• మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారికి వైద్య పరీక్షలు
  • పూర్తయ్యే సరికి మరో 25 పెరిగే అవకాశం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వల్ల ఎక్కువగా ప్రభావితం అయిన 25 ప్రాంతాలను వైద్య ఆరోగ్య శాఖ హాట్‌స్పాట్లుగా గుర్తించింది. వీటిలో హైదరాబాద్‌లోని పాతబస్తీ, వరంగల్‌ అర్బన్‌, నిజామాబాద్‌ పట్టణం, కరీంనగర్‌ పట్టణం తదితర ప్రాంతాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి వివరాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇప్పటివరకు గుర్తించిన హాట్‌స్పాట్లలో హైదరాబాద్‌లోని ప్రాంతాలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మర్కజ్‌ వెళ్లొచ్చిన వారికి, వారి సన్నిహితులకు ఈ నెల 10వ తేదీ నాటికి పరీక్షలు పూర్తి కానుండటంతో వీటి సంఖ్య 50కి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కరోనా కేసులు పెద్దగా నమోదయ్యే అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. హాట్‌స్పాట్ల పరిధిలో వైరస్‌ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలను అమలుచేస్తారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా లక్షణాలు ఉంటే ఆస్పత్రులకు తరలిస్తారు. ఈ కార్యక్రమం చివరి పేషంట్‌ దొరికే వరకు కొనసాగుతుంది. హాట్‌స్పాట్ల పరిధి ఎంత మేరకు ఉంటుంది.. వాటిని పాజిటివ్‌ కేసులున్న పరిధిలో ఎంత దూరం వరకు మ్యాపింగ్‌ చేస్తారన్న దానిపై కేంద్రం మార్గదర్శకాలను ఇస్తుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

10వ తేదీ నాటికి 600 కేసులు!
ఈ నెల 10వ తేదీ నాటికి రాష్ట్రంలో 600కు పైగా కరోనా కేసులు నమోదు కావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారికి, వారి కుటుంబీకులకు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి 10వ తేదీ లోపు  పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనేది సర్కారు అంచనా. ఇప్పటివరకు 21 జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కేసుల్లో సగానికి పైగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే ఉన్నాయి.

దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేత?
రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గితే ఈ నెల 15 నుంచి లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అయితే హాట్‌స్పాట్లలో మాత్రం పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాతనే లాక్‌డౌన్‌ను తొలగిస్తారని అభిప్రాయపడుతున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన ప్రాంతాల్లో కొన్నాళ్లపాటు రాత్రివేళల్లో కర్ఫ్యూ కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. రాజధానిలో మాత్రం ఇప్పట్లో లాక్‌డౌన్‌ ఎత్తివేసే పరిస్థితులు లేవని, నమోదౌతోన్న కేసుల్లో ఇక్కడే అధికంగా ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు.

Courtesy Andhrajyothi