• 114 కేసులు.. 15 రాష్ట్రాలకు విస్తరణ…
  • ఐరోపా, టర్కీవాసులకు నో ఎంట్రీ
  • అనవసర ప్రయాణాలు వద్దు..
  • అన్నీ మూసివేత.. వర్క్‌ ఫ్రం హోం.. కేంద్రం సూచనలు
  • ఢిల్లీలో సభలు రద్దు..
  • కేరళలో విదేశీయులపై నిఘా..
  • ఈశాన్యంలో ప్రవేశమే లేదు

న్యూఢిల్లీ : కరోనా ప్రకంపనలు తీవ్రంగా ఉండడంతో పూర్తి షట్‌డౌన్‌ దిశగా భారత్‌ కూడా కదులుతోంది. కరోనాపై ఏర్పాటైన మంత్రుల బృందం సోమవారం సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆంక్షలను కఠినం చేయాలని నిర్ణయించింది. టర్కీ సహా ఐరోపా, బ్రిటన్‌ నుంచి ఏ విమానం, ఏ నౌక ఎవరినీ తీసుకురాకూడదని తేల్చిచెప్పింది.  గల్ఫ్‌ నుంచి వచ్చే వారికి 14 రోజుల పాటు నిర్బంధ చికిత్స అమలు చేయనున్నారు. ఈ నెల 18 నుంచి 31 దాకా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు (స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు, సాంకేతిక, న్యాయ, ఇతర విద్యాసంస్థలు), వ్యాయామ శాలలు, ఈతకొలనులు, సినిమా హాళ్లు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు మూసేయాలని రాష్ట్రాలకూ ఆరోగ్యశాఖ నిర్దిష్ట ఆదేశాలు జారీచేసింది.

‘అనవసర ప్రయాణాలు మానండి. బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణికులు ఒకరికొకరు తాకకుండా కనీసం మీటరు దూరం పాటించాలి.  క్రీడా, ఇతర సామాజిక పోటీలు నిలిపేయాలి’ అని కోరింది. ప్రభుత్వేతర సంస్థలన్నీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం  కల్పించాలని విజ్ఞప్తి చేసింది.  దేశంలో మరో 4 కరోనావైరస్‌ కేసులు నమోదయ్యాయి. తొలిసారిగా ఒడిసా సహా.. లద్దాఖ్‌, జమ్మూ కశ్మీర్‌, కేరళలోనూ కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో ఇప్పటిదాకా 15 రాష్ట్రాల్లోని 114 మంది (17 మంది విదేశీయులు)కి వైరస్‌ సోకింది. వీరిలో ఇద్దరు మరణించగా, 13 మందికి నయమైంది. ఢిల్లీలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, మత పరమైన సమావేశాలను నిషేధించారు.

‘మహా’ ఉధృతి
వైరస్‌ ఉధృతి మహారాష్ట్రలో ఎక్కువగా ఉంది. ఇప్పటిదాకా 39 మందికి సోకింది. ముంబైలో ముగ్గురికి, నవీ ముంబై, యావత్మల్‌, నాగ్‌పూర్‌ల్లో ఒకరికి వ్యాధి ఉన్నట్లు భావిస్తున్నారు. 200 మంది అబ్జర్వేషన్లో ఉన్నారు. మూడు నెలల పాటు మునిసిపల్‌, పంచాయతీ ఎన్నికలను వాయిదా వేశారు. వర్సిటీలన్నీ పరీక్షలను వాయిదా వేశాయి. రాష్ట్రంలో పరిస్థితి దిగజారుతుండడంతో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో మాట్లాడారు.

క్వారంటైన్‌ చేసిన వారికి ట్యాగ్‌లు
దేశంలో- ఆ మాటకొస్తే ప్రపంచంలో ఎక్కడా లేని ఓ అసాధారణ నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. నూరు శాతం హోం క్వారంటైన్‌ చేసిన వారికి ట్యాగింగ్‌ చేయనుంది. ఎవరితోనూ కలవకుండా ఇళ్లలోని ఓ గదికే పరిమితం చేసే వారి ఎడమచేతికి ఓ స్టాంప్‌ వేస్తారు. తద్వారా ‘ఈ వ్యక్తి క్వారంటైన్‌లో ఉన్నాడు..’ అని అందరికీ తెలిసేలా చేస్తారు. చికిత్స కేంద్రాల నుంచి ఏడుగురు పారిపోయి ప్రజల్లో కలిసిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అసెంబ్లీ సమావేశాలు కుదింపు
బిహార్‌, ఛత్తీ్‌సగఢ్‌, బెంగాల్‌ అసెంబ్లీ సమావేశాలను కుదించేశారు. బలపరీక్ష జరగాల్సిన మధ్యప్రదేశ్‌లోనూ పదిరోజుల పాటు వాయిదా వేశారు. కరోనా పాజిటివ్‌ కేసులకు చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రకటించారు. పార్లమెంట్‌కు వచ్చే ఎంపీలతో పాటు సిబ్బంది, జర్నలిస్టులు, ఇతరులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తున్నారు.

కర్ణాటకలో స్తంభించిన రవాణా
కరోనా ఆంక్షలతో కర్ణాటకలో బంద్‌ వాతావరణం కనిపిస్తోంది. 60 శాతం రవాణా స్తంభించింది. మరొకరికి కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. తమిళనాడులో స్కూళ్లు, కాలేజీలు, మ్యూజియాలు, పార్కుల, పబ్‌లు, మైదానాలు, జిమ్‌లు, బార్లు, షాపింగ్‌ మాల్స్‌ 31 దాకా మూసివేయనున్నారు.

కరోనా మృతుడి కుమార్తెకు పాజిటివ్‌
దేశంలో కరోనా తొలిమృతుడు, కర్ణాటక కలబుర్గికి చెందిన వ్యక్తి (76) కుమార్తెకు కూడా వైరస్‌ సోకింది. ఆయన కుమార్తె సహా మరో నలుగురికి పరీక్షలు చేశారు.

తాజ్‌ క్లోజ్‌.. కోవెళ్లు, పార్క్‌లకూ సెగ
ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌ మహల్‌ను 31వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో పాటు పురావస్తు శాఖ పరిధిలోకొచ్చే 3, 691 చారిత్రక కట్టడాలను కూడా మూసేస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌  వెల్లడించారు. ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక, తుల్జాభవానీ ఆలయాలను ప్రభుత్వం మూసేసింది. గువాహటిలోని కామాక్షి ఆలయం, బెంగాల్లో రామకృష్ణా మిషన్‌ కేంద్ర కార్యాలయం బేలూర్‌ మఠంలోనూ అన్న సంతర్పణను నిరవధికంగా వాయిదా వేశారు.

ఇక వర్చువల్‌ కోర్టులు: సుప్రీం
కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో త్వరలో వర్చువల్‌ కోర్టులు నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ‘‘వచ్చే వారం నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా కేసుల విచారణ జరుపుతాం. రోగ వ్యాప్తికి సుప్రీంకోర్టు కేంద్రం కారాదన్నది మా అభిలాష’’ అని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ చెప్పారు. అన్ని రాష్ట్రాల హైకోర్టులతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నిరంతరం చర్చలు జరుపుతున్నారు. అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. కక్షిధారులు, న్యాయవాదులు, సిబ్బంది.. అందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని అత్యవసర కేసులు మాత్రమే చేపడతాం’ అని సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని జైళ్లలో ఖైదీలను కుక్కేసినట్లు ఉంచడం వల్ల కరోనా వ్యాప్తి చెందవచ్చన్న వార్తలను సుప్రీంకోర్టు స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించి అన్ని రాష్ట్రాలకూ నోటీసులు జారీ చేసింది.

శ్మశానంలో ఫ్రెంచి వాసి నిద్ర
భారత పర్యటనలో ఉన్న విదేశీయులు కరోనాతో నానా అగచాట్లూ పడుతున్నారు. వారికి ప్రజలు సహాయ నిరాకరణ చేస్తున్నారు. తిరువనంతపురం శివార్లలో అర్జెంటీనా మహిళ మరియా అర్థరాత్రి రోడ్డు పక్క ఒంటరిగా నిలబడి సహాయం కోసం ఎదురు చూడడం వివాదం రేపింది. ఏ హోటల్‌ లేదా లాడ్జ్‌లోనూ తనకు వసతి సౌకర్యం ఇవ్వట్లేదని ఆమె వెక్కివెక్కి ఏడ్చింది. ఆఖరికి పోలీసుల సాయం కోరినా వారూ వెంటనే స్పందించలేకపోయారు. చివరకు ఓ అంబులెన్స్‌లో మరియాను ఓ ఐసోలేషన్‌ సెంటర్‌కు పంపేశారు. స్పెయిన్‌కు చెందిన డేవిడ్‌, లాయా అనే భార్యాభర్తలదీ అదే పరిస్థితి. కొట్టాయంలో ఏ హోటల్‌ యాజమాన్యమూ వారికి వసతి ఇవ్వలేదు.

వారికి వైరస్‌ లక్షణాలు లేకపోయినప్పటికీ 28రోజుల పాటు క్వారంటైన్‌ చేశారు. కొట్టాయం జిల్లాలోని వాగమోన్‌లో ఓ ఫ్రెంచ్‌ జాతీయుడికి ఎక్కడా వసతి దొరకకపోవడంతో పెట్టే బేడాతో ఓ శ్మశానంలో నిద్రించడం పరిస్థితికి అద్దం పడుతుంది.  పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ విదేశీయుల నుంచి కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ప్రస్తుతం 5,150 మంది విదేశీయులున్నారు. స్పెయిన్‌ దేశస్థుణ్నుంచి 25 మంది డాక్టర్లు సహా 75 మందికి సోకినట్లు అనుమానిస్తున్నారు.

Courtesy Andhrajyothi