జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దుచేస్తున్నట్టు మోడీ సర్కార్‌ ప్రకటించాక.. తొలి మూడు రోజుల్లో పెల్లెట్‌ తుపాకీ కాల్పుల్లో గాయపడిన 21 మంది యువకులు చికిత్స కోసం శ్రీనగర్‌ ప్రధాన ఆస్పత్రిలో చేరారు. కాగా, అధికారిక సమాచారం ఇచ్చేందుకు ఆస్పత్రి పాలనాయంత్రాంగం నిరాకరిస్తున్నది. గోప్యంగా ఉంచిన ఈ సమాచారాన్ని ఓ జాతీయ వార్తా సంస్థ బయటపెట్టింది. ఈ నెల 6, 7 తేదీల్లో గాయపడిన 13 మందిని చికిత్స కోసం ఇక్కడకు తీసుకువచ్చారనీ నగరంలోని శ్రీ మహారాజా హరి సింగ్‌ (ఎస్‌ఎంహెచ్‌ఎస్‌) ఆస్పత్రి వైద్యులు, నర్సులు చెప్పారు. బాధితులకు కండ్లల్లో, శరీరంలోని ఇతర భాగాల్లో పెల్లెట్‌ గాయాలున్నాయి. వీరిలో చాలా మందికి ఒక కంటిచూపు పోయిందనీ, కొద్దిమందికి రెండు కండ్లూ పోయే ప్రమాదం ఉన్నదని వైద్యులు చెప్పారు. కాగా, తీవ్రగాయాలతో వచ్చిన ఓ యువకుడు ఆస్పత్రిలో చనిపోయినట్టు సమాచారం. కానీ, ఆస్పత్రి వర్గాలు ఈ అంశాన్ని బయటకురానివ్వటంలేదు. రోగులతో నిండివున్న ఎస్‌ఎంహెచ్‌ఎస్‌ ఆస్పత్రిలో ఎనిమిదవ వార్డులో పెల్లెట్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. కాశ్మీర్‌లో పరిస్థితి ‘ప్రశాంతం’గా ఉందంటూ మీడియాలోని ఒక భాగం ప్రచారం చేస్తున్నది. కాగా, వాస్తవం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నదన్న వాస్తవం ఆ ఆస్పత్రిలో పరిస్థితి చూస్తే సుస్పష్టమవుతున్నది. 370 రద్దుచేస్తూ కేంద్ర సర్కార్‌ ప్రకటన తర్వాత అక్కడి ప్రజల జీవితాల్లో అనిశ్చితి పట్టిపీడిస్తున్నది. ఈ నెల 5 నుంచి అక్కడ మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ నెట్‌వర్క్‌ రద్దయింది. వార్తాపత్రిక ప్రచురణ కూడా నిలిచిపోయింది. కర్ఫ్యూ నీడలోనే తెల్లవారుతున్నది. ప్రధాన ఆస్పత్రుల పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

 

(Courtacy Prajashakti)