తెరచివుంచిన బోరు బావి తెలంగాణలో మరో చిన్నారిని బలి తీసుకుంది. పాలకుల నిర్లక్షం, అధికారుల అలసత్వానికి మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

మెదక్‌: మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో అప్పుడే వేసిన బోరులో పడిన బుధవారం సాయంత్రం పడిన సంజయ్‌సాయి వర్దన్‌ బాలుడు మృతి చెందాడు. బోరు బావిలో 25 అడుగుల లోతులో బాలుడి మృతదేహం లభ్యమైంది. బోరుబావిలో మట్టిపెళ్లలు కింద బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో బాలుడిని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెలికితీశారు. బాలుడిని వెంటనే అంబులెన్స్‌లో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించగా చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఊపిరి ఆడక బాలుడు చనిపోయాడని డాక్టర్లు వెల్లడించారు. (గుండెలు పిండేసే దృశ్యం)

చిన్నారి ప్రాణాలను కాపాడటానికి 12 గంటలపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ రెస్క్యూ సిబ్బంది శ్రమించినా ఫలితం లేకపోయింది. బోరు బావికి సమాంతరంగా గొయ్యిని తవ్వి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అతడిని రక్షించేందుకు విశ్వప్రయత్నాలు చేశాయి. ఇరుకైన బోరుబావిలో ఆక్సిజన్‌ అందకపోవడంతో బాలుడు సంజయ్‌సాయి వర్దన్‌ మరణించాడు. ఈ విషాద ఘటనతో బాలుడి తల్లిదండ్రులు గోవర్ధన్, నవీన, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో పోడ్చన్‌పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లి గ్రామానికి చెందిన మంగళి భిక్షపతి తన పొలంలో మంళవారం రాత్రి మూడు బోర్లు వేయించాడు. మూడింట్లోనూ నీళ్లు పడకపోవడంతో కేసింగ్‌ తీసేసి బోరుబావులను అలాగే వదిలేశారు. వాటిపై ఎటువంటి అడ్డండి పెట్టకపోవడంతో భిక్షపతి మనవడైన సంజయ్‌సాయి ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా ప్రజలు పెడచెవిన పెట్టడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటు అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమవుతున్నారని విమర్శిస్తున్నారు. ఇకనైనా అధికారులు మేలుకుని ఇలాంటి దుర్ఘటనలు మున్ముందు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.