సారంపల్లి మల్లారెడ్డి

దేశానికి 16వ ప్రధానిగా మోడీ రెండోసారి మే 30న ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికలకు ముందు బీజేపీ మరల ప్రజలకు వాగ్దానాలు చేసింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు, 2025 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్లకు దేశ స్థూల ఆదాయం పెంపు, మత్య్స సంపద పెంపుదలకు 10వేల కోట్ల కేటాయింపు, డెయిరీ అభివృద్ధి, 2022 నాటికి అందరికీ పక్కా ఇండ్లు, భూ రికార్డుల డిజిటలైజేషన్‌, కృషి సించారు యోజన కింద 99ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేయడంతో పాటు నూనెగింజలు, ఇతర విత్తనాలు, తేనెటీగల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 100శాతం గృహాలకు విద్యుచ్ఛక్తి సౌకర్యం కల్పిస్తామన్నారు.

ఈ హామీల అమలు పరిశీలించినప్పుడు, రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా ఇప్పటికే ఉన్న ఆదాయం తగ్గిపోతున్నది. 27.86లక్షల కోట్ల బడ్జెట్‌లో కిసాన్‌ సమ్మాన్‌ కింద 75వేల కోట్లు కేటాయించి 14.25కోట్లమంది రైతులకు కుటుంబానికి 6 వేల చొప్పున పంపిణీ చేస్తామన్న పథకం 50శాతం కూడా పూర్తికాలేదు. మత్స్య సంపద పెంపునకు కేటాయింపులు లేవు. ఇప్పటికీ 15శాతం గ్రామీణ ప్రాంతాలకు విద్యుచ్ఛక్తి సౌకర్యం కల్పించలేదు. కృషి సించారు యోజన్‌ పథకం క్రింద 99ప్రాజెక్టులలో 31మాత్రమే పూర్తయ్యాయి. మరో 62ప్రాజెక్టులు పూర్తిచేయడానికి మరో ఐదేండ్లు కావాలి. వాస్తవానికి ఈ మధ్యతరహా ప్రాజెక్టులు ఒక్క ఏడాదిలో పూర్తిచేయడానికి అవకాశం ఉంది. నిధుల కేటాయింపు లేకపోవడంతో జాప్యం జరుగుతున్నది. డెయిరీ రంగంలో పాల ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ, న్యూజిలాండ్‌, స్విడ్జర్లాండ్‌ లాంటి దేశాల నుంచి పెద్దఎత్తున పాల ఉప ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడం వలన స్థానిక పాలరైతులు సరైన ధర పొందలేకపోతున్నారు. నెస్లేతో పాటు మరో 66విదేశీ కంపెనీల దిగుమతులు వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 11500 మెట్రిక్‌ టన్నుల తేనె ఉత్పత్తి అవుతుండగా దీనిని రెట్టింపు చేస్తానన్న హామీకి ఎలాంటి నిధులు కేటాయించలేదు. భూరికార్డుల డిజిటలైజేషన్‌ గురించి, పక్కా ఇండ్ల నిర్మాణం గురించి ఆలోచనలే లేవు. 2025 నాటికి 5ట్రిలియన్‌ డాలర్ల దేశీయ స్థూల ఉత్పత్తికి అవకాశంలేని విధంగా 7.5శాతంగా ఉన్న స్థూల ఉత్పత్తి రేటు 4.5శాతానికి తగ్గింది. మరీ అధ్వాన్నంగా వ్యవసాయ రంగం 2.1శాతానికి తగ్గింది. 2019లో 11,500మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని జాతీయ నేరాల బ్యూరో ప్రకటించింది. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఆర్థికరంగంలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి మళ్ళించడానికి సామాజిక అంశాలపై దృష్టిని మళ్ళించే ప్రయత్నం జరిగింది. ఆగస్ట్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ కాశ్మీర్‌ను రెండుగా విభజించారు. పౌరసత్వ సవరణ చట్టం తెచ్చి మతాల మధ్య ఘర్షణ సృష్టించారు. 2021లో రానున్న జనాభా గణాంక వివరాలకు ముందు సేకరించే కుటుంబాల సర్వేతో పాటు ”జాతీయ ప్రజల రిజస్ట్రీ” కూడా అమలుచేస్తానని చెప్పడంతో దేశవ్యాపితంగా నిరసనలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. 13 రాష్ట్రాలు ”జాతీయ ప్రజల రిజిస్ట్రీ”ని సర్వే చేయం అని ప్రకటించాయి. మత విభజనతో దేశంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం ఉండాలని మోడీ ప్రభుత్వం గత లౌకిక విధానాలను దెబ్బతీసే రాజ్యాంగ సవరణ చట్టాలను చేపట్టింది.

పారిశ్రామిక రంగంలో 6,83,317 కంపెనీలు మూతబడ్డాయి. 3.5లక్షల మంది ఉపాధి కోల్పోయారు. మొత్తం ఉత్పత్తి కంపెనీలలో 36.07శాతం కంపెనీలు మూతపడటం కార్మికరంగంలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నది. 2016-19లో ఈశాన్య రాష్ట్రాలలో 2448 కొత్త కంపెనీలు మాత్రమే రిజిస్ట్రీ జరిపాయి. ప్రధానంగా ఆటో, రియల్‌ఎస్టేట్‌ రంగాలలో ఉపాధి కోల్పోయినవారు లక్షల్లో ఉన్నారు. రియల్‌ఎస్టేట్‌ రంగం పూర్తిగా కుదేలయింది. పెట్టుబడి పెట్టిన బ్యాంకులు దివాళా తీశాయి. ప్రాథమిక వనరుల కల్పనలో 2022 నాటికి 175 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుని ప్రస్తుతానికి 76.87 గిగావాట్ల ఉత్పత్తిని మాత్రమే చేశారు. ప్రజలపై పన్నుల భారం పెంచడానికి జీఎస్‌టీ ద్వారా 6లక్షల కోట్ల పన్నుల పెంపుదల చేపట్టారు. పన్నుల పెంపుదల కారణంగా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రజల కొనుగోలుశక్తి దెబ్బతిని మాంద్యం మరింత తీవ్రతరమయింది. ఎఫ్‌సీఐ, సీసీఐ రంగాలను రద్దుచేసే ప్రయత్నం కొనసాగుతున్నది. వంటగ్యాస్‌ సబ్సిడీ ఉపసంహరణ ద్వారా 22 వేల కోట్ల నిధులు వచ్చినప్పటికీ పేదలు గ్యాస్‌ కనెక్షన్ల కోసం కంపెనీల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయోధ్య తీర్పు రావడంతో రామాలయ నిర్మాణానికి పెద్దఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.

ఎన్నికల సందర్భంగా జరిగిన పుల్వామా దాడిలో 40మంది జవానులు మరణించడం, ప్రతీకారంగా ముగ్గురు ఆల్‌ఖైదావారిని ఖతం చేయడం, అదే సందర్భంలో బాలాకోట్‌పై భారత్‌ ఫైటర్‌ విమానాలు దాడిచేయడం వల్ల లభించిన సానుభూతితో గెలిచిన మోడీ ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకానికి తెరలేపింది. 2019-20లో 1.05లక్షల కోట్ల వాటాల ఉపసంహరణకు లక్ష్యం పెట్టుకోగా 27వేల కోట్లు ఉపసంహరించారు. తిరిగి 2020-21నికి 1.50లక్షల కోట్ల ప్రభుత్వరంగంలోని సంస్థల్లోని వాటాల ఉపసంహరణకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లక్ష్యాన్ని ప్రకటించారు. రానున్న కాలంలో ఎయిర్‌ ఇండియాతోపాటు రిజర్వ్‌ బ్యాంకు నుంచి ఎన్‌పీఏల రద్దు పేరుతో ప్రయివేటు రంగానికి వేల కోట్ల నిధులు కట్టబెడతారు. 27 బ్యాంకులను 12 బ్యాంకులుగా ఏకీకరణ చేసి నిధులను ఒకేచోట చేర్చి ఇప్పటికే బ్యాంకులకు ఎగవేసిన కార్పొరేట్లకు తిరిగి రుణాలివ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. 75వేల కోట్లు బ్యాంకులకు మూలధనంగా రిజర్వ్‌బ్యాంకు నుంచి నిధులు మళ్ళించారు.

కేంద్రప్రభుత్వం రెండు సందర్భాలలో 3.5లక్షల కోట్లు రిజర్వ్‌ బ్యాంకు మిగులు నిధులను తమ బడ్జెట్‌ అవసరాల కోసం తీసుకుంది. అదే సందర్భంలో వ్యవసాయ రంగానికి కేటాయించిన 11లక్షల కోట్ల పంటరుణాలను మాత్రం పంపిణీ చేయలేదు. కేంద్రప్రభుత్వ విధానాల ఫలితంగా వ్యవసాయరంగం, పరిశ్రమలలో ఏర్పడిన మాంద్యం ఫలితంగా నిరుద్యోగం పట్టణ ప్రాంతాలలో 7.9శాతానికి చేరగా, గ్రామీణ ప్రాంతాలలో 19.5శాతంతో విలయతాండవం చేస్తోంది. సమస్య తీవ్రం కావడంతో వలసలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. విదేశాలలో ఇప్పటికే కోటి 70లక్షల మంది స్థిరపడ్డారు. మరో 3కోట్ల కుటుంబాలు వివిధ దేశాలలో ఉపాధికోసం వెళ్ళాయి. వలసలు వెళ్లినవారు కొందరు అక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొందరు జైళ్లలో మగ్గుతున్నారు. తిరిగివచ్చిన వారికి ఉపాధి కల్పించడంలో కేంద్రప్రభుత్వం ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. సంక్షేమ పథకాల కోతతో వివిధ బలహీన వర్గాలలో అభివృద్ధి నిలిచిపోయింది. 25లక్షల కోట్లతో జాతీయ గోదాముల గ్రిడ్‌ ఏర్పాటు చేస్తానని చేసిన ప్రకటనకు కనీస కేటాయింపులు కూడా లేవు. ఇప్పటికే వ్యవసాయ ఉత్పత్తులలో నిల్వ సౌకర్యం లేక 20శాతం వినియోగంలోకి రాకుండా పోతున్నాయి. కూరగాయలు, తదితర తేమ వస్తువులలో 35శాతం వరకు నష్టం వాటిల్లుతున్నది.

వైద్య రంగంలో 12వేల ఎంబీబీఎస్‌ సీట్లను 18వేలకు పెంపుదల చేస్తామని ఎన్నికల హామీలో ప్రకటించారు. వెనకబడిన ప్రాంతాలలో ఏ రాష్ట్రంలోనూ వైద్య కళాశాలల ఏర్పాటు చేయలేదు. దేశంలో అక్షరాస్యత గత ఐదేండ్లలో ఏమాత్రం పెరగలేదు. విద్యాభివృద్ధి కాకుండా దేశ అభివృద్ధిని ఊహించలేం. నాగరిక సమాజం ఏర్పాటుకు అక్షరాస్యత అత్యంత కీలకం. దేశంలో విద్యపై ఎక్కువ వ్యయం చేయవలసి రావడంతో విదేశాలలోని విద్యకు ప్రజలు ఆకర్షించబడుతున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా దేశంలోనే నిర్ణీత లక్ష్యం నిర్ణయించి కనీసం 95శాతం విద్యాభివృద్ధికి నిధులు కేటాయించాలి.

ప్రాథమిక వనరుల కల్పనకు కావలసిన చర్యలు చేపట్టడం ద్వారా మాత్రమే మాంద్యం నుంచి బయటపడే అవకాశం ఉన్నది. మిగులు విద్యుత్‌ ఉత్పత్తి, నీటి వనరుల వినియోగం, ఖనిజ సంపద వెలికితీత, రైలు రోడ్డు రవాణ సౌకర్యాన్ని మెరుగుపర్చడం, ప్రకృతి వనరులను సద్వినియోగం చేసి ఉత్పత్తిని పెంచడం ద్వారా మాత్రమే ప్రస్తుతం దేశం ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధం కాగలదు. అంతేకాని ఉపాధి కోల్పోయే పరిశ్రమల మూత, సేవారంగం ఉద్యోగాల కోత వల్ల మాంద్యం మరింత పెరుగుతుంది. నిరుద్యోగ సమస్యను రూపుమాపి అందరికీ ఉపాధి కల్పించే విధంగా విద్యుత్తు, విద్యుత్తేతర పరికరాల ఉత్పత్తికి తగిన సంస్థలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం 2.35లక్షల కోట్ల విలువ గల విద్యుత్తు, విద్యుత్తేతర పరికరాలను ఇతర దేశాలనుండి దిగుమతి చేసుకుంటున్నాము. విదేశీ దిగుమతులను తగ్గించడం కోసం స్వదేశీ ఉత్పత్తులను పెంచాలి. స్వేచ్ఛా వ్యాపారం ఒప్పందం కింద 16దేశాలతో సంతకాలు పెట్టాల్సిన బ్యాంకాక్‌ ఒప్పందాన్ని మోడీ తిరస్కరించడం హర్షించదగ్గ విషయమే అయినప్పటికీ ఇప్పటికీ దిగుతులకు 15 లక్షల కోట్లు విదేశీ మారకద్రవ్యం చెల్లిస్తున్నాం. ఆ విధంగా భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడుతున్నది. దిగుమతులపై ఆంక్షలు కొనసాగించాలి. ప్రస్తుత విధానాల అమలుకు భిన్నంగా ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించి కొనసాగించడం ద్వారా ఆర్థిక మాంద్యం నుంచే కాక నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించవచ్చు.

(Courtesy Nava Telangana)