మహిళల్లో 27శాతానికి పైగానే
నిరుద్యోగ యువత 28శాతం
రెండేండ్లలో రెండు కోట్ల మందికి పైగా నిరుద్యోగులు
సీఎంఐఈ తాజా గణాంకాలు
న్యూఢిల్లీ : కేంద్రంలో మోడీ సర్కారు అనుసరిస్తున్న అస్థవ్యస్త ఆర్థిక విధానాలు.. అనాలోచిత నిర్ణయాలు.. దేశంలోని నిరుద్యోగులకు శాపంగా మారాయి. ఫలితంగా నిరుద్యోగితరేటు రికార్డుస్థాయిలో పెరిగిపోతున్నది. ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సీఎంఐఈ)’ తాజా గణాంకాలే దీనిని స్పష్టం చేస్తున్నాయి. దేశంలో నిరుద్యోగిత రేటు ఈ ఏడాదిలో దాదాపు 10శాతానికి చేరిందని సీఎంఐఈ లెక్కలు తెలుపుతున్నాయి. అదేవిధంగా దేశంలో నిరుద్యోగ యువత 28శాతంగా ఉన్నారనీ, మహిళల్లో నిరుద్యోగిత రేటు 27శాతానికి పైగానే నమోదైందని తాజా గణాంకాలు వెల్లడించడం గమనార్హం.
దేశంలో 4.5 కోట్ల మంది నిరుద్యోగులు
సీఎంఐఈ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. దేశంలో నిరుద్యోగం మరింతగా విజృంభిస్తున్నది. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి దేశంలో మొత్తం 4.5 కోట్ల మంది నిరుద్యోగులున్నారు. గతే డాది ఈ సంఖ్య 3.4కోట్లుగా ఉండగా.. ఏడాది వ్యవధిలోనే దేశం లోని నిరుద్యోగుల సంఖ్య 1.1 కోట్లకు పైగా పెరగడం గమనార్హం. 2018లో దేశంలో నిరుద్యోగుల సంఖ్య 3.4 కోట్లుగా ఉండగా.. 2017లో వారి సంఖ్య 2.4 కోట్లు నమోదైంది. కాగా,దేశంలో నిరుద్యోగితరేటు 9.94శాతం(దాదాపు 10శాతానికి) రికార్డవ్వడం ఆందోళన కలిగిస్తున్నది.
నిరుద్యోగ యువత మూడు కోట్లకు పైగానే
మోడీ పాలనలో దేశంలోని యువతలో నిరుద్యోగం మరింతగా పెరిగిపోయింది. ఈ ఏడాదిలో నిరుద్యోగ యువత(20 నుంచి 29 ఏండ్ల మధ్య వయసు కలవారు) సంఖ్య 3.07 కోట్లకు చేరుకున్నది. రెండేండ్ల క్రితం నిరుద్యోగ యువత సంఖ్య 1.78 కోట్లు. అంటే రెండేండ్లలోనే ఈ సంఖ్య 73శాతం పెరగడం యువతలో నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది. ఇక మొత్తంగా చూసుకుంటే దేశంలో ప్రస్తుతం నిరుద్యోగ యువత 28శాతంగా ఉన్నది.
మహిళలదీ అదే స్థితి
దేశంలోని శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం మరింతగా దిగజారుతున్నది. వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో మహిళా నిరుద్యోగిత క్రమక్రమంగా పెరుగుతున్నది. 2019లో మహిళా నిరుద్యోగిత రేటు 27.1శాతంగా నమోదైంది. 2018 లో మహిళ నిరుద్యోగిత రేటు 21.8శాతంగా ఉండగా.. 2017లో 16.7శాతంగా నమోదైంది. అంటే రెండేండ్లలోనే నిరుద్యోగిత రేటు దాదాపు 10శాతానికి పైగా పెరగడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తున్నది. దేశంలో నిరుద్యోగితపై ఇంత ఆందోళనకర పరిస్థితి నెలకొన్నప్పటికీ.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలో కేంద్రం ఆసక్తికనబర్చడం లేదు. యువతకు ఉద్యోగాలు ఎలా సృష్టించాలనే ఆలోచన చేయకుండా.. ఎంతసేపూ కార్పొరేట్లకు సులభంగా బ్యాంకు రుణాలు కల్పించడం, పన్ను తగ్గింపులు, ఇతరత్రా ఉద్దీపనా చర్యలకు మోడీ సర్కారు పూనుకుంటున్నది. 2018-19కి గానూ కార్పొరేట్ల నెట్‌ ప్రాఫిట్‌ 22.3శాతానికి పెరిగాయి. కార్పొరేట్లపై కేంద్రం ఇంత ప్రేమ చూపినప్పటికీ దేశంలో అదనంగా ఉద్యోగాలు ఏమాత్రం సృష్టింపబడలేదన్నది వాస్తవం.
దేశంలో చాలా మంది ప్రజలు అర్హత, నైపుణ్యం ఉన్నప్పటికీ మంచి ఉపాధి లభించకపోవడంతో.. నామమాత్రపు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈక్రమంలో వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. దేశంలో వీరి సంఖ్య 30 నుంచి 35శాతం వరకు ఉండొచ్చని కొన్ని అంచనాలు వెల్లడిస్తున్నాయి. సీఎంఐఈ లెక్కల ప్రకారం.. దేశంలో 1.13 కోట్ల మంది గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగానే ఉన్నారు. ఇందులో 17.4శాతం మంది గ్రాడ్యుయేట్లు వారి విద్యార్హతకు తగిన ఉద్యోగాలను పొందలేకపోతున్నారు. కాగా, దేశంలో నిరుద్యోగ సమస్య ఆందోళనకరంగా ఉన్నప్పటికీ అలాంటిదేమీ లేదన్నట్టు మోడీ సర్కారు వ్యవహరిస్తున్నది. దేశంలో నెలకొన్న ప్రస్తుత ఆర్థిక సంక్షోభంపైనా అలాంటి ప్రకటనలే చేస్తున్నది. దేశంలోని యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని 2014లో చెప్పిన మోడీ ఆ తర్వాత మాటతప్పారు. మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ.. యువతకు ఉద్యోగాల ఊసేలేదు. ఉన్నవి ఊడిపోతున్నాయి. వేతనాలు తగ్గుతున్నాయి.
అయితే, దేశంలో ‘తెరమీద’కు వచ్చిన ఆర్థిక సంక్షోభం పేరు చెప్పి నిరుద్యోగ సమస్య నుంచి మోడీ సర్కారు తప్పించుకోవాలని చూస్తున్నది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేవలం కార్పొరేట్లు, సంపన్నులకు మాత్రమే తాయిళాలు ప్రకటించిన కేంద్రం.. దేశంలోని సామాన్య ప్రజలు, యువత, నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదు. ప్రజలకు మౌలికసదుపాయాల అభివృద్ధిపై పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉన్నప్పటికీ మోడీ సర్కారు అటువైపుగా ఆలోచించకపోవడం గమనార్హం. కేంద్ర సర్కారు ఆర్థిక విధానాలతో మున్ముందు నిరుద్యోగిత రేటు మరింత అధికమయ్యే ప్రమాదమున్నదని పలువురు ఆర్థిక వేత్తలు, రాజకీయ విశ్లేషకులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Courtesy Nava telangana…