–  బలవంతంగా హిందీ రుద్ద వద్దు
కరపత్రాల ఆవిష్కరణలో వక్తలు
గురజాడ అప్పారావు 157వ జయంతి సందర్భంగా అన్ని కళాశాలలు, పాఠశాలల్లో ఈ నెల 21న ‘దేశమును ప్రేమించుమన్నా’ గీతాన్ని ఆలపించ నున్నట్లు ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడమీ కార్యదర్శి గోళ్ల నారాయణరావు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి, ప్రజాశక్తి బుకహేౌస్‌ పూర్వ సంపాదకురాలు ఉషారాణి, ఎపి గ్రంథాలయ సంఘం కార్యదర్శి రావి శారద తెలిపారు. విజయవాడలోని ఎంబివికెలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేశం వేల జాతుల, సంస్కృతుల సమ్మేళనమని, అన్నింటినీ ఇముడ్చు కోవాలన్న భావం వచ్చేలా దేశమును ప్రేమించుమన్నా గీతాన్ని గురజాడ రాశారని తెలిపారు. దేశాన్ని ముక్కలు చేసేందుకు అవకాశం కల్పించేలా ఒకే దేశం-ఒకే భాష నినాదం నేడు ముందుకొస్తోందన్నారు. అన్ని మతాలనూ గౌరవించడం వల్లే దేశంలో అందరం కలిసి ఉన్నామన్నారు. అందరూ కలిసి ఉండేలా కృషి చేసేందుకు హేతువాద, నాస్తిక, స్త్రీ, అభ్యుదయ సంఘాలు సంయుక్తంగా గురజాడ జయంతిని భావ యుక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, బాల బాలికలే లక్ష్యంగా పాఠశాలలు, కళాశాలల్లో వ్యాసరచన పోటీలు, మానవ హారాలను నిర్వహించనున్నా మన్నారు. అభ్యుదయ భావాలను ప్రతిబింబించే షార్ట్‌ఫిలిం పోటీలను కూడా నిర్వ హిస్తామన్నారు. సాంఘిక అసమానతల మీదే గాక స్త్రీల అభ్యుదయం, మూఢాచారా లను ఎదిరించడం వంటివి గురజాడ నేర్పారన్నారు. 21న ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకూ అన్ని పాఠశాలలు, కళాశాలల్లో దేశమును ప్రేమించు మన్నా గీతాన్ని ఆలపించాలని విజ్ఞప్తి చేశారు. మానవ హారాలను నిర్వహించాలని, అధికారులను భాగస్వాములను చేయాలని కోరారు. విజయవాడలో జరిగే కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పాల్గోనున్నట్లు తెలిపారు. ఛాందస వాదంతో ప్రపంచం మగ్గుతున్న సమయంలో స్త్రీ వాదాన్ని ఎలుగెత్తి చాటిన కవి గురజాడ అని, ఆయన రాసిన గీతాలను పిల్లలకు నేర్పించాలని కోరారు. సమావేశం లో గురజాడ జయంతి కమిటీ సభ్యులు విద్యాఖన్నా, అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Courtesy Prajashakthi…