– 200 వాహనాలకుపైగా రవాణశాఖ నోటీసులు
– పట్టించుకోని ప్రభుత్వం
– ఆందోళనలో రోగులు

108 వాహనాలకు కాలం చెల్లింది. రాష్ట్రంలో అత్యవసర సేవలందిస్తున్న 108 వాహనాల్లో 50 శాతానికి పైగా కాలం చెల్లినవే కావడం గమనార్హం. ఈమేరకు రవాణాశాఖ జూన్‌లోనే ఈ వాహనాలకు నోటీసులు జారీ చేసి, నూతన ప్రభుత్వానికి నివేదించింది. కానీ అధికారం చేపట్టి మూడు నెలలు గడుస్తున్నా, ప్రభుత్వం 108సేవల ప్రక్షాళనకు చర్యలు ప్రారంభించ లేదు. జగన్‌ ప్రభుత్వంలోనూ 108 సేవల తీరు మారకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 439 వాహనాల్లో 200కు పైగా వాహనాలు కాలం చెల్లినవి కావడం, మరో 115 మండలాల్లో వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రమాదబారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
విజయనగరం జిల్లాలో 34 మండలాలకు కేవలం 27వాహనాలు మాత్రమే ఉన్నాయి. అందులో 13వాహనాలు కాలం చెల్లినవంటూ రవాణాశాఖ గతంలో నోటీసు జారీ చేసింది. అందులో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన పాచిపెంట, మక్కువ, సాలూరు, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ మండలాలతో పాటు మైదాన ప్రాంతంలోని ఎస్‌.కోట, గజపతినగరం, జామి, గరివిడి మండలాలకు చెందిన వాహనాలు ఉన్నాయి. జిల్లాలో మరో ఏడు మండలాలకు వాహన సదుపాయమే లేదు. ఈ నేపథ్యంలోనే అత్యవసర సమయంలో రోగుల చెంతకు వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

ఏజెన్సీ నిర్వహణ అధ్వానం
108సేవల ఏజెన్సీ నిర్వహిస్తున్న బివిజి (భారత వికాస్‌ గ్రూపు) సంస్థ అరకొరగా మందులు సరఫరా చేస్తుంది. అవి నాశిరకం మందులు కావడంతో ప్రాణాలకు ప్రమాదం నెలకొందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల మరమ్మత్తులు కూడా ఏజెన్సీ చేపట్టడం లేదు. దీంతో రోగులే వాహనాలను తోసుకోవాల్సి వస్తుంది. వాహనాలకు ఇంజన్‌ ఆయిల్‌ కూడా మార్చకపోవడంతో ఇంజిన్లు సీజ్‌ అవుతున్నాయి. అరిగిపోయిన టైర్లుతో వాహనం ఎక్కడ ఆగిపోతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటోంది. అత్యధిక వాహనాలకు స్టెచ్చర్లు కూడా దిగకపోవడంతో వాహనంపై రోగులను ఎక్కించడం సాధ్యం కావడం లేదు. ఇలా ఏజెన్సీ నిర్వహణ అధ్వానంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరికి సిబ్బంది జీతాలు కూడా చెల్లించడం లేదు. తప్పని పరిస్థితుల్లో వాహనాలు నడుస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన వాహనాలు కొనుగోలు చేయాలని సిబ్బంది కోరుతున్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించాలి
108 సేవలకు కొత్తవాహనాలు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే కొత్త వాహనాలు వచ్చేలోపు ఉన్నవి మూలకు చేరతాయి. వాహనాలు కొనుగోలుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.మరోవైపు ఏజెన్సీ నిర్వహణను గాడిలో పెట్టి, రోగులకు నాణ్యమైన సేవలు అందేలా చూడాలి. వీటన్నింటిపైనా ఇప్పటికే ప్రభుత్వానికి సంఘం ప్రతినిధులు నివేదించారు.
ఎస్‌.బంగార్రాజు, 108యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు

(Courtesy Prajashakti)