బంధాలు, నిర్బంధాలు తెంచుకొని మహిళలు విప్లవోద్యమంలోకి రావడమంటే..! పెద్ద సాహసం. కొండకోనలు దాటుతూ… అడవుల్లో సంచరిస్తూ… పార్టీ సిద్ధాంతమే జీవిత ధ్యేయంగా… మహోద్యమ సారథిగా నిలిచిన అలాంటి ఓ విప్లవనారీ కథే పైలా చంద్రమ్మది. పదకొండేళ్లప్పుడే ఉద్యమంలోకి వెళ్లి… పన్నెండేళ్లకు పైగా జైలు జీవితం గడిపిన ఆమెది ముళ్లబాట. ఆదివాసీలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సాగించిన అరవై ఏళ్ల పోరుబాట. అందులో ప్రతి ఘట్టం విప్లవ స్ఫూర్తిని రగిలించేదే. 

అది 1975. శ్రీకాకుళంలోని ఓ మారుమూల ప్రాంతం. చంద్రక్క, ఆమె భర్త పైలా వాసుదేవరావు, ఇతర దళ సభ్యులు జీడి తోటలో సమావేశమయ్యారు. గంజి అన్నం తింటూ మాట్లాడుకొంటున్నారు. ఇంతలో పోలీసులు తోటను చుట్టుముట్టి, కాల్పులు మొదలుపెట్టారు. అక్కడున్నవారంతా తలో దిక్కు పరిగెత్తారు. అడ్డంగా పది పన్నెండు అడుగుల ఎత్తున్న పెద్ద ముళ్ల కంచె. దళ సభ్యులంతా దాన్ని దూకేసి, చెట్లపైకి ఎక్కి దాక్కున్నారు. చంద్రమ్మ చీర ముళ్ల కంచెలో చిక్కుకుని, కింద పడిపోయారు. పోలీసులకు దొరికిపోయారు.

పోలీసులు చంద్రమ్మను అక్కడే ఓ చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. చిత్రహింసలు పెట్టారు. కామ్రేడ్ల సమాచారం ఇస్తే ఆస్తి, డబ్బు ఇచ్చి మళ్లీ పెళ్లి చేస్తామన్నారు పోలీసులు. ‘ఈ రోజు నేను చనిపోవచ్చు. కానీ మా దళం గురించి నా నుంచి ఒక్క ముక్క కూడా రాబట్టలేరు. నాకు నా బిడ్డ కంటే, నా కుటుంబం కంటే ఉద్యమమే ముఖ్యం’ అన్నారు చంద్రమ్మ. పోలీసులు మరింత హింసించారు. తుపాకులు గాల్లోకి పేల్చారు. దీంతో చంద్రమ్మ చనిపోయిందనుకుని దళ సభ్యులంతా వెళ్లిపోయారు. అర్ధరాత్రి వరకు పోలీసులు ఆమెను కొడుతూనే ఉన్నారు. ఆ దెబ్బలకు ఆమె స్పృహ తప్పి పడిపోయారు. కళ్లు తెరిచి చూసే సరికి చంద్రమ్మ ఓ పోలీసు అధికారి ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్నారు. మళ్లీ తీవ్రంగా కొట్టి, టెక్కలి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆవరణలో ‘ఓ గిరిజన వీరుడా…’ అంటూ విప్లవ గీతం ఆలపిస్తూ బయటకు వచ్చారామె. తరువాత బొడ్డపాడు రెండు హత్యల కేసులో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

పదొకొండేళ్లప్పుడే అడవి బాట పట్టిన చంద్రమ్మ దాదాపు పదమూడేళ్లు జైల్లో ఉన్నారు. భారత్‌లో అన్నేళ్లు జైలు జీవితం అనుభవించిన ఏకైక రాజకీయ ఖైదీ ఆవిడ. అరవై ఏళ్లు పైబడి విప్లవోద్యమంలోనే గడిపిన చంద్రమ్మ బాల్యాన్ని, యవ్వనాన్ని, వైవాహిక జీవితాన్ని, సమాజం ఎంతో గొప్పగా చూసే మాతృత్వాన్ని సైతం త్యాగం చేశారు. ఆఖరికి కన్న బిడ్డ ఎలా ఉందో, అసలు బతికుందో లేదో కూడా తెలియకుండా కొన్నేళ్లపాటు గడిపారు.

ఆమె గర్భవతి అని తెలిసి అబార్షన్‌ చేయించుకోమని పార్టీ సూచించింది. అయితే అప్పటికే ఏడో నెల కావడంతో ప్రమాదమని డాక్టర్‌ అబార్షన్‌ చేయలేదు. ప్రసూతి కోసం దళం నుంచి బయటకు రావాల్సివచ్చింది. రహస్యంగా తల దాచుకోవడానికి చాలా ఊర్లు తిరిగారు చంద్రమ్మ. ప్రసవం సమయం వచ్చింది. వేరే ఏదో పేరు చెప్పి ఆమెను హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. ఆడపిల్ల పుట్టింది. తరువాత పార్టీతో కాంటాక్ట్‌ లేక, తన కోసం  వచ్చేవారు లేక, పది రోజులు ఆస్పత్రిలోనే ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. తరువాత కొన్నాళ్లు ఓ ఇంట్లో తల దాచుకున్న చంద్రమ్మ, అక్కడి నుంచి డెన్‌కు చేరారు. మరి పసిపాపను ఎవరికి ఇవ్వాలి? డెన్‌లో కొండపల్లి సీతారామయ్య, కె.జి.సత్యమూర్తి దీనిపై సమాలోచనలు చేస్తుండగా… అక్కడే ఉన్న అత్తలూరి మల్లికార్జున్‌రావు… (తరువాత ఎన్‌కౌంటర్‌లో మరణించారు) ‘ఎవరికో ఎందుకు… మా ఇంటికే పంపిద్దాం’ అన్నారు.

గుంటూరు జిల్లా చింతలపూడి దగ్గర ఓ చిన్న ఊరు వాళ్లది. పాపను తీసుకువెళ్లిన ఒకావిడ ఆ ఊళ్లో దిగింది. ‘అత్తలూరి శేషయ్య గారి ఇల్లెక్కడ’ అని దారినపోతున్న ఒకాయన్ను అడిగింది. విశేషమేమంటే ఆయనే శేషయ్య. ఇంట్లోవాళ్లు పాపను అక్కున చేర్చుకోవడానికి తటపటాయిస్తున్న సమయంలో శేషయ్య మూడో కొడుకు అత్తలూరి జవహర్‌లాల్‌ నెహ్రూ బిడ్డను చేతుల్లోకి తీసుకున్నారు. అలా చంద్రమ్మ బిడ్డకు శేషయ్య, శిరోమణి దంపతులు తల్లితండ్రులయ్యారు. దళంలోకి వెళ్లిపోయిన చంద్రమ్మకు చాలా సంవత్సరాలు తనబిడ్డ గురించి ఆలోచించే అవకాశమే దొరకలేదు.

దాదాపు పదేళ్ల జైలు జీవితం తరువాత చంద్రమ్మ పెరోల్‌పై బయటకు వచ్చారు. నరనరాల్లో విప్లవోద్యమాన్ని జీర్ణించుకున్న ఆమె పెరోల్‌ను ఉల్లంఘించి మళ్లీ పార్టీలోకి వెళ్లిపోయారు. అది 1984. హైదరాబాద్‌లో 144 సెక్షన్‌ అమల్లో ఉంది. ఆ సమయంలో పార్టీ ఆదేశాల మేరకు చంద్రమ్మ కారులో ఆయుధాలు తీసుకువెళుతున్నారు. పోలీసులు పసిగట్టి, ఆమెను పట్టుకున్నారు.

72 ఏళ్ల వయసులో కరోనాతో చనిపోయే ముందు కూడా ఆమె ఉద్ధానంలో జరిగిన కామ్రేడ్‌ కుమార్‌ వర్ధంతి సభకు వెళ్లారు. ‘బయట కరోనా ఉంది. వెళ్లొద్దు’ అని కూతురు చెప్పినా వినలేదు. ‘నేను ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు చూశాను. కరోనా నన్నేం చేస్తుంది. ఆ సభకు నేను వెళ్లకపోతే ఎట్లా’ అన్నారు. ఆమెకు థైరాయిడ్‌, బీపీ, షుగర్‌ వంటి ఆరోగ్య సమస్యలెన్నో ఉన్నాయి. వేటినీ లెక్కచేయలేదు. కూతురు భయపడినంతా అయింది. ఆమెకు వైరస్‌ సోకింది. చంద్రమ్మ జీవితం శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంతంతో ముడిపడి ఉంది. అక్కడి రంగమటియా కొండలు ఆమెకు వైవాహిక జీవితాన్నిచ్చాయి. బిడ్డను త్యజించేలా చేశాయి. అందుకే ఆ కొండల్లో అప్పుడు… ఎప్పుడూ చంద్రక్క పేరు మారుమోగుతుంటుంది.

Courtesy Andhrajyothi