– వలస కార్మిక కుటుంబాల కష్టాలు
– 20 మందికి పైగా జననం

న్యూఢిల్లీ : వింటేనే కన్నీళ్లు తెప్పించేలా వలస కార్మికుల కష్టాలు రోజురోజుకూ వెలుగుచూస్తున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పట్టణంలో పనులు లేక, ఇండ్లకు అద్దెలు కట్టలేక, తిండికి డబ్బు లేక పస్తులతో అగచాట్లు పడేకన్నా సొంతూర్లకు వెళ్లడమే నయమనుకుంటూ కాలి నడకన బయల్దేరిన వారిలో వందల మంది ప్రమాదాల్లో ప్రాణా లు కోల్పోయారు. ఎట్టకేలకు స్పందించి శ్రామిక్‌ రైళ్లు ఏర్పాటు చేసినా కిక్కిరిసి ఉండటం, కనీస సౌకర్యాలు లేకపోవడం, 10 గంటలకు పైగా మార్గమధ్యంలో నిలిపి వేస్తుండటం తో ఆకలిదప్పులతో వారు అలమటిస్తున్నారు. పలుచోట్ల ఆందోళనలు సైతం జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వారితో పాటు ప్రయాణమైన ఆయా కుటుంబాల్లోని నిండు గర్భిణుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. ఈ నెల 1 నుంచి 20 మందికిపైగా రైళ్లలోనే తమ బిడ్డలకు జన్మ నిచ్చారని రైల్వేశాఖ వెల్లడించిం ది. రైళ్లను మధ్యలో నిలిపివేసి, వారికి సకాలంలో వైద్యం అందించడంతో తల్లీబిడ్డలు ప్రాణాలతో బయట పడటం ఊరట కలిగించింది.

గుజరాత్‌ లోని సూరత్‌ నుంచి ఓ నిండు గర్భిణి బీహార్‌లోని నవడా (పాట్నాకు 100 కిలోమీటర్ల దూరం) రైలులో బయలుదేరగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ సమాచారం మెడికల్‌ ఎమర్జెన్సీకి వెళ్లగా.. అధికారులు ఆగ్రాలో నిలిపివేశారు. డాక్టర్‌ పులకిత రైలులో డెలివరీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని బిడ్డ ఫోటోను రైల్వే ట్వీట్‌ చేసింది. తెలంగాణలోని కాజీపేట నుంచి ఒడిశాకు బయలు దేరిన రైలులో వలస కార్మికురాలు ఆదివారం బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు పురిటి నొప్పులు వచ్చినట్టు సమాచారం రావడంతో తిత్లాఘర్‌ వద్ద రైల్వే డివిజన్‌ మెడికల్‌ ఆఫీసర్‌ స్పందించి.. ఆమెకు డెలివరీ చేశారు.

తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, స్థానిక ఆసుపత్రికి తరలించా మని మెడికల్‌ అధికారి తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి బలంగీర్‌కు బయలు దేరిన శ్రామిక రైలులో మరో వలస కార్మికురాలు శుక్రవారం ఒక బిడ్డకు జన్మనిచ్చింది. మే 1 నుంచి వలస కార్మికుల తరలింపునకు ఏర్పాటుచేసిన శ్రామిక రైళ్లలో ఇప్పటి వరకు 20 మందికి పైగా చిన్నారులు జన్మించారని, కరోనా వరల్డ్‌లోకి స్వాగతమంటూ… హ్యాష్‌ట్యాగ్‌ లను జతచేస్తూ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు.

Courtesy Nava Telangana