•  350 మందితో భారత విమానం తిరుగుప్రయాణం
  • శనివారం తెల్లవారుజామున ఢిల్లీకి!
  • విమానాశ్రయంలోనే వారికి పరీక్షలు
  • వైరస్‌ సోకితే ప్రత్యేక వార్డుకు
  • మిగతావారు 2వారాలు క్వారంటైన్‌లో
  • మాస్కుల ఎగుమతిపై కేంద్రం నిషేధం

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కారణంగా వూహాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను ఎయిరిండియా సంస్థ ప్రత్యేక బోయింగ్‌ విమానం ‘అజంతా’లో తరలించింది. నలుగురు పైలట్లు సహా సిబ్బంది, ఇంజనీర్లు అంతా కలిపి 33 మందితో శుక్రవారం మధ్యాహ్నం 1.18 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరిన విమానం మళ్లీ రాత్రి 10 గంటల తర్వాత 350 మందికి పైగా భారతీయులతో తిరుగుప్రయాణమైంది. షెడ్యూలు ప్రకారం శనివారం తెల్లవారుజామున 2 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విమానంలో ఐదుగురు వైద్యులను, మందులు, మాస్కులు, ఓవర్‌ కోట్లు, ప్యాకేజ్డ్‌ ఆహారాన్ని పంపింది. సిబ్బంది, వైద్యులు వూహాన్‌లో దిగేటపుడు పూర్తి రక్షణ సూట్లు ధరిస్తారు. అక్కడనుంచి వస్తున్నవారు విమాన సిబ్బందితో ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేకుండా ప్రతి సీటు వద్ద భోజనం ఏర్పాట్లు చేశారు. రెండు మరుగుదొడ్లను సిబ్బంది కోసమే కేటాయించారు.

నిజానికి ఈ విమానం ముంబై నుంచి బయల్దేరాలి. కానీ, మందులు, వైద్యులను పంపించేందుకు ఢిల్లీకి తరలించి వూహాన్‌ పంపారు. ఈ రెస్క్యూ మిషన్‌కు కెప్టెన్‌ అమితాబ్‌ సింగ్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఎయిరిండియా ఈ తరహా తరలింపు మిషన్లను గతంలో లిబియా, ఇరాక్‌, యెమెన్‌, కువాయిట్‌, నేపాల్‌ లో చేపట్టింది. 1990 ఆగస్టులో లక్ష మందికి పైగా భారతీయులను 488 విమానాల్లో 59 రోజు ల్లో తరలించిన చరిత్ర ఎయిరిండియాకు ఉంది. 2015లో ‘ఆపరేషన్‌ రాహత్‌’ పేరుతో యెమెన్‌ నుంచి భారతీయులను తీసుకొచ్చి ంది. వూహాన్‌లో మిగిలిపోయిన మరికొంతమంది భారతీయులను తీసుకొచ్చేందుకు శనివారం మరో విమానాన్ని పంపనుంది. కాగా.. రోజుకు వెయ్యిమందిని స్ర్కీనింగ్‌ చేస్తున్నట్లు శంషాబాద్‌ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

క్వారంటైన్‌ సిద్ధం
వూహాన్‌ నుంచి తరలిస్తున్న భారతీయులను.. ఢిల్లీ విమానాశ్రయంలో దిగాక నేరుగా వారివారి స్వస్థలాలకు వెళ్లనీయరు. వైర్‌సకు కేంద్రస్థానం నుంచి వస్తున్న నేపథ్యంలో వారిని క్వారంటైన్లలో ఉంచనున్నారు. వారి కోసం భారత సైన్యం ఢిల్లీకి సమీపంలోని మనేసర్‌లో ఒక క్వారంటైన్‌ను నిర్మించింది. అక్కడ వారిని రెండు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. ప్రత్యేక విమానంలో వచ్చినవారందరికీ తొలుత విమానాశ్రయంలోనే పరీక్షలు చేస్తారు. ఎవరికైనా వైరస్‌ సోకిందన్న అనుమానం కలిగితే వారిని ఢిల్లీ కంటోన్మెంట్‌ బేస్‌ హాస్పిటల్‌లోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స చేస్తారు. కాగా.. కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అన్ని రకాల శ్వాస కోశ మాస్కుల ఎగుమతిపై నిషేధం విధించింది. వాటిని పెద్దమొత్తంలో ఎగుమతి చేస్తే మనదేశంలో కొరత వచ్చే ప్రమాదం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Courtesy Andhrajyothi