న్యూఢిల్లీ : ఆస్ట్రాజెన్‌కా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ నాలుగు కోట్ల డోసులు సిద్ధంగా ఉన్నట్లు మనదేశానికి చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ ప్రకటించింది. ఈ డోసులు మన దేశంలో సరఫరా చేయడానికేనన్న ప్రశ్నకు ఆ సంస్థ ప్రతినిధులు సమాధానం చెప్పడం లేదు. సీరం, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) కలిసి దేశవ్యాప్తంగా 15చోట్ల ఈటీకా తుది ప్రయోగాలను కొనసాగిస్తున్నాయి. ఈ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం 1600 మంది వాలంటీర్ల నమోదు ప్రక్రియ జరిగినట్లు ఇప్పటికే సీరం ప్రకటించింది. మరో సంస్థ నోవా వాక్స్‌ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ తుది దశ ప్రయోగాల అనుమతి కోసం ఎదురుచూస్తోంది. మనదేశంలో తుది దశ ప్రయోగాలు చివరి దశకు చేరుకున్న వ్యాక్సిన్లలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సహకారంతో తయారుచేసిన ఆస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్‌ ముందున్నట్టు సీరం తెలిపింది. ఇదిలావుండగా, ఫైజర్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌ భద్రపరచడానికి -70 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత అవసరం. ఇది దాదాపు అన్ని దేశాలకు సవాలే. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ 2 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నిల్వచేస్తే సరిపోతుంది.

వ్యాక్సిన్‌ కంటే ముందుగానే హెర్డ్‌ ఇమ్యూనిటీ! : ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ గులేరియా
కరోనా వ్యాక్సిన్‌ రావడం కంటే ముందుగానే మనం మంచి రోగ నిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ) దశకు చేరుకునే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా పేర్కొన్నారు. తమలో తగినంత రోగ నిరోధక శక్తి ఉందని ప్రజలు భావించిన తరుణంలో వ్యాక్సిన్‌ వినియోగం కూడా ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన గురువారం ఐఎఎన్‌ఎస్‌ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. వైరస్‌ పరివర్తన చెందకపోయినా, మార్పులకు కారణం కాకపోయినా.. ప్రజలు మళ్లీ టీకా వేయించుకోవాలని అనుకోరనీ, తద్వారా వ్యాక్సిన్‌ వినియోగం పడిపోతుందని అన్నారు. వ్యాక్సిన్‌ త్వరగా అందుబాటులోకి వస్తే.. దాన్ని అధిక రిస్క్‌ ఉన్న గ్రూప్‌ వారికి ఇవ్వడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని తగ్గించడం ద్వారా కొత్త కేసుల సంఖ్యను, మరణాలను తగ్గించవచ్చని గులేరియా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వైరస్‌ ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై మనం అంచనాలు వేసుకుంటున్నామని, దీని ఆధారంగానే వ్యాక్సిన్‌ ఎంత తరచుగా అవసరమో నిర్ణయం ఉంటుందని చెప్పారు.

పేదలకు ఉచితంగా ఇవ్వండి : తెలంగాణ మంత్రి ఈటల
పేదలందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

భారత్‌కు చేరిన రష్యా వ్యాక్సిన్‌
రష్యా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వి భారత్‌కు చేరుకుంది. భారత్‌లో 2-3 దశల క్లినికల్‌ పరీక్షలు త్వరలోనే మొదలుపెట్ట నున్నట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబ్స్‌ అధికారి ఒకరు తెలిపారు. రష్యాకు చెందిన గమలేయా నేషనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ అండ్‌ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్‌ వి’ వ్యాక్సిన్‌ కోవిడ్‌ నిరోధానికి 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని గమలేయా, రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) ఒక ప్రకటనలో తెలిపాయి. దాదాపు 40 వేల మంది వాలంటీర్లపై రష్యాలో నిర్వహించిన మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించినట్టు పేర్కొన్నాయి.

Courtesy Nava Telangana