గుండెపోటుతో ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్ల కన్నుమూత

ప్రాణాలు విడిచిన మరో మహిళా కండక్టర్‌ భర్త

అల్వాల్‌/బోడుప్పల్‌/హైదరాబాద్‌/రామచంద్రాపురం, అక్టోబరు 10:

 అది జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెంగిచెర్ల ఆర్టీసీ బస్‌ డిపో! తమ డిమాండ్లపై ఆందోళన జరిపేందుకు ఆర్టీసీ కార్మికులు, వారికి మద్దతుగా పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నేతలు అక్కడికి వచ్చారు. అంతా కలిసి ఉప్పల్‌ డిపో వరకు ర్యాలీ నిర్వహించారు. వారిలో పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్నాడో డ్రైవర్‌! అలా నినదిస్తూనే కుప్పకూలాడు. ఆయన్ను తోటి కార్మికులు హుటాహుటిన దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు! ‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ ప్రకటనతో గత ఆరు రోజులుగా ఎంతగా వేదన చెందిందో ఏమో ఆ గుండె ఆగిపోయింది. ఉప్పల్‌ డిపో వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు.. చెంగిచెర్ల ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కొమురయ్య! ఆయన మృతితో భార్య, పిల్లలు రోడ్డున పడ్డారు. ఫీర్జాదిగూడలోని మల్లికార్జుననగర్‌లో కొమురయ్య కుంటుంబం ఉంటోంది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కూతురు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు.

‘ఆర్టీసీలో కొలువు పోతే పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఎలా జరుగుతాయో’ నంటూ కొమురయ్య రెండ్రోజులుగా తోటి కార్మికుల వద్ద వాపోయేవాడని సహచరులు చెప్పారు. తీరని ఆవేదనతోనే ఆయన గుండెపోటుకు గురయ్యాడని, ప్రభుత్వ మొండి వైఖరే కొమురయ్య ప్రాణం తీసిందని కార్మికులు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హెచ్‌సీయూ డిపో డ్రైవర్‌ ఖలీల్‌ మియా (51) ఇదే తరహా విషాదాంతం! ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ‘కొలువు పోతే ఎట్ల బతుకుతం’ అంటూ ఆరు రోజులుగా భార్య ఫర్జాన్‌ బేగంతో చెప్పుకొని బాధపడుతున్నాడు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రాగా వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచాడు.

భార్య ఉద్యోగం పోతుందేమోనన్న ఆవేదనతో మరో మహిళా కండక్టర్‌ భర్త గుండెపోటుతో మృతిచెందాడు. అల్వాల్‌లోని జ్యోతికాలనీలో నివాసముండే పద్మ (38) హకీంపేట డిపోలో కండక్టర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త రఘు (45) ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స తీసుకొని ఇంటి దగ్గర ఉంటున్నాడు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా భార్యకు జీతం రాలేదు. బ్యాంకులో తన ఇంటికి సంబంధించిన లోన్‌ ఈఎంఐ చెక్‌ బౌన్స్‌ ఆయింది. దీంతో రఘు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఇటీవల సీఎం కేసీఆర్‌ చేసిన ‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ ప్రకటన ఆయన్ను మరింత ఆందోళనకు గురిచేసింది. గురువారం గుండెపోటుతో రఘు కుప్పకూలాడని.. ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయాడని భార్య పద్మ చెప్పింది. విషాదాన్ని ఆమె.. హకీంపేటలోని తోటి ఉద్యోగులకు పద్మ సమాచారమిచ్చింది. వెంటనే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ర్యాలీగా ఆమె ఇంటికి చేరుకొన్నారు. రఘు మృతికి కేసీఆర్‌ నియంతృత్వ పోకడలే కారణమని ఆరోపించారు. బాధితురాలుకి న్యాయం చేయాలని తోటి ఉద్యోగులు డిమాండ్‌ చేశారు

Courtesy andhra jyothy