ఇద్దరు దళిత చిన్నారుల హత్య
– కేసు మాఫీకి పోలీసుల యత్నం..!
– భోపాల్‌ : బహిరంగంగా మల విసర్జన చేశారన్న ఆరోపణలపై ఇద్దరు దళిత చిన్నారులను కొట్టి చంపిన ఘటన మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో జరిగింది. భవ్‌ఖేడి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో సోదరులైన హకీం యాదవ్‌, రమేష్‌ యాదవ్‌లను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మృతులు రోషణి (12), అవినాష్‌ (10)లని తెలిపారు. పంచాయతీ భవనానికి ఎదురుగా ఉన్న ప్రదేశంలో మల విసర్జన చేయవద్దని చిన్నారులను సోదరులిద్దరూ మందలించారని అవినాష్‌ తండ్రి మనోజ్‌ వాల్మీకి తెలిపారు. అవినాష్‌ తమ ఇంట్లో మరుగుదొడ్డి లేదని చెప్పాడని పేర్కొన్నారు. గతంలో కూడా సోదరులిద్దరూ తన కుమారుడిని తిట్టారని చెప్పారు. పాతకక్షల నేపథ్యంలో ఈ దాడి చోటుచేసుకుందని వెల్లడించారు. గతంలో వారికి సంబంధించిన పంట పొలంలో ఓ చెట్టు కొమ్మను నరికానని, అప్పట్లో వారితో తనకు గొడవ మొదలైందని తెలిపారు. దీంతోనే పిల్లలిద్దరినీ కర్రలతో విచక్షణా రహితంగా కొట్టి చంపారని తెలిపారు. నిందితుల్లో ఒకరైన హకీంకు మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, చిన్నారులిద్దరూ వారి తాత ఇంటికి వెళుతుండగా హత్య చేశాడని ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ రాజాబాబు సింగ్‌ తెలిపారు.

Courtesy Prajashakthi…