– ఎన్నికల్లో ప్రస్తావించని ఆ మూడు పార్టీలు..!!!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అనగానే అక్కడ ఉద్యోగావకాశాలు ఎక్కువే అనుకుంటారు. ఉపాధి వెతుక్కుంటూ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంత యువకులు కూడా ఢిల్లీ, పరిసర ప్రాంతాలకు వెళ్తారు. కానీ, అక్కడ అనుకున్నంతగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవనేది వాస్తవం. ఈ అంశాన్ని ప్రస్తుతం అక్కడ జరిగే ఎన్నికల్లో ప్రధాన పార్టీలుగా పోటీ పడుతున్న ఆప్‌గానీ, బీజేపీగానీ, కాంగ్రెస్‌గానీ ప్రస్తావించకపోవడం గమనార్హం.

తాజా గణాంకాలు : భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం(సీఎంఐఈ) తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం ఢిల్లీలో రెండేండ్ల క్రితంతో పోలిస్తే నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగింది. 2018 జనవరిలో నిరుద్యోగిత 2.2 శాతం కాగా, 2019 డిసెంబర్‌లో 11.2 శాతానికి చేరుకున్నది. జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లో వ్యవసాయ సంక్షోభమేమీ లేదు. ఎందుకంటే అది వ్యవసాయిక ప్రాంతం కాదు. అక్కడ ఉన్న పలు రకాల పరిశ్రమలే యువతకు ఉపాధి కల్పించే కేంద్రాలు. అక్కడ ఉపాధి కోసం నమోదైన వారిలో 10 నుంచి 12 తరగతులు పూర్తి చేసిన నిరుద్యోగులు 23 శాతం. అంటే ఆ స్థాయి విద్యార్హతలున్న ప్రతి నలుగురిలో ఒకరు నిరుద్యోగి అని అర్థం. వీరిలో ఎక్కువభాగం దిగువ మధ్యతరగతి, పేద వర్గాలకు చెందినవారేనన్నది గమనార్హం. డిగ్రీ పూర్తయినవారిలో నిరుద్యోగిత 17 శాతం కాగా, మహిళల్లో 46 శాతంగా నమోదైంది. అంటే సగంమంది మహిళలు ఉపాధిలేనివారే. ఈ సంఖ్య కూడా ఉద్యోగాల కోసం వెతుకులాడేవారిదే. ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదని ఇంటి పట్టునే ఉండే మహిళల్ని ఈ లెక్కల్లోకి తీసుకోలేదు.

నిరుద్యోగుల సంఖ్య కూడా సాంకేతికంగా ఆయా సంస్థల్లో రెగ్యులర్‌ ఉద్యోగులుగా నమోదుకాని వారితో కలిపి. అంటే వీరిలో కొందరు తక్కువ వేతనాలకు రోజు కూలీలుగా పని చేస్తున్నవారున్నారు. రిక్షా పుల్లర్స్‌, మూటలు మోసేవారు, సెక్యూరిటీ గార్డ్స్‌, షాపుల్లో గుమాస్తాలుగా, ఇంకా ఇతరత్రా చిన్నాచితకా పనులు చేసే లక్షలమంది ఉన్నారు. జాతీయ గణాంక సంస్థ(ఎన్‌ఎస్‌వో) 2018 ప్రథమ అర్థ సంవత్సరంలో నిర్వహించిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే(పీఎల్‌ఎఫ్‌ఎస్‌) ప్రకారం కాజువల్‌ కార్మికులు పొందుతున్న సగటు వేతనం రోజుకు రూ.376. అంటే నెలకు రూ.9500. ఇది ఏడో వేతన సంఘం సిఫారసు చేసిన కనీస వేతనం రూ.18000తో పోలిస్తే దాదాపు సగం మాత్రమే. రెగ్యులర్‌ కార్మికులు పొందుతున్న సగటు వేతనం రూ.18,760. ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం రూ.13,600. కార్మిక సంఘాల సర్వే ప్రకారం 20 శాతంకన్నా తక్కువమందే కనీస వేతనం పొందుతున్నారు. వీరిలోనూ చాలామంది రోజుకు 10 గంటల వరకూ పని చేస్తున్నారు. ఆ విధంగా పని చేయించడం చట్ట విరుద్ధం. రెగ్యులర్‌ ఉద్యోగుల్లోనూ మూడోవంతు మందికి ఉద్యోగ ఒప్పందం, కనీస సెలవులకు వేతనం పొందే సౌకర్యం, సామాజిక భద్రత లేకపోవడం మరో చేదు నిజం.

Courtesy Nava telangana