అయోధ్యపై మోదీ కీలక ప్రకటన

  • చైర్మన్‌గా సీనియర్‌ న్యాయవాది పరాశరన్‌
  • ట్రస్టు సభ్యుల్లో ఒకరు దళితుడు
  • 67.7 ఎకరాలూ ట్రస్ట్‌కు అప్పగింత
  • సున్నీ వక్ఫ్‌ బోర్డుకు వేరే చోట 5 ఎకరాలు
  • ఢిల్లీ పోలింగ్‌కు రెండ్రోజుల ముందు ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: అయోధ్యలో దివ్య, భవ్య రామాలయ నిర్మాణానికి 15 మందితో ఓ ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని పేరు: ‘‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’’. సీనియర్‌ న్యాయవాది కేశవ అయ్యంగార్‌ పరాశరన్‌ దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ ట్రస్ట్‌ ఏర్పడడంతో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అయోధ్యలోని రామాలయ స్థలాన్ని లాంఛనంగా ఆ ట్రస్ట్‌కు అప్పగించింది. ట్రస్ట్‌ ఏర్పాటును ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో స్వయంగా ప్రకటించారు. పూర్తి స్వతంత్రంగా పనిచేసే ఈ ట్రస్ట్‌ రామాలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని వ్యవహారాలనూ పర్యవేక్షిస్తుందని ఆయన చెప్పారు.

‘‘దేశ చరిత్రకు సంబంధించిన ఓ చరిత్రాత్మక అంశాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ విషయం నాతో పాటు కోట్లాది భారతీయుల హృదయానికి హత్తుకునే అంశం. దీన్ని వెల్లడించే అవకాశం నాకు దక్కడం ఓ అదృష్టంగా భావిస్తున్నాను. ఈ (బుధవారం) ఉదయం కేంద్ర మంత్రివర్గం సమావేశమై అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన ఓ స్థూల ప్రణాళికను ఆమోదించింది. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నందున ఈ విషయాన్ని సభలోనే వెల్లడిస్తున్నాను. అయోధ్యలో రామాలయ నిర్మాణ ట్రస్ట్‌ ఏర్పాటుకు సుప్రీంకోర్టు మూడు నెలల గడువిచ్చింది. ఆ గడువు ఈనెల 9న ముగియనుంది. అందుకే ఈరోజు దానికి ఆమోదముద్ర వేశాం’’ అని మోదీ అధికార పక్ష సభ్యుల హర్షధ్వానాలు, జైశ్రీరామ్‌ నినాదాల మధ్య ప్రకటించారు.

‘‘అయోధ్యలో స్థలాన్ని రామమందిర నిర్మాణం నిమిత్తం అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాక ప్రజలు దేశ ప్రజాస్వామ్య విలువలపై అద్భుతమైన విశ్వాసం చూపారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ, జైన, బౌద్ధ, సిక్కు… ఇలా అందరిదీ ఈ దేశం. మనమంతా ఒక కుటుంబం. వసుధైక కుటుంబ భావన మన ది. సర్వే జనాస్సుఖినో భవంతు అన్నది మన సంస్కృ తి. అందరం కలిసి ఈ మహారామాలయ నిర్మాణాని కి సహకరిద్దాం’’ అని మోదీ ప్రసంగంలో పేర్కొన్నారు. కాషాయ రంగు తలపాగాతో వచ్చి ఈ ప్రకటన చేయడం విశేషం. ‘అయోధ్య చట్టం కింద ఆ ప్రాంగణంలోపలా, వెలుపలా సేకరించిన 67.703 ఎకరాల భూమిని ట్రస్ట్‌కు బదలాయించాలని నిర్ణయించాం. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేరేచోట ఐదెకరాల భూమిని సున్నీ వక్ఫ్‌ బోర్డుకు కేటాయించడానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అంగీకరించింది’’ అని ప్రధాని వివరించారు.

సాధుసంతులతో ట్రస్ట్‌
రామాలయ ట్రస్ట్‌లో 9 మంది శాశ్వత సభ్యులు, ఆరుగురు నామినేటెడ్‌ సభ్యులు వెరసి 15 మంది సభ్యులుంటారని, వీరిలో ఒక దళితుడు కూడా ఉంటారని హోంమంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ఏ రాజకీయ పక్షానికి చెందినవారూ ఈ ట్రస్ట్‌లో లేరు. పరాశరన్‌ను అధిపతిగా చేసిన కేంద్రం ఎక్కువగా సాధు సంతులకు అవకాశం కల్పించింది.

శాశ్వత సభ్యులు వీరు: ప్రయాగ్‌రాజ్‌ జ్యోతిష పీఠాధిపతి స్వామి వాసుదేవానంద్‌, ఉడిపి మఠాధిపతి జగద్గురు మాధవాచార్య స్వామి విశ్వ ప్రసన్నతీర్థ, హరిద్వార్‌కు చెందిన యుగపురుష్‌ పరమానంద్‌, పుణేకు చెందిన స్వామీ గోవిందదేవ్‌, అయోధ్య రాజకుటుంబీ కుడు విమలేందు మోహన్‌ ప్రతా ప్‌ మిశ్రా, అయోధ్యలో హోమియోపతి డాక్టరు అనిల్‌మిశ్రా, 1989లో వీహెచ్‌పీ శిలాన్యాస్‌ సమయలో పునాదిరాయి వేసిన పట్నాకు చెందిన కమలేశ్వర్‌ చౌపాల్‌ అనే దళితుడు, నిర్మోహీ అఖాడా చీఫ్‌ మహంత్‌ ధీరేంద్ర దాస్‌.

నామినేటెడ్‌ సభ్యులు: ట్రస్ట్‌ ఎంపిక చేసుకునే ఇద్దరు వ్యక్తులు, కేంద్ర సర్వీసులో ఉన్న జాయింట్‌ సెక్రటరీ హోదా గల ఐఎఎస్‌ అధికారి, రాష్ట్ర ప్ర భుత్వ ఐఏఎస్‌ అధికారి, అయోధ్య కలెక్టర్‌ (ఎక్స్‌ అఫీషియో సభ్యుడు), రామాలయ నిర్మాణ ప్రాంగణ వ్యవహారాలు చూసే పాలకమండలి ఛైర్మన్‌(ఎక్స్‌ అఫీషియో సభ్యుడు) నామినేటెడ్‌ సభ్యులు. నామినేటెడ్‌ మెంబర్లంతా హిందువులై ఉండాలి.

పరాశరన్‌ ఇల్లే ట్రస్ట్‌ ఆఫీసు
రామాలయ ట్రస్ట్‌ కార్యాలయాన్ని ఢిల్లీలోని గ్రేటర్‌ కైలాష్‌ ప్రాం తంలో ఏర్పాటు చేస్తారు. ఈ కార్యాలయ భవనం ఎవరిదో కాదు. ట్రస్ట్‌ చైర్మన్‌, అయోధ్య కేసులో రామ్‌లలా, హిందూ పక్షాల తరఫు న ధాటిగా వాదనలు వినిపించిన మాజీ అటార్నీ జనరల్‌ పరాశరన్‌ ఇల్లేనని హోం శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం ఆయనను ‘పితామహ’ అని సంబోధిస్తుం ది. జడ్జీలకు కూడా ఆయనంటే ఎంతో గౌరవం. తాను మరణించేలోపు అయోధ్య కేసుకు సంబంధించి పూర్తి న్యాయం జరగాలని ఈ 92 ఏళ్ల లాయర్‌ విన్నవించడం ఇప్పటికీ అందరికీ గుర్తే.

ట్రస్ట్‌ సభ్యుల నియామక నోటిఫికేషన్‌ వెలువడగానే యూపీ సర్కారు అయోధ్యలోని రామాలయ స్థలాన్ని ఆ ట్రస్ట్‌కు లాంఛనంగా అప్పగించింది. 1994 నుంచి ఈ స్థలానికి రిసీవర్‌గా ఫైజాబాద్‌ కమిషనర్‌ ఉన్నారు. బుధవారం రాత్రి ప్రస్తుత కమిషనర్‌ ఎంపీ అగర్వాల్‌ ట్రస్ట్‌ సభ్యుల్లో ఒకరైన విమలేందు మోహన్‌ మిశ్రాకు ఓ పత్రికా సమావేశంలో ఆ బాధ్యతలను అప్పగించారు.

మా నమూనా ప్రకారమే…: వీహెచ్‌పీ
రామాలయ నిర్మాణం తాము రూ పొందించిన నిర్మాణ ఆకృతి ప్రకారమే సాగుతుందని విశ్వసిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్‌ పేర్కొంది. ‘‘మేం సూచించిన నమూనా ప్రకారమే అనేక స్తంభాలను సిద్ధం చేశా రు. 3 దశాబ్దాలుగా మా నమూనా ప్రకారమే రాతి చెక్కడాలు జరిగాయి. అయోధ్యలో 1990 నుంచి శిల్పాలు, స్తంభాలు చెక్కే పని సాగుతోంది’’ అని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు విష్ణు సదాశివ కోక్జే చెప్పారు. నవంబరు 9న సుప్రీంకోర్టు తీర్పునకు కొద్దిరోజుల ముందు దీన్ని నిలిపివేసి శిల్పులను వారి స్వగ్రామాలకు పంపారు.

18 కిలోమీటర్ల దూరంలో మసీదు
బాబ్రీ మసీదుకు బదులుగా సున్నీలు మసీదు కట్టుకోడానికి భూమిని అయోధ్య వివాదాస్పద స్థలానికి 18 కిలోమీటర్ల దూరం లో కేటాయించారు. అయోధ్య జిల్లాలో లఖ్‌నవూ హైవేపై ఉన్న ధన్నిపూర్‌ గ్రామంలో ఈ భూమి ఇస్తున్నట్లు యూపీ ప్రభుత్వ ప్రతినిధి శ్రీకాంత్‌ శర్మ తెలిపారు. సున్నీలు ఈ భూమిని తీసుకోడానికి అంగీకరిస్తే అది దేశంలోని ముస్లింలంతా అంగీకరించినట్లు కాదని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు స్పష్టం చేసింది. కాగా, ఐదెకరాల భూమిని తమకు ఇస్తే అక్కడ మరో రామాలయాన్ని తామే నిర్మిస్తామని షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు తెలి పింది. కాగా, అయోధ్య ట్రస్ట్‌ ఏర్పాటు ప్రకటన ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు రాదని ఈసీ స్పష్టం చేసింది.

ఢిల్లీ పోలింగ్‌కు ముందు..!
పోలింగ్‌కు సరిగ్గా 72 గంటల ముందు ప్రధాని మోదీ అయోధ్య ప్రకటన చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల కోసమే బీజేపీ సర్కారు ట్రస్ట్‌ ఏర్పాటు నిర్ణయాన్ని తాత్సారం చేసిందని విపక్షాలు విమర్శించాయి. హిందూ ఓట్ల సంఘటితమే లక్ష్యంగా మోదీ ఈ ప్రకటన చేశారని విశ్లేషకులంటున్నారు. కానీ ఈ విమర్శలను బీజేపీ కొట్టిపడేసింది. ఇందులో రాజకీయ కోణమేమీ లేదని, సుప్రీంకోర్టు గడువు సమీపిస్తుండడంతో కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు. మరోవైపు ప్రధాని ప్రకటనపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే హర్షం వ్యక్తం చేశారు. ‘సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ట్రస్ట్‌ ఏర్పాటు చేసినందుకు ప్రధానికి అభినందనలు’ అని సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు.

Courtesy Andhrajyothi