న్యూఢిల్లీ : 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో దోషులుగా ఉన్న 17 మందికి సుప్రీంకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌పై విడుదలైన వారు మధ్యప్రదేశ్‌కు వెళ్లి సామాజిక, ఆధ్మాత్మిక సేవలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వారికి పని కల్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరింది. నిందితులను రెండు గ్రూపులుగా విభజించి, ఒక గ్రూప్‌ను ఇండోర్‌లో, మరో గ్రూప్‌ను జబల్‌పూర్‌లో ఉంచి రోజుకు ఆరు గంటల పని కల్పించాలని సూచించింది. దీనిపై సమ్మతి తెలుపుతూ రిపోర్టు సమర్పించడంతో పాటు దోషుల ప్రవర్తనపై రోజువారీ నివేదిక సమర్పించాలని రాష్ట్ర న్యాయశాఖ అధికారులకు తెలిపింది. గుజరాత్‌లో గోద్రా ఘటన తర్వాత జరిగిన అల్లర్లలో భాగంగా సర్దార్‌పుర గ్రామంలో 33 మంది ముస్లిములను నిందితులు సజీవ దహనం చేశారు. అల్లరిమూకలు దాడులు చేస్తున్న సమయంలో ఆ ముస్లిం కుటుంబాలు ఒక ఇంట్లో దాక్కోగా, బయటి నుంచే నిప్పంటించారు. ఈ కేసును విచారించిన గుజరాత్‌ హైకోర్టు 17 మందిని దోషులుగా గుర్తించింది. మరో 14 మంది నిర్ధోషులుగా పేర్కొంది.

Courtesy Nava Telangana