సికింద్రాబాద్‌: లాక్‌డౌన్‌తో ఇరుక్కుపోయిన వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులు తదితరులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఇప్పటిదాకా 240 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను నడిపామని దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు మే 10 నుంచి జూన్‌ 13 వరకు 240 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను నడిపినట్టు ఎస్‌సీఆర్‌ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి రాకేశ్‌ వెల్లడించారు.

ఐఆర్‌సీటీసీ సహకారంతో పాటు తన సొంత వనరులను పెద్దఎత్తున ఉపయోగించుకున్నామని.. తమ జోన్‌ గుండా ప్రయాణించిన 648 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లలో 960 క్యాటరింగ్‌ సేవలు అందించామని తెలిపారు. 80పైగా శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లలో లక్షా యాభైవేలకు పైగా మీల్స్‌ అందించామన్నారు. ప్రభుత్వేతర సంస్థలు, ఇతర స్వచ్ఛంద, సేవా సంస్థలు ముందుకొచ్చి రైల్వేలతో చేతులు కలిపి ఆహారం తయారీ, వితరణ బాధ్యతలను చేపట్టాయని పేర్కొంది. విపత్కర పరిస్థితుల్లో కార్మికులను ఆదుకున్న ఎన్జీవోలను, స్వచ్ఛంద, సేవా సంస్థలను, అధికారులను, ఉద్యోగులను ఎస్‌సీఆర్‌ జనరల్‌ గజానన్‌ మాల్యా అభినందించారు.