• 220 రోజుల పనిదినాల్లో మిగతా 20 రోజులు కౌన్సెలింగ్‌.. ఇంట్లో ఉన్న వంద రోజుల పాటు ఆన్‌లైన్‌ బోధన 
  • షిప్టులవారీగా బడికి పిల్లలు
  • కరోనా నేపథ్యంలో కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ : నూతన విద్యా సంవత్సరంలో బడికి పిల్లలు 100 రోజులు మాత్రమే వెళ్లే అవకాశం ఉంటుందేమో! మరో 100 రోజుల పాటు వారు ఇంటికే పరిమితమై ఆన్‌లైన్‌ ద్వారా విద్యాభ్యాసాన్ని కొనసాగించవచ్చునేమో! అలాగే ఇప్పటి మాదిరిగా కాకుండా ఒకరోజు కొన్ని తరగతులు.. మరొక రోజు ఇంకొన్ని తరగతుల పిల్లలను బడిలోకి అనుమతించవచ్చు. పీరియడ్‌ నిడివి 45 నుంచి 30 నిమిషాలకు తగ్గొచ్చు! ఇంకా ఎన్నో మార్పులు!! దేశంలో కరోనా వైరస్‌ విస్తృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యా విధానంలో మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం పాఠశాలల పనిదినాలు 220 రోజులుగా ఉన్నాయి. ఈ పనిదినాల్లో మార్పు ఉండబోదు. అయితే 220 రోజుల్లో బడికి పిల్లలు 100 రోజులు మాత్రమే వెళ్లే విధంగా మరో 100 రోజులు ఇంటి వద్దే ఆన్‌లైన్‌ ద్వారా చదువుకునే విధంగా షెడ్యూల్‌ను రూపొందిస్తున్నామని కేంద్ర మానవ వనరుల శాఖ వర్గాలు వెల్లడించాయి. మిగితా 20 రోజులను విద్యార్థులకు బడుల్లో లేదంటే ఇళ్లలో  కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి కేటాయిస్తున్నామని తెలిపాయి. ఈ వివరాలతో ‘‘పాఠశాలల పునఃప్రారంభం’’ పేరిట త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేయబోతున్నామని చెప్పాయి.

ఐదో క్లాసులోపు పిల్లలు వారానికి 2సార్లే
ఒకసారి 30-50 శాతం విద్యార్థులను మించి స్కూలుకు హాజరుకాకుండా చూసుకోవాలని, బడిని రెండు షిఫ్టులు నడిపించేలా కేంద్ర మానవ వనరుల శాఖ ప్రతిపాదించింది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు వారానికి రెండుసార్లు… 6 నుంచి 8వ తరగతి విద్యార్థులు వారానికి 2 నుంచి 4 సార్లు… 9 నుంచి 12వ తరగతి వరకు వారానికి 4 నుంచి 5సార్లు బడికి వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. బోధనా పరంగా టైమ్‌ టేబుల్‌ను కూడా మార్చనుంది. ప్రస్తుతం 45 నిమిషాల పాటు బోధించే ఒక పీరియడ్‌ను 30 నిమిషాలకు కుదించాలని భావిస్తోంది. పరీక్షల విధానాన్నీ సవరించాలని ఆలోచిస్తోంది. ఒత్తిడి లేని అసె్‌సమెంట్‌ లేదా పరీక్షలకు మొగ్గుచూపుతోంది. 5వ తరగతి లోపు విద్యార్థులకు స్కూలు బ్యాగు తప్పనిసరి కాదని నిర్ణయించే అవకాశం ఉంది. మరోవైపు, వివిధ ప్రాంతాలకు వసల వెళ్లి తిరిగి వచ్చిన కార్మికుల పిల్లలకు దగ్గర్లోని బడుల్లో ప్రవేశం కల్పించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల కు కేంద్రం సూచించనుంది. ఏదైనా గుర్తింపు కార్డు ఆధారంగా అడ్మిషన్‌ ఇవ్వాలని, టీసీ అడగకూడదని ప్రతిపాదించనుంది.

సామాజిక దూరం…శానిటైజేషన్‌
కరోనా వ్యాప్తిని అరిట్టడంలో భాగంగా పాఠశాలల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించనుంది. భౌతిక దూరం పాటించడానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేయనుంది. విద్యార్థులను రవాణా చేసే వాహనాలను రెండు రోజులకు ఒకసారి శానిటైజ్‌ చేయడం, ఒకే సీటులో ఒకే విద్యార్థి కూర్చొవడం వంటివి అవంభించాలని పేర్కొననుంది. పాఠశాలలు థర్మామీటర్లు, సబ్బులు, మాస్కులు అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంటుంది. మరోవైపు మధ్యాహ్న భోజనానికి సంబంధించి పలు మార్గదర్శకాలు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. కూరగాయలను పసుపు, ఉప్పుతో కడగడం, వంట చేసేవారికి, వారి సహాయకులకు రోజూ థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయడం వంటి అంశాలు అందులో పొందుపర్చనున్నట్లు చెప్పారు.

Courtesy Andhrajyothi