న్యూఢిల్లీ: 300 రైళ్లలోని మినీ కిచెన్‌లను తొలగించేందుకు రైల్వే శాఖ సిద్దమైంది. వాటి స్థానంలో ఎసి-3 టైర్‌ కోచ్‌లతో భర్తీ చేయనుంది. రైల్వే ఆదాయాన్ని పెంచాలన్న పేరుతో కార్మికులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. దీంతో సుమారు 10 వేల మందికి పైగా కార్మికుల ఉద్యోగాలపై ప్రభావం పడనుంది. మినీ కిచెన్‌లకు ప్రత్యామ్నాయంగా… ప్రయాణికులకు ప్యాక్‌ చేసిన ఆహారాన్ని అందించేందుకు ప్రధాన స్టేషన్‌లలో బేస్‌ కిచెన్‌లను ఏర్పాటు చేయాలని, లేదా ఇ-క్యాటరింగ్‌ ద్వారా అందించాలని రైల్వే యోచిస్తోంది. ఈ ప్రతిపాదనతో రైళ్లలో క్యాటరింగ్‌ వ్యాపారంపై ఆధారపడిన కార్మికుల జీవనోపాధిపై కోలుకోలేదని దెబ్బ పడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌, ప్రీమియర్‌ సర్వీస్‌లతో సహా 350 జతల రైళ్లు ఈ మినీ కిచెన్‌లను కలిగి ఉన్నాయి. ప్రతి కిచెన్‌లోనూ కుక్‌లు, వెయిటర్లతో కలిపి సుమారు 20 నుండి 30 సిబ్బంది ఉండవచ్చు. వారి ఉద్యోగ భద్రతపై ఆందోళన నెలకొంది.

మరోవైపు, మినీ కిచెన్‌ల స్థానంలో ఎసి-3 టైర్‌ కోచ్‌లతో ఏడాదికి రూ. 1400 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు భారతీయ రైల్వే జనరల్‌ సెక్రటరీ ఎం. రాఘవయ్య పేర్కొన్నారు. మినీ కిచెన్‌లతో రైల్వేకు ఎటువంటి ఆదాయం లభించకపోగా, రైళ్లలో కొంత స్థానాన్ని ఆక్రమిస్తున్నాయని అన్నారు. ఇ- కేటరింగ్‌, రేల్వే స్టేషన్‌లలో బేస్‌ కిచెన్‌లతో ప్రయాణికులకు ఆహారాన్ని అందించడం ద్వారా ప్రయాణికుల క్యాటరింగ్‌ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని ఆల్‌ ఇండియా రైల్వే మెన్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి శివగోపాల్‌ మిశ్రా అన్నారు.

కరోనా ప్రభావంతో గత ఏడాది మార్చి ఆగస్ట్‌ మధ్య కాలంతో పోలిస్తే.. ఈ ఏడాది రైల్వే ఆదాయం 42.3 శాతం తగ్గిందని అన్నారు. ఈ ఏడాది జూన్‌లో రైల్వే ఫైనాన్షియల్‌ కమిషనర్‌ అన్ని జోన్‌లకు ఒక లేఖను రాశారని అన్నారు. కొత్త పోస్టుల నిలుపుదల, రిటైర్ట్‌ అయిన సిబ్బందిస్థానంలో కొత్తవారిని నియమించ వద్దని, అవుట్‌ సోర్స్‌ కార్యకలాపాలకు కార్పోరేట్‌ సోషియల్‌ రెస్పాన్స్‌బిలిటీ ఫండ్స్‌ నిధులను సమకూర్చడం వంటి ఇతర చర్యలతో పాటు ఆర్థికేతర శాఖలను మూసివేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. రైల్వే యూనియన్లు కార్యాలయాల భవనాలకు రంగుల వేయడం, వాటిని పునర్‌నిర్మించడం వంటి వ్యర్థ వ్యయాలను తగ్గించాలని , కనీసం రెండేళ్లపాటు నిలిపివేయాలని లేఖలో పేర్కొన్నారు.

కాగా, ఈ నిర్ణయాన్ని రెండు యూనియన్‌లు సమర్థించడం గమనార్హం. మినీ కిచెన్‌లో ఉండే సిబ్బంది రైల్వే సిబ్బంది కాదని వారు వాదిస్తున్నారు. వీటిని ప్రైవేట్‌ కాంట్రాక్టర్లు నిర్వహిస్తుండటంతో ఉద్యోగులు కూడా కాంట్రాక్ట్‌ ఉద్యోగులే ఉంటారని ఆ యూనియన్‌లు పేర్కొంటున్నాయి.

Courtesy Prajashakti