భార్య, కూతురిని కూర్చోబెట్టుకుని తొక్కిన రిక్షావాలా
రాంచీ, జూన్‌ 24: తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోన్న తన భార్యను ఓ రిక్షావాలా చికిత్స కోసం తన ఇంటికి దగ్గరలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే, కరోనా భయంతో చికిత్స చేయబోమని వైద్యులు చెప్పేశారు. దీంతో భార్య ప్రాణాలు కాపాడుకోవాలన్న తపన ఆయనను 100 కిలోమీటర్ల మేర సైకిలు తొక్కేలా చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాకు చెందిన హరి తన భార్య బంధానీ (29), కూతురు (7)ని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లోని గంగా మెమోరియల్‌ ఆస్పత్రి వరకు తొక్కాడు. ఆ సైకిల్‌ను కూడా అద్దెకు తీసుకొచ్చాడని తెలుసుకున్న వైద్యులు హరి భార్యకు ఉచితంగా ఆపరేషన్‌ చేసి మానవత్వం చాటుకున్నారు. పురూలియాలో వైద్యులు కరోనా భయంతో తన భార్యను ముట్టుకోవడానికి కూడా నిరాకరించారని, ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని హరి చెప్పాడు. 1990లో తన తండ్రి వైద్యం అందక చనిపోయారని హరి భార్యకు ఉచితంగా ఆపరేషన్‌ చేసిన వైద్యుడు ఎన్‌.సింగ్‌ చెప్పారు. డబ్బుల్లేకుండా వైద్యానికి వస్తే తాను నిరాకరించబోమని ఆ సమయంలో తన తల్లికి తాను మాట ఇచ్చాన ని వివరించారు.

Courtesy Andhrajyothi