27 ప్రముఖ పురుగుమందులపై వేటు
చట్ట ముసాయిదా విడుదల చేసిన కేంద్రం

హైదరాబాద్‌: మనం తినే బియ్యం, వాడే కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాల పంటలపై చల్లుతున్న రసాయన పురుగుమందుల్లో అత్యంత విషపూరితమైన 27 రకాలపై నిషేధం వేటు పడింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. నిషేధానికి సంబంధించిన చట్ట ముసాయిదాను విడుదల చేసింది. అభ్యంతరాలుంటే 45 రోజుల్లోగా తెలపాలని సూచించింది. ముసాయిదాలో పేర్కొన్న పురుగుమందులు పలు పంటలపై ఏళ్ల తరబడి వాడుతున్నవే కావడం గమనార్హం. వీటిని ఎందుకు నిషేధిస్తున్నారో తెలిపే వివరాలనూ కేంద్రం వెల్లడించింది.ఆ సమాచారాన్ని బట్టి మనిషి ఆరోగ్యాన్ని అవి ఎంతగా నాశనం చేస్తాయో స్పష్టమవుతుంది.

నిషేధిత జాబితాలోని కొన్నింటిని పరిశీలిస్తే..
మోనోక్రోటోఫాస్‌: అత్యంత విషపూరితమైన ఈ పురుగుమందును రైతులు విరివిగా పంటలపై చల్లుతున్నారు. ఈ మందు ప్యాకెట్లపై ఎరుపురంగు ప్రమాదకర సంకేతం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన ప్రమాదకర సంకేతాల కేటగిరీలో ఇది ఉంది. దీన్ని అనాలోచితంగా వాడడం వల్ల రైతులు ప్రాణాలను కోల్పోయిన దాఖలాలున్నాయి. తేనెటీగలు, పక్షులు, చేపలు, రొయ్యలపైనా ప్రభావం చూపుతోంది. ప్రజలు కొంటున్న కూరగాయలపై ఈ మందు రసాయన అవశేషాలుంటున్నాయి. దీని విషపూరిత ప్రభావం ఎలా ఉంటుందనే సమాచారాన్ని కంపెనీలు కేంద్రానికి సరిగా ఇవ్వలేదు. ఈ మందు చల్లాక వరి, మొక్కజొన్న, మినుము, పెసర, కందులు, సెనగ, చెరకు, పత్తి, కొబ్బరి, కాఫీ, కొత్తిమీర పైరును ఎన్నిరోజుల దాకా కోయకూడదనే సమాచారాన్నీ ఇవ్వలేదు. దీనివల్ల ఈ పురుగుమందు చల్లిన వెంటనే రైతులు పంట కోసి మార్కెట్లకు తేవడం వల్ల వాటిపై రసాయన అవశేషాలుంటున్నాయి. వాటిని వినియోగించే మనుషులు రోగాలపాలవుతున్నారు. ఈ మందును ఇప్పటికే 112 దేశాల్లో నిషేధించారు.

క్వినాల్‌ఫాస్‌: ఈ రసాయన పురుగుమందును జొన్న, మిరప, పత్తి తదితర పంటలపై  చల్లుతున్నారు. ఇది అత్యంత విషపూరితమైందంటూ 30 దేశాల్లో నిషేధించారు. శ్వాసకోశ సమస్యలను సృష్టిస్తుందని ఐరోపా దేశాలు దీన్ని కేటగిరీ 1 జాబితాలో పెట్టాయి. మిరపపై తెగుళ్లను అరికట్టే శక్తి దీనికి ఎంత ఉందనే వివరాలను సైతం కంపెనీలు ఇవ్వలేదు. కానీ రైతులకు అమ్ముతున్నారు. వారు చల్లుతున్నారు.
ఆక్సీఫ్లోరోఫెన్‌: ఈ రసాయన మందు అత్యంత విషపూరితమైనదే కాక దీన్ని పీల్చినా, కడుపులోకి వెళ్లినా క్యాన్సర్‌ రావడానికి అవకాశముంది. ఇది మనిషి శరీరంలోకి వెళితే రక్తహీనత(అనీమియా)కు గురవుతారు. కాలేయమూ పాడవుతుంది. రెండు దేశాల్లో ఇప్పటికే నిషేధించారు. వరి, వేరుసెనగ, ఉల్లి, ఆలుగడ్డ పంటలపై ఇది ఎలా పనిచేస్తుందనే వివరాలను సైతం కంపెనీలు సరిగా ఇవ్వలేదు. ఈ మందు మనుషులతో పాటు మొక్కలు, చేపలు, రొయ్యలపైనా తీవ్ర దుష్ప్రభావం చూపడం వల్ల పర్యావరణమూ నాశనమవుతుంది. ఇలా రైతులు విరివిగా పంటలపై చల్లుతున్న మరో 24 మందులు, వాటి దుష్ఫలితాల గురించి కేంద్రం ఈ ముసాయిదాలో వివరించింది. ఇది చట్టంగా మారిన వెంటనే ఈ మందుల అమ్మకాలు, తయారీ, నిల్వ, రవాణా వంటివన్నీ నిషేధిస్తారు. రైతులు వాటి వాడకాన్ని వెంటనే మానుకుంటే మంచిదని ఓ వ్యవసాయ శాస్త్రవేత్త ‘ఈనాడు’కు చెప్పారు.

నిషేధిత జాబితాలోని మిగతా మందులు
పెండిమెథాలిన్‌, సల్ఫోసల్ఫూరాన్‌, థియోడికార్బ్‌, థియోఫానట్‌ ఎమిథైల్‌, థైరాం, జైనెబ్‌, జైరం, మిథోమిల్‌, మాంకోజెబ్‌, మలాథియాన్‌, ధియురోన్‌, డైనోక్యాప్‌, డైమిథోయేట్‌, డైకోఫోల్‌, డెల్టామిథ్రిన్‌, 2,4-డి, క్లోరీఫైరీఫాస్‌, కార్పొఫ్యూరాన్‌, కార్బండిజమ్‌, క్యాప్టెన్‌, బ్యూటాక్లోర్‌, బెన్‌ఫ్యూరకర్బ్‌, అల్ట్రజైన్‌, ఎసిఫేట్‌.

Courtesy Eenadu