– ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కింద 14 శాతం మందికి రాని రేషన్‌
– 2 నెలల్లో పంచిన పప్పు ధాన్యాలు 40 శాతమే..
– ఆకలిచావులు పెరుగుతున్నా పట్టించుకోని కేంద్రం

న్యూఢిల్లీ : కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదల ఆకలి తీర్చుతామని ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ ప్యాకేజీ (పీఎంజీకేపీ) హామీని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో మోడీ సర్కారు దారుణంగా విఫలమవుతున్నది. గతనెలలో ఈ ప్యాకేజీ కింద జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ)తో పాటు ఉచితంగా ఇచ్చే ఆహారధాన్యాలు అందరికీ అందలేదు. మే నెలలో 14.4కోట్ల మంది రేషన్‌కార్డు దారులకు పీఎంజీకేపీ కింద అదనంగా ఇచ్చే సరుకులు అందలేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడైంది. గతనెల్లోనూ పీఎంజీకేపీ కింద ఇచ్చే సరుకులు 20కోట్ల మంది రేషన్‌కార్డు దారులకు అందలేదు. దేశంలో రేషన్‌కార్డు కలిగిన సుమారు 80 కోట్ల మందికి సాధారణంగా ఇచ్చే రేషన్‌తో పాటు ఐదుకిలోల బియ్యం, కిలో పప్పులను.. మూడు నెలల పాటు పీఎంజీకేపీ ద్వారా ఉచితంగా అందజేస్తామని కేంద్రం మార్చిలో ప్రకటించిన విషయం విదితమే. రెండ్రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. మే నెలలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కింద 86 శాతం మంది లబ్దిదారులకు బియ్యం, గోధుమలు, పప్పులు, ఇతర సరుకులు పంపిణీ చేశారు. అయితే పీఎంజీకేపీ కింద 65.8 కోట్ల మందికే కేంద్రం అందిస్తున్న ఉచిత సరుకులు అందాయి. ఈ లెక్కన మరో 14.4 కోట్ల మంది లబ్దిదారులకు కేంద్రం ఇచ్చిన హామీ నెరవేరలేదు.

తగ్గుతున్న పంపిణీ..
కేంద్ర గణాంకాల మేరకు.. పీఎంజీకేపీ కింద అందరికీ బియ్యం లేదా గోదుమలు, పప్పులు ఇచ్చి ఉంటే ఒక్కో నెలకు 40.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అవసరముం డేది. కానీ ఏప్రిల్‌ నెలలో 36.93 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పంపిణీ చేసిన కేంద్రం.. గతనెలలో 32.92 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్నే పంచింది. ఇక గతనెలలో సరిగా పంపిణీ చేయని రాష్ట్రాల జాబితా (పంజాబ్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, కర్నాటక, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌, ఒడిషా)ను విడుదల చేసిన మోడీ సర్కారు.. ఈ సారిమాత్రం అలాంటిదేమీ చెప్పలేదు.

పప్పులూ అంతంతే…!
మరోవైపు బియ్యం, గోదుమలతో పాటు కేజీ పప్పులను కూడా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఇది కూడా పూర్తిస్థాయిలో అమలుకాలేదు. రెండు నెలల్లో కలిపి 40 శాతం పప్పు ధాన్యాలనే పంపిణీ చేసినట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పినదాని ప్రకారం.. అందరికీ పప్పులను పంపిణీ చేసి ఉంటే నెలకు 2.36 లక్షల టన్నుల (రెండునెలలకు 4.72 లక్షల టన్నులు) ధాన్యం అవసరముండేది. కానీ రెండు నెలలకు కలిపి కేంద్రం పంచింది 1.91 లక్షల టన్నులే. ఇవే గాక ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా వలసకార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చునని గతనెల 14న నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అయితే దీని మీద అధికారిక లెక్కలు విడుదల కాకున్నా..ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ కథనం ప్రకారం 25 శాతం మంది వలసకూలీలు మాత్రమే లబ్ది పొందారని వెల్లడైంది.

10 కోట్ల మంది లబ్దిదారులకు మొండిచేయి..
అధికారిక లెక్కల ప్రకారం.. భారత్‌లో 80 కోట్ల మందికి రేషన్‌ కార్డులున్నాయి. అయితే ఇది 2011 జనాభా లెక్కలను ఆధారం చేసు కుని ఇచ్చారు. అయితే మరో 10.8 కోట్ల మంది పేదలు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారనీ, వారికి ఇంతవరకు కార్డులు రాక ఆకలితో అలమటిస్తున్నారని ఆర్థిక, సామాజికవేత్తలు జాన్‌ డ్రీజ్‌, మేఘ నా ముంగీకర్‌, రితికా ఖేర్‌ వంటి వాళ్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. అందరికీ రేషన్‌ కార్డులు అందజేసి యూనివర్సల్‌ పీడీఎస్‌ను కల్పించాలని కొంతకాలంగా కోరుతున్నా మోడీ సర్కారు పట్టించుకోవడం లేదు. ఓవైపు గోదాముల్లో మిగులు ధాన్యం పేరుకుపోయి అది పాడవుతున్నా.. కేంద్రం మాత్రం దాన్ని పేదలకు పంచడానికి మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నదని ఆహార, హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

వడ్డీ వసూళ్లపై సుప్రీం ఆగ్రహం
ఆర్‌బీఐని ప్రశ్నించిన న్యాయస్థానం
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ కాలంలో మారటోరియానికి అవకాశం కల్పిస్తూనే ఆర్‌బీఐ మరోవైపు వడ్డీ వసూలు చేస్తుండటాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ చేయాలంటూ దాఖలైన కేసులో ఆర్‌బీఐ సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆర్‌బీఐతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీనిపై విచారిస్తూ మారటోరి యం సమయంలో ఇఎంఐలపై వడ్డీ భారంపై బదులివ్వాలని సర్వోన్నత న్యాయస్థానం గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది. ఆగస్టు 31 వరకు పొడిగించిన మారటోరియం కాలానికి గానూ వడ్డీ మాఫీ చేయాలంటే బ్యాంకులు రూ.2 లక్షల కోట్లు నష్టపోవాల్సి వస్తుందని ధర్మాసనానికి ఆర్‌బీఐ నివేదించింది. మారటోరియంకు అనుమతిస్తూనే మరోవైపు వడ్డీపై ఎలాంటి ఉపశమనం లేకుండా చేయడం మరింత ప్రమాదకరమని ఆర్‌బీఐపై ఆగ్రహంవ్యక్తం చేసింది. ఈ కేసు లో తదుపరి విచారణను ఈనెల 12కు వాయిదా వేసింది.

Courtesy Nava Telangana