• ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల నిర్జీవ జననాలు
  • అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఎక్కువ
  • కరోనా విజృంభణతో మరింత పెరగనున్న గర్భస్థ మరణాలు
  • డబ్ల్యూహెచ్‌వో నివేదికలో వెల్లడి

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 20 లక్షల మంది శిశువులు కళ్లు తెరిచి లోకాన్ని చూడకుండా తల్లి గర్భంలోనే కన్నుమూస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజా నివేదికలో వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఈ మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా ప్రస్తుతం ఆరోగ్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని.. దాని ప్రభావంతో వచ్చే ఏడాది నిర్జీవ జననాలు మరింతగా పెరిగే ముప్పుందని ఆందోళన వ్యక్తం చేసింది. కనీసం 28 వారాల గర్భం తర్వాత ప్రాణం లేని శిశువు పుట్టడాన్ని ‘నిర్జీవ జననం’గా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి జననాలపై తమ అంచనాలను డబ్ల్యూహెచ్‌వో, యూనిసెఫ్‌ సంయుక్తంగా గురువారం ఓ నివేదికలో వెల్లడించాయి.

తాజా నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలివీ..
 ప్రపంచవ్యాప్తంగా ప్రతి 16 సెకన్లకు ఓ నిర్జీవ జననం సంభవిస్తోంది.
 కరోనా కారణంగా చాలా దేశాల్లో ఆరోగ్య సేవలు 50 శాతం వరకు తగ్గిపోయాయి. ఫలితంగా 117 దేశాల్లో వచ్చే ఏడాది అదనంగా రెండు లక్షల మంది శిశువులు తల్లి గర్భంలో ఉండగానే కన్నుమూసే ముప్పుంది. అవన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలే.
 40 శాతం నిర్జీవ జననాల కేసుల్లో ప్రసవ సమయంలోనే శిశువులు మృత్యువాతపడుతున్నారు. సబ్‌ సహారన్‌ ఆఫ్రికా, సెంట్రల్‌ ఆసియాల్లో ఇలాంటి మరణాలు అత్యధికంగా చోటుచేసుకుంటున్నాయి. సుశిక్షితులైన ఆరోగ్య కార్యకర్తల సేవలను పొందడం ద్వారా వాటిని నివారించవచ్చు.
 గత ఏడాది ప్రతి నాలుగు నిర్జీవ జననాల్లో మూడు సబ్‌ సహారన్‌ ఆఫ్రికా, దక్షిణాసియాల్లోనే నమోదయ్యాయి.
గర్భం దాల్చినప్పటి నుంచి సరైన వైద్య సేవలు పొందడం, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది సమక్షంలో కాన్పు చేయించుకోవడం వంటి జాగ్రత్తలతో నిర్జీవ జననాలను చాలా వరకు నివారించవచ్చు.

Courtesy Eenadu