• ఈసారి నియామకం లేనట్టేనా..?.. 
  • రెన్యువల్‌ కోసం 12,600 మంది వాలంటీర్లు, 2500 గెస్ట్‌ లెక్చరర్ల నిరీక్షణ  
  • విద్యావాలంటీర్లకు 4 నెలల జీతాలు 10 మాసాలుగా పెండింగ్‌ 
  • జీవో-45 స్వీయ నిబంధనలనే ఉల్లంఘిస్తున్న ప్రభుత్వం   

హైదరాబాద్‌ : ‘‘ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసినకాలానికి ఉపాధ్యాయులందరికీ జీతాలు వెంటనే చెల్లించాలి.. లాక్‌డౌన్‌ కాలానికి సంబంధించి కూడా వేతనాలు ఇవ్వాల్సిందే.. జీతాలు చెల్లించని యాజమాన్యాలపై కఠిన చర్యలుంటాయి..’’ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు అనేకసార్లు చేసిన ప్రకటన ఇది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో-45ను కూడా విడుదలచేసింది. ఉపాధ్యాయుల సంక్షేమం గురించి  పదే పదే ప్రస్తావించిన ప్రభుత్వం.. తాను రూపొందించిన నిబంధనలను తానే ఉల్లంఘిస్తోంది.

పాఠశాల విద్యాశాఖ పరిఽధిలో రాష్ట్రవ్యాప్తంగా 12,600 మంది విద్యావాలంటీర్లు పనిచేస్తుండగా.. వీరిలో ఐదు జిల్లాల పరిధుల్లోని దాదాపు 4వేల మందికి గత డిసెంబరు నుంచి మార్చి వరకు వేతనాలు ఇంకా చెల్లించనే లేదు. మరోవైపు.. లాక్‌డౌన్‌ కాలానికి సంబంధించి ఒక్క పైసా కూడా చెల్లించకపోగా.. ఈ విద్యాసంవత్సరం రెన్యువల్‌ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అలాగే ఇంటర్‌, డిగ్రీ లెక్చరర్లుగా పనిచేస్తున్న దాదాపు 2500 మంది గెస్ట్‌ లెక్చరర్ల రెన్యువల్‌ విషయంపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ విద్యా సంవత్సరంలో వీరి కొలువులు ఉంటాయా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

జీవో-45 విద్యాశాఖకు వర్తించదా..?
2018-19 గణాంకాల ప్రకారం ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 1,15,663 మంది ఉపాధ్యాయులుండగా.. వీరిలో ఏటా వందల సంఖ్యలో ఉద్యోగ విరమణ      చేస్తున్నారు. కొత్త నియామకాలు లేకపోవడంతో ఖాళీ అయిన ఉపాధ్యాయుడి స్థానంలో తాత్కాలిక పద్ధతిలో విద్యావాలంటీర్లను నియమిస్తున్నారు. ఇలా 2019-20లో 15,600 మందిని తీసుకున్నారు.

కొన్ని చోట్ల టీఆర్టీ ద్వారా ఎంపికైన టీచర్లు రావడంతో కొందరిని తొలగించగా.. ప్రస్తుతం 12,600 మంది విద్యావాలంటీర్లు మిగిలారు. వీరికి  ప్రతినెలా చెల్లించే రూ. 12 వేల గౌరవ వేతనం ఇవ్వడం లేదు. ప్రభుత్వం 3-4 నెలలకోసారి ప్రత్యేక బడ్జెట్‌ను విడుదల చేస్తేనే వీరికి వేతనాలు అందుతున్నాయి. కాగా, హైదరాబాద్‌, సిద్దిపేట, ఆసిఫాబాద్‌, కొత్త్తగూడెం, గద్వాల జిల్లాల్లో దాదాపు 4వేల మందికి గత డిసెంబరు నుంచి వేతనాలు అందలేదు. లాక్‌డౌన్‌ కాలంలోనూ వేతనాలు చెల్లించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం మార్చి-22న జీవో-45ని  విడుదల చేసింది. కానీ విద్యావాలంటీర్లకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు.

2500 మంది గెస్ట్‌ లెక్చరర్లు..
పాఠశాల విద్యాశాఖలో విద్యావాలంటీర్లను ఇంకా రెన్యువల్‌ చేయనట్లే. ఇంటర్‌, డిగ్రీ ప్రభుత్వ కళాశాలల్లో గెస్ట్‌ లెక్చరర్ల విషయంలోనూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేనాటికే వీరందరినీ రెన్యువల్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది.

కానీ, ఈసారి పాఠశాలలు, కళాశాలలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో వారి అవసరం లేదని భావించి రెన్యువల్‌ చేయలేదు. పాఠశాలలు, కళాశాలలు తెరవకున్నా జీతాలు చెల్లించాలని, ఉపాధ్యాయులను తొలగించకూడదంటూ జీవో-45 ద్వారా హెచ్చరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాను రూపొందించిన నిబంధనలనే అమలు చేయడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Courtesy Andhrajyothi