ఎనిమిది నెలల గర్భిణి. జ్వరంతో బాధపడుతున్న ఆమెకు కొద్ది రోజులుగా స్థానికంగా వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. పరీక్షలు నిర్వహించగా డెంగీ అని నిర్ధారణ అయింది. గురువారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. శుక్రవారం ఆమె మరణించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని హమాలీ కాలనీకి చెందిన నాలుగేళ్ల విశాలి 15 రోజులుగా జ్వరంతో బాధపడుతూ గురువారం రాత్రి మృతిచెందింది. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన విద్యార్థిని హేమలత (15) డెంగీతో గురువారం కర్నూలు ఆసుపత్రిలో మృతి చెందింది. రాజన్న సిరిసిల్లలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి.
రెండు శాంపిళ్లు సేకరించాలి
జ్వరంతో వస్తే చాలు నిర్ధారణ కాకుండానే డెంగీ అని కొందరు భయపెడుతుండటంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ పరీక్షల కోసం రెండు నమూనాలు సేకరించాలని నిర్దేశించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఒక నమూనాను ప్రభుత్వ ల్యాబ్‌కు పంపించాలి. ఐపీఎం, ఫీవర్‌, నిలోఫర్‌, గాంధీ, ఉస్మానియా, తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ వంటి కేంద్రాల్లో వాటిని పరీక్షిస్తారు. ఆ తర్వాత ఫలితాన్ని సంబంధిత ఆస్పత్రులకు పంపుతారు.
Image result for ఒక్క రోజే ఓపీకి 7,600మంది

జ్వరంతో వస్తే డెంగీ అని భయపెట్టొద్దు

ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి ఈటల సూచన
ఎవరైనా జ్వరంతో బాధపడుతూ వస్తే డెంగీ అని భయపెట్టొద్దని ప్రైవేటు ఆస్పత్రులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. జ్వరాలపై ప్రజల్లో ఆందోళన పెంచేలా ఎవరూ ప్రచారం చేయవద్దని కోరారు. హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆస్పత్రిలో 51 వేల మందికి పరీక్షలు చేస్తే 62 మందికి మాత్రమే డెంగీ ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో 419 మందికి నయం చేసి డిశ్చార్జి చేశామని తెలిపారు. శుక్రవారం గాంధీ ఆస్పత్రిలోని జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో కాన్ఫరెన్స్‌ హాలు, వైద్య గ్రంథాలయం, వైరల్‌ వార్డును మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. సీజనల్‌ వ్యాధుల వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అలాగే అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఈటల టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భూపాలపల్లి, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో పరిస్థితి తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లాలో పరిస్థితిపై డీఎంహెచ్‌వోతో ఫోన్‌లో మాట్లాడారు.