•  కళ్లు మూసుకున్న రెవెన్యూ అధికారులు
  • ఆక్రమణదారులతో చేతులు కలిపారు
  • ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైకోర్టు
  • గంధంగూడ భూములపై
  • నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నడిబొడ్డున ప్రభుత్వ భూములు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా… అధికారులు ప్రేక్షకపాత్ర వహించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమిస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని నిలదీసింది. ‘‘24 అంతస్తుల భవనాలు వెలుస్తున్నా… తమకేమీ తెలియదని మిన్నకుంటున్నారంటే ఈ విషయంలో అధికారులు కచ్చితంగా కళ్లు మూసుకున్నారని భావించాల్సి ఉం టుంది’’అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ వ్యవహారం చూస్తుంటే ఆక్రమణదారులతో అధికారులు చేతులు కలిపారనే సందేహాలు తలెత్తుతున్నాయని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై దాఖలైన పిల్‌ను విచారించిన ధర్మాసనం నెల రోజుల్లోగా ఈ భూములను సర్వేచేసి పూర్తి నివేదిక కోర్టు ముందుంచాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీచేసింది. రంగారెడ్డి జిల్లా గంధంగూడ గ్రామంలోని 3ఎకరాల 22 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడాన్ని ప్రశ్నిస్తూ కె. కృష్ణగౌడ్‌ అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో పిల్‌ వేశా రు. గంధంగూడ గ్రామ పరిధిలోని భూములపై సమ గ్ర సర్వేచేసి యాజమాన్య హక్కులపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాది భాస్కర్‌రెడ్డి కోర్టుకు చెప్పారు. ఈ వాదనలపై ధర్మాస నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూ ములు కబ్జాకు గురవుతుంటే 3 నెలల సమయం ఎం దుకని ప్రశ్నించింది నెలలోగా సర్వేచేసి నివేదిక ఇవ్వాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది.

Courtesy Andhrajyothi