– రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆదేశాలు

గువహతి : అసోంలో వివాదాస్పద నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ మళ్లీ చిచ్చు రేపేలా కనిపిస్తున్నది. కారణం.. తుది జాబితా నుంచి వేలాది మంది పేర్లు తొలగించనున్నారన్న వార్తలు రచ్చగా మారనున్నాయి. ఈ మేరకు సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు జారీ కావడం గమనార్హం. ఈ విషయంలో ఎన్నార్సీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ హితేశ్‌ దేవ్‌ శర్మ అధికారులకు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. అసోంలోని ఎన్నార్సీ తుది జాబితాలలలో చేర్చబడిన దాదాపు పది వేల ”అనర్హమైన వ్యక్తులు”, వారి వారసుల పేర్లు తొలగించనున్నారు. ఈ నిర్ణయంపై సమాచారం ఉన్న అధికారులు సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు.

పేర్ల తొలగింపుపై స్పీకింగ్‌ ఆర్డర్స్‌ జారీ చేయాలంటూ హితేశ్‌ దేవ్‌ శర్మ ఇప్పటికే రాష్ట్రంలోని అందరు డిప్యూటీ కమిషనర్లు, సిటిజెన్‌ రిజిస్ట్రేషన్‌ జిల్లా రిజిస్ట్రార్‌ (డీఆర్‌సీఆర్‌)లకు లేఖలు సైతం రాయడం గమనార్హం. ”వెబ్‌ఫాం ద్వారా మీ నుంచి అందిన నివేదికల ప్రకారం.. డీఎఫ్‌ (డిక్లేర్డ్‌ ఫారీనర్స్‌), డీవీ (‘డీ’ ఓటర్స్‌), పీఎఫ్‌టీ ( పెండింగ్‌ ఇన్‌ ఫారీనర్స్‌ ట్రిబ్యునల్స్‌) లకు చెందిన కొన్ని అనర్హమైన వ్యక్తులతో పాటు వారి వారసుల పేర్లు ఎన్నార్సీలో చేర్చినట్టు కనుగొన్నాం” అని శర్మ తెలిపారు.

సిటిజెన్‌షిప్‌లోని సంబంధిత క్లాజ్‌ ప్రకారం అలాంటి పేర్లను ఎన్నార్సీ నుంచి తొలగించే విధంగా ఆర్డర్లు జారీ చేయాలంటూ అన్ని జిల్లాల అధికారులను శర్మ ఆదేశించారు. అయితే, ఎన్నార్సీ విషయంలో వేలాది మంది పేర్లను తొలగించనున్నారన్న వార్త అసోం వాసుల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నది. అసోంలో తుది ఎన్నార్సీ జాబితాను గతేడాది ఆగస్టులో బహిరంగపర్చాచారు. మొత్తం 3,30,27,661 మందికి గానూ లక్షలకు పైగా పేర్లను జాబితా నుంచి తొలగించారు. ఆ సమయంలోనూ ఎన్నార్సీ తుది జాబితాపై అనేక ఆందోళనలు, అల్లర్లు, నిరసనలు చెలరేగాయి. అనేక ఏండ్లుగా నివసిస్తున్న సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖుల పేర్లు సైతం తుది జాబితాలో కనిపించలేదు. అయితే దీనిని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఇంకా నోటిఫై చేయాల్సి ఉన్నది.

Courtesy Nava Telangana