అమిత్‌ షా లేవన్నాడు.. కిషన్‌రెడ్డి ఉన్నాయంటున్నాడు : రాజకీయ విశ్లేషకులు
సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై అనుమానాలను రేకెత్తిస్తున్న కేంద్రం తీరు
గతేడాది కాలంలో 10మంది మృతి : కేంద్రం

న్యూఢిల్లీ : అసోంలో డిటెన్షన్‌ సెంటర్లే లేవు, ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్‌తో వీటికి సంబంధమేలేదు..అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పిన మాటలు నమ్మదగినవి కావని తేలిపోయింది. పార్లమెంట్‌లో మంగళవారం కిషన్‌రెడ్డి చేసిన ప్రకటనకు, అమిత్‌ షా చెప్పినమాటలకు చాలా తేడా కనపడుతున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్తగా డిటెన్షన్‌ సెంటర్లు కట్టడం లేదని అమిత్‌ షా రెండు నెలల క్రితం చెప్పగా, ఈ రెండు నెలల్లో 3వేల మందిని నిర్బంధించే డిటెన్షన్‌ కేంద్రాలు కొత్తవి ఎలా వచ్చాయన్న ప్రశ్న రాజకీయ వర్గాలు లేవనెత్తుతున్నాయి. అసోంలో ఈ ఎన్నార్సీ ప్రక్రియ చేపట్టి 19లక్షలమందిని దేశ పౌరులు కాదని తేల్చారు. దాంట్లో భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ మనవడు, మొన్నటివరకూ బీఎస్‌ఎఫ్‌లో కమాండెంట్‌గా పనిచేసిన ఉన్నతాధికారితో సహా అనేకమంది ఉన్నారు. ఈనేపథ్యంలో డిటెన్షన్‌ కేంద్రాల్లో నిర్బంధించినవారిని విదేశీయులుగా, అక్రమ చొరబాటుదార్లుగా కేంద్రం పేర్కొనటం పలు అనుమానాలకు తావిస్తోంది. అసోం ఎన్నార్సీలో చోటు దక్కని ప్రజల్ని, ముఖ్యంగా ముస్లిం మైనార్టీలను ఈ కేంద్రాలకు తరలించారన్న అనుమానం ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. అసోంలోని డిటెన్షన్‌ కేంద్రాలు కాంగ్రెస్‌ హయాంలో ఏర్పాటైనవని అమిత్‌ షా చెప్పటం అంతా ఓ వ్యూహం ప్రకారమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ అమలుపై మోడీ సర్కార్‌ అనేక విషయాలు దాస్తోందని, ఆ విషయం కిషన్‌రెడ్డి పార్లమెంట్‌లో చేసిన ప్రకటనే చెబుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. అసోం తరహా పరిస్థితులు దేశవ్యాప్తంగా నెలకొంటాయని ప్రతిపక్షాలు, పౌరహక్కుల నేతలు, మేథావులు ఆందోళనబాట పట్టారు. మోడీ సర్కార్‌ విధానాలపై పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం కావటంతో, నిరసనలు, ఆందోళనలు చల్లార్చడానికి ‘సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌’ ఒకదానికి ఒకటి సంబంధం లేనివంటూ అమిత్‌ షా కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

డిటెన్షన్‌ కేంద్రాలు కొత్తవి సిద్ధం : కిషన్‌రెడ్డి
అసోం డిటెన్షన్‌ (నిర్బంధ) కేంద్రాల్లో 3331మందిని నిర్బంధించామని, ఇందులోని 10మంది చనిపోయారని కేంద్రం వెల్లడించింది. మరో 3వేల మందిని నిర్బంధించే సామర్థ్యం గల మరికొన్ని డిటెన్షన్‌ కేంద్రాల నిర్మాణం తుదిదశకు చేరుకుందని పార్లమెంట్‌లో మంగళవారం కేంద్రం వెల్లడించింది. లోక్‌సభలో మంగళవారం సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి పై వివరాలు వెల్లడించారు. ఆయన లోక్‌సభలో రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఏముందంటే.. అసోంలో ఆరు వేరు వేరు చోట్ల ఉన్న డిటెన్షన్‌ కేంద్రాల్లో 3331మందిని నిర్బంధించాం. ఏడాది కాలంలో (మార్చి 2019- ఫిబ్రవరి 2020) నిర్బంధ కేంద్రాల్లో ఉన్న 10మంది చనిపోయారు. నిర్బంధ కేంద్రాల్లో ఉన్నవారంతా విదేశీయులు, వివిధ కేసుల్లో నేరం రుజువైన విదేశీయులు. తేజ్‌పూర్‌ డిటెన్షన్‌ కేంద్రంలో 797మంది, సిల్చార్‌లో 479, దిబ్రుగర్‌లో 680, కోక్రాజార్‌లో 335, జోర్హాట్‌లో670, గోల్పారాలో 370 మందిని నిర్బంధించాం. జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)కి సంబంధించిన ఎలాంటి డిటెన్షన్‌ కేంద్రాల్ని అసోంలో ఏర్పాటుచేయలేదు

జమ్మూకాశ్మీర్‌ జైళ్లలో 450మంది
జమ్మూకాశ్మీర్‌లోని వివిధ జైళ్లలో 450మందిని నిర్బంధించామని, వీరంతా రాళ్లదాడి కేసులో నిందితులు, దుండగులు, వేర్పాటువాదులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారని కేంద్ర హోంశాఖ లోక్‌సభలో విడుదలచేసిన ప్రకటనలో తెలిపింది. ఆర్టికల్‌ 370రద్దు అనంతరం రాష్ట్రంలో 79 ఉగ్రవాద ఘటనలు జరిగాయని కిషన్‌రెడ్డి తెలిపారు. రాజకీయ నాయకులెంతమందిని నిర్బంధించారు? అందుకు గల కారణాలేంటో తెలపాలని డీఎంకే సభ్యుడు గణేశామూర్తి కోరగా, కేంద్రం సమాధానమివ్వలేదు.

అసోంలో ఒకే ఒక డిటెన్షన్‌ కేంద్రం ఉంది. అది కూడా మా హయాంలో ఏర్పాటు చేయలేదు. మోడీ సర్కార్‌ వచ్చాక కొత్తగా ఏ ఒక్కటీ ఎక్కడా కట్టలేదు…
ఒక వార్తా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూ(డిసెంబరు, 2019లో)లో అమిత్‌ షా

అసోంలో ఆరు డిటెన్షన్‌ కేంద్రాలున్నాయి. ఇందులో 3331మందిని నిర్బంధించాం. మరో 3వేల మందిని నిర్బంధించడానికి కొత్తగా డిటెన్షన్‌ కేంద్రాలు అసోంలో సిద్ధమవుతున్నాయి.
పార్లమెంట్‌లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి

Courtesy Nava Telangana