– 2018 ఎన్సీఆర్బీ గణాంకాలు
– మహిళలకు రక్షణలేని రాష్ట్రాల్లో యూపీ అగ్రస్థానం

న్యూఢిల్లీ : దేశంలో వ్యవసాయ రంగం రోజురోజుకూ సంక్షోభంలో కూరుకుపోతున్నది. అగమ్యగోచరంలో అన్నదాత విలవిలలాడుతున్నాడు. ఏరు దాటాక…తెప్ప తగిలేసినట్టుగా పాలకులతీరు కనిపిస్తున్నది. ఎన్నికలప్పుడు ఓ మాట.. అధికారంలోకి వచ్చాక… పాలకులు నోరుమెదపటంలేదు. దిక్కుతోచనిస్థితిలో గతంలో ఎన్నడూలేని విధంగా అన్నదాతలు రోడ్లపైకొస్తున్నారు. సాక్షాత్తూ రాజధాని ఢిల్లీలోనే గొంతులు పిక్కటిల్లేలా నినదించినా.. వారి సమస్యలను వినేందుకు కూడా మోడీ సర్కార్‌ ముందుకురాలేదు. వ్యవసాయ సంక్షోభానికి అద్దంపడుతున్న రైతుల ఆత్మహత్యల వివరాలను జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో ఆలస్యంగా విడుదలచేసింది. 2018లో 10,349 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు జీవితంలో పోరాడలేక కొందరు ఉరికంబ మెక్కితే.. మరి కొందరు క్రిమిసంహారక మందులతో ప్రాణాలు తీసుకున్నారు. మొత్తం ఆత్మహత్యల సంఖ్య 1,34,516లో రైతుల ఆత్మహత్యలు 7.7శాతంగా ఉండటం గమనార్హం. అయితే.. ఈ లెక్కలు కొన్ని రాష్ట్రాలు ఇచ్చినవి మాత్రమే. కొన్ని రాష్ట్రాలు, కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు రైతులు, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలకు సంబంధించి గణాంకాలు సమర్పించలేదు. పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఒడిషా, ఉత్తరాఖండ్‌, మేఘాలయ, గోవా, చండీగఢ్‌, డయూ అండ్‌ డామన్‌, ఢిల్లీ, లక్షద్వీప్‌, పుదుచ్ఛేరి రాష్ట్రాల్లో సున్నా ఆత్మహత్యలుగా పేర్కొన్నాయని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొనటం గమనార్హం. 2017 గణాంకాలను గోప్యంగా వుంచిన ఎన్సీఆర్బీ వ్యవసాయ రంగానికి సంబంధించి 2018లో మొత్తం 10,349 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు పేర్కొంది. ఇందులో 5,783 మంది రైతులుకాగా, 4,586 మంది వ్యవసాయ కార్మికులుగా తెలిపింది. 5,783 మంది రైతుల్లో 306 మంది మహిళా రైతులుకాగా, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యల సంఖ్యలో 515 మంది మహిళా కార్మికులున్నట్టు తెలిపింది.కాగా ఆత్మహత్య చేసుకున్న రైతులలో మహారాష్ట్ర, కర్నాటక నుంచే సగానికంటే ఎక్కువమంది ఉండటం గమనార్హం. తర్వాతి స్థానం తెలంగాణదే.అయితే వాస్తవానికి రికార్డులకెక్కని అన్నదాతల సంఖ్య భారీగానే ఉండొచ్చని రైతు సంఘాలు అంటున్నాయి.

పెరిగిన మహిళలపై నేరాలు
మహిళలపై నేరాలు కూడా 2017తో పోలిస్తే పెరిగాయి. 2017లో 3,59,849నేరాలు జరగ్గా, 2018లో ఈ సంఖ్య 3,78,277కు పెరిగింది. ఐపీసీ సెక్షన్‌ 376 ప్రకారం.. లైంగికదాడి కేసుల సంఖ్య 2018లో 33,356. 2017లో ఈ సంఖ్య 32,559. 2017తో పోలిస్తే.. మొత్తం నేరాల సంఖ్య 1.3 శాతం (50,07,044 కేసులు) పెరిగినప్పట7ికీ, లక్ష జనాభాకు నేరాల రేటు 2017లో 388.6 నుంచి 2018 లో 383.5 కి తగ్గినట్టు నివేదిక తెలిపింది.

యూపీలోనే నేరాలు అధికం…
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌ మహిళలకు అత్యంత అసురక్షితమైన రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచింది. 2018లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 59,445 నేరాల కేసులు నమోదయ్యాయి. 35,497 నేరాల సంఖ్యతో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. 30,394 కేసులతో బెంగాల్‌, 28,942 కేసులతో మధ్యప్రదేశ్‌ వరుసగా మూడు, నాలుగు స్థానాలను ఆక్రమించాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 15,310 కేసుల సంఖ్యతో ఢిల్లీ తొలిస్థానంలో వున్నది. కాగా, లైంగికదాడికి సంబంధించి 5,450 కేసులతో మధ్యప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్సీఆర్బీ దేశంలో నమోదైన నేరాలను విశ్లేషించి ఈ గణాంకాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

రోజుకు సగటును 80 హత్యలు, 91 లైంగికదాడులు
ప్రతీ రోజు సగటున 2018లో 80 హత్యలు, 298 కిడ్నాప్‌లు, 91 లైంగికదాడులు జరిగినట్టు ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) పరిధిలో 31,32,954 నేరాలు, ప్రత్యేక, స్థానిక చట్టాల (ఎస్‌ఎల్‌ఎల్‌) పరిధిలో 19,41,680 నేరాలు కలిపి మొత్తం మీద 50,74,634 కాగ్నిజబుల్‌ నేరాలు 2018లో నమోదయ్యాయి. 2017లో ఈ సంఖ్య 50,07,044 కాగా, 2018లో నేరాల సంఖ్య పెరిగింది. కాగ్నిజబుల్‌ నేరమంటే.. మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు అవసరంలేకుండా పోలీసు స్టేషన్‌ అధికారి దర్యాప్తు చేయవచ్చు, వారెంట్‌ లేకుండా అరెస్టు చేయవచ్చు. 2018 లో మొత్తం 29,017 హత్య కేసులు నమోదయ్యాయి, ఇది 2017తో (28,653 నేరాలు) పోలిస్తే 1.3శాతం పెరిగింది. 2018లో అపహరణకు సంబంధించి 1,05,734 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ సంఖ్య 2017తో పోలిస్తే 10.3 శాతం పెరిగాయి. 2017, 2016లో ఈ సంఖ్య వరుసగా 95,893, 88,008గా ఉన్నట్టు ఎన్సీఆర్బీ పేర్కొంది.

పేదరికంతోనే…
– వార్షికాదాయం లక్ష రూపాయల కంటే
– తక్కువగా ఉన్నవారే ఆత్మహత్యల్లో అధికం:ఎన్సీఆర్బీ

దేశంలో పేదరికంతో బాధపడుతున్నవారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వార్షికాదాయం లక్ష రూపాయల కంటే తక్కువగా ఉన్న ప్రజలే ప్రాణాలను వదిలేస్తున్నారు. ఈ మేరకు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో ఆత్మహత్యలు, ప్రమాదవశాత్తు సంభవించిన మరణాల (ఏడీఎస్‌ఐ)పై 2018కి సంబంధించిన ఓ నివేదికను కేంద్రం బుధవారం విడుదల చేసింది.

నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం… గతేడాది ఆత్మహత్య చేసుకున్న 1,34,516 మందిలో 66 శాతం మంది వార్షికాదాయం లక్ష రూపాయల లోపే ఉంది. కాగా, వీరిలో చాలామంది సెకండరీ స్కూల్‌ విద్యను పూర్తి చేయడం గమనార్హం. చనిపోయిన వారిలో దినసరి కూలీలే అధికంగా ఉన్నారు. మరోవైపు మొత్తం మరణాలలో 2016లో 19.2 శాతం మంది దినసరి కూలీలే ఉండగా.. గతేడాదికి అది 22.4 శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగించే అంశం. ఇదే తరహాలో నిరుద్యోగుల సంఖ్య 8.5 శాతం ఉండగా.. గతేడాదికి ఆ సంఖ్య 9.8 శాతానికి చేరింది. వేతన జీవులు, వృత్తినిపుణులలోనూ ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. 2018లో 8.9 శాతం (2016లో 7.9 శాతం) మంది ఉద్యోగస్తులు ప్రాణాలు తీసుకున్నారు.

(Courtesy Nava Telangana)