– సౌకర్యాలైనా కల్పించేలా చూడండి… సొంతూరికైనా చేర్చండి
– ముంబయిలోని తెలంగాణ బిడ్డల వేడుకోలు
– అగ్గిపెట్టెల్లాంటి ఒక్కో రూములో 10 మంది
– వందలాది మందికి సామూహిక మరుగుదొడ్లే దిక్కు
– రేషన్‌ అందట్లేదు.. సహాయక చర్యలు లేవు..

లాక్‌డౌన్‌తో కాలు బయట పెట్టలేక…తిండి దొరక్క ముంబయిలో తెలంగాణ బిడ్డలు అరిగోసదీస్తున్నారు. కరోనా కట్టడికి పాలకులు ‘భౌతికదూరం’ పాటించాలని చెబుతున్నప్పటికీ…విధిలేక అగ్గిపెట్టెల్లాంటి ఒక్కో రూములో 10 మందికిపైగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వారందరికీ సామూహిక మరుగుదొడ్లే దిక్కు. పోలీసుల బంధనాలను చేధించుకుని ఆహార కేంద్రాలకు వెళ్లలేని ధైన్యపరిస్థితి. ‘సీఎం సారూ దయచేసి సొంతూర్లకు చేర్చే ఏర్పాట్లు చేయండి. లేకపోతే కనీస సౌకర్యాలు కల్పించేలాగనైనా చూడండి. మీరే మాకు దిక్కు’ అంటూ వేడుకుంటున్న ముంబయిలోని తెలంగాణ వలస కార్మికులపై ప్రత్యేక కథనం.

ముంబయి నగరంలో తెలంగాణకు చెందిన రెండు లక్షలకుపైగా కార్మికులు జీవనం సాగిస్తున్నారు. వీరు ఎక్కువగా జోప్రాపట్టి, బోర్వేల్లి, కందవెల్లి, మలాడ్‌, గోరేగామ్‌, భోగేశ్వర, అంధేరి, విల్లేపార్లే, సన్థగూర్చి, బాద్షా, వడాల, వర్లి, చిరిమిరోడ్‌, సైన్‌, కొలివాడ, చెంబూర్‌, తిలక్‌నగర్‌, గటక్‌పూర్‌, ఆదర్శ్‌నగర్‌, దౌశ్వర్‌, వాటి తదితర ప్రాంతాల్లోని మురికివాడల్లో నివాసముంటున్నారు. వీరిలో ఎక్కువగా ఇండ్లలో పనిచేసేవారు, డ్రైవర్లు, భవననిర్మాణ, విద్యుత్‌ కార్మికులున్నారు. కొందరు పాలవ్యాపారం కూడా చేస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత వారి ఉపాధి పూర్తిగా పోయింది. ఇండ్లకే పరిమితమయ్యారు.

అగ్గిపెట్టెల ఇండ్లు..సామూహిక మరుగుదొడ్లు
చైనా దేశంలోని వుహాన్‌ పట్టణంలో చేపల మార్కెట్‌లో రొయ్యలమ్మే ఓ మహిళ మలమూత్రవిసర్జనకు పబ్లిక్‌టాయిలెట్‌ను ఉపయోగించగా కరోనా సోకింది. తొలి పాజిటివ్‌ కేసు అదే. ఆ దేశంలో నమోదైన తొలి 30 కేసుల్లో ఆ మార్కెట్‌కు చెందినవారే 29 మంది ఉన్నారు. అపరిశుభ్ర పరిసరాలతో కరోనా విస్తరించే ప్రమాదం ఎక్కువని తేటతెల్లం చేస్తున్నది. ఇదే ముంబయి నగరంలోని తెలంగాణ వలస కూలీలను కలవరపెడుతున్నది. వారు ఉంటున్న ప్రాంతాలన్నీ మురికివాడలే. ఆరడుగుల వెడల్పు, ఎనిమిదడుగుల ఒక్క గదిలో 10 మంది కూలీలు ఉంటున్నారు. ఇన్నిరోజులు షిఫ్టుల వారీగా పనికి వెళ్లడంతో ఉదయం కొందరు, రాత్రి కొందరు ఉండేవారు. లాక్‌డౌన్‌ తర్వాత అందరూ రూమ్‌కే పరిమితమయ్యారు. ఆ గదుల్లో ఎక్కడా మరుగుదొడ్లు లేవు. సామూహిక మరుగుదొడ్లే దిక్కు. ప్రతి ప్రాంతంలోనూ వందలాది మంది నాలుగైదు మరుగుదొడ్లనే వాడుతున్నారు. ఒక్కరికి కరోనా సోకినా చైనాలోలాగా తమకందరికీ వస్తుందనే భయం కార్మికులను వెంటాడుతున్నది.

పనుల్లేవ్‌…తిండి లేదు… బయటకెళ్తే పోలీసుల బాదుడు
తమ కుటుంబాలకు పదోతేదీకల్లా డబ్బులను పంపారు. మళ్లీ పనికెళ్తే డబ్బులు వస్తాయనే భరోసాతో చేతిలో ఖర్చులకు కూడా ఉంచుకోలేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసర సరుకులు అందనంత స్థాయికి చేరుకోవడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల పనిచేసి వస్తే ఎక్కడ తమకు వైరస్‌ సోకుతుందనే భయంతో ఇండ్లల్లో పనిచేసేవారిని కూడా యజమానులు రాన్విట్లేదు. దీంతో వారికి ఉన్న ఒక్క ఆదాయ మార్గం పోయింది. మురికివాడల్లో భోజనవసతులు కల్పిస్తున్నామని అక్కడి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ తెలంగాణ వలస కూలీలకు అందుతున్నది అరకొరే. ఐదుకేజీల బియ్యం సాయం వారి దరి చేరలేదు. కొందరు కూలీలు స్థానిక రేషన్‌డీలర్లను అడిగితే ‘ఒకటో తేదీ తర్వాత ఎప్పుడొస్తావో తెల్వదు’ అని దాటవేస్తున్న పరిస్థితి. వంటసామాగ్రి, బియ్యం లేక ఒక పూట తిని మరో పూట కడుపుమాడ్చుకుని రూముల్లో కుక్కిన పేనుల్లా గమ్ముగా పడుకుంటున్నారు. స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏర్పాటు చేసే ఆహార కేంద్రాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే బయటకు రావొద్దంటూ పోలీసులు చితకబాదుతున్నారని కూలీలు వాపోతున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వసతులు కల్పించాలి
లాక్‌డౌన్‌తో ముంబయిలో తెలంగాణ కార్మికులు అరిగోసదీస్తున్నరు. బియ్యమిచ్చినోడు లేడు..అన్నం పెట్టినోడు లేడు. బయటకెళ్లలేని పరిస్థితి. సీఎం కేసీఆర్‌ మమ్ముల్ని రాష్ట్రానికి తీసుకెళ్లే ఏర్పాట్లయినా చేయించాలి. లేకుంటే తెలంగాణ కార్మికులకు సహాయం చేసేలా మహారాష్ట్ర ప్రభుత్వంతోనైనా మాట్లాడి వసతులనైనా కల్పించాలని మనవి.
– ఇ.శ్రీనివాస్‌, గుజ్జ, యాద్రాద్రి జిల్లా

కరోనా ఏమోగానీ..తిండిలేక సచ్చేటట్టున్నం
మేం కిరాయిలకు ఉండి బతుకుతున్నం. నెలకు ఆరున్నరవేలు కిరాయికే పోతది. నేను ఇండ్లల్ల పన్జేస్త. మాఆయన కారు డ్రైవర్‌. ఇద్దరి జీతం కలిపితే రూ.18వేలు దాటదు. ఈడనేమో పరిస్థితి ఆగమాగంగా తయారైంది. రెంటు కట్టాలని ఒత్తిడి చేస్తున్నరు. పనిలేదు. చేతుల పైసల్లేవు. ఏం అర్థమైతలేదు. కరోనా వైరస్‌ఏమోగానీ తిండి లేక సచ్చేటట్టుంది.
– స్వాతి, పెగడపల్లి, జగిత్యాల జిల్లా

సీఎం సారూ..రాష్ట్రానికి తీసుకుపోయే ఏర్పాట్లు చేయండి
మా ఫ్యామిలీలు అక్కడ. మేము ఇక్కడ. మా కుటుంబ సభ్యులు ఎట్ల ఉన్నరో అన్న బెంగ మాకు.. మేము ఎట్ల ఉన్నమో అన్న భయం మా కుటుంబ సభ్యుల్లో ఉంది. పగోడికి కూడా ఈ పరిస్థితి రావొద్దు. బాత్రూమ్‌లతో వైరస్‌ ఎక్కడ మాకు వస్తుందేమో అన్న భయం వెన్నాడుతున్నది. ప్రత్యేక వాహనాలు పెట్టి మమ్ముల్ని రాష్ట్రానికి తీసుకుపోయేలా అనుమతులు ఇప్పించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా. టెస్టులు చేసినా పర్వాలేదు..క్వారంటైన్‌లో పెట్టినా పర్వాలేదుగానీ రాష్ట్రానికి ఎట్టనైనా తీసుకుపోండి.
– ఎ.నర్సారెడ్డి, రోటిగూడ, జన్నారం మండలం, మంచిర్యాల జిల్లా

Courtesy Nava Telangana